అండంతో ఫలదీకరణానికి యత్నిస్తున్న శుక్ర కణాలు
వాషింగ్టన్ : పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి విడుదలై వేల సంఖ్యలో అండం వద్దకు చేరుకునే శుక్ర కణాలు దానిలోకి చొచ్చుకెళ్లేందుకు పోరాడి విజయం సాధించి ఫలదీకరణం చెందుతాయనే థియరీ కొన్ని దశాబ్దాలుగా మనకు తెలుసు. కానీ, ఆ థియరీ తప్పని తాజా పరిశోధనల్లో తేలింది. స్త్రీ జీవి అండానికి శ్రేష్టమైన శుక్ర కణాన్ని తనంతట తాను ఎంచుకొని పునరుత్పత్తి చేయగల సామర్ధ్యం ఉందని పరిశోధకులు పేర్కొంటున్నారు.
వేల సంఖ్యలో వచ్చే శుక్ర కణాల్లో ‘శ్రేష్టమైన’ ఒక కణాన్ని మాత్రమే ఎన్నుకుని అండం ఫలదీకరణం చెందుతుందని వెల్లడించారు. దీంతో ఇప్పటివరకూ ఫలదీకరణం సూత్రాన్ని వివరిస్తున్న ‘మెండెల్స్ సూత్రం’ సరైంది కాదని తేలింది.
మెండెల్స్ సూత్రం ఏం చెబుతుంది..
వేల నుంచి లక్షల సంఖ్యలో తన వద్దకు చేరుకునే శుక్ర కణాల్లో ఏదో ఒకదానితో (ప్రత్యేకంగా ఎంపిక చేసుకోకుండా) అండం ఫలదీకరణం చెందుతుందని మెండెల్స్ సూత్రం చెబుతుంది.
అండం ఎలా ఎన్నుకుంటుంది
అండం ఒక శుక్ర కణాన్ని శ్రేష్టమైనదిగా ఎలా గుర్తిస్తుందన్న విషయాన్ని మాత్రం పరిశోధకులు క్షుణ్ణంగా వివరించలేకపోయారు. అయితే, ఎలుకల మీద ఈ దిశగా చేసిన పరిశోధనల్లో అండం అనారోగ్యంగా ఉన్న శుక్రకణాలతో ఫలదీకరణానికి నిరాకరిస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా మరికొన్ని శుక్ర కణాలు అండాన్ని చేరుకోకముందే చనిపోతున్నట్లు పరిశోధకులు చెప్పారు.
ఫోలిక్ యాసిడ్‌ది కీలకపాత్ర
అండం పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి విడుదలైన శుక్ర కణాల్లో ఎలా ఎంపిక చేసుకుంటుందన్న ప్రక్రియపై స్మిత్ సోనియన్ ట్రాపికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన డా. నెడెయూ మరో రెండు ప్రక్రియలను ప్రతిపాదించారు.
1. శుక్ర కణం, అండాల్లో ఉండే బీ విటమిన్(ఫోలిక్ యాసిడ్) సూచనలతోనే ఫలదీకరణ ప్రక్రియ జరగుతుంది. బలహీనంగా లేదా అనారోగ్యంగా ఉన్న శుక్ర కణాన్ని ఫలదీకరణానికి ఎన్నుకోకుండా ఉండటానికి ఫోలిక్ యాసిడ్ అండానికి సాయపడుతుంది.
2. అండం పూర్తిగా తయారవకముందే శుక్ర కణానికి చెందిన రూపు అందులో ఉంటుంది. అండంలో ఉన్న శుక్ర కణాన్ని బట్టి ఫలదీకరణకు దాన్ని సరిపోలే శుక్రకణాన్ని అండం ఎంచుకుంటుంది. అయితే, ఈ ప్రక్రియ పూర్తిగా ఊహాజనితమని డా. నెడెయూ తెలిపారు. ఇందుకు సంబంధించి పరిశోధనలు చేయాల్సివుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment