ల్యాబ్‌లో అండం... కోరుకున్నప్పుడే గర్భం!
ఒక మహిళ పెళ్లి కాకముందే లేదా పెళ్లయిన కొత్తలోనే దీర్ఘకాలికమైన వ్యాధికి గురైంది. ఆ వ్యాధులకు చికిత్సలు చేసే క్రమంలో ఆమె అండాలు నశించిపోవచ్చు. అదే జరిగితే భవిష్యత్తులో వాళ్లకు పిల్లలు పుట్టడం ఎలా? అందుకే వ్యాధికి అసలు చికిత్స మొదలుకాకముందే... ఆయా మహిళలనుంచి అండాలను సేకరించి, నిల్వ చేసుకుని... చికిత్స అంతా పూర్తయ్యాక వాళ్లకు గర్భధారణ జరిగేలా చేయవచ్చా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నాయి ఆధునిక వైద్యశాస్త్ర పరిశోధనలు.
ఇక వారితో పాటూ కెరియర్ కోరుకునే అమ్మాయిలూ ఇదే శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. వైద్యరంగంలో ఎన్నో పరిశోధనలూ, మరెన్నో విప్లవాత్మకమైన మార్పులూ, ఆవిష్కరణలు జరుగుతున్న ఈ రోజుల్లో... ‘అండాన్ని’ నిల్వ చేయడం, దాన్ని ఉపయోగించి ఆ తర్వాత భవిష్యత్తులో తాము కోరుకున్న సమయంలో బిడ్డను కనడం సాధ్యమే. ఇలా అండాన్ని భద్రపరచడాన్ని ‘ఊసైట్ క్రయోప్రిజర్వేషన్’ అంటారు. దీన్ని గురించి తెలుసుకోవడం కోసమే ఈ కథనం.
దాచుకోవడం ఎందుకు?
కెరియర్లోని కీలక సమయంలో పిల్లల్ని కనడం కెరియర్ పరంగా తన ఎదుగుదలకు అడ్డు కాకూడదని చాలామంది భావిస్తారు. అదే సమయంలో మాతృత్వపు మధురిమలకూ దూరం కాకూడదని కోరుకుంటారు. ఈ రెండింటికీ మధ్య సరిగ్గా గీత గీయగలిగే సౌలభ్యమే అండాన్ని భద్రపరచుకునే విధానమైన ‘ఊసైట్ ప్రిజర్వేషన్’. ఇది సామాజిక అవసరం (సోషల్ నెసిసిటీ) అయితే మరో అవసరం కూడా ఉంది. పుట్టబోయే ఆ అమ్మాయిలో ఎన్ని అండాలు ఉండాలన్నది మొదటే నిర్ణయమవుతుంది. తల్లి కడుపులో పడగానే ఆడపిల్లలో దాదాపు 70 లక్షల అండాలు ఉంటాయి. బిడ్డ పుట్టేనాటికి అవి 20 లక్షలకు తగ్గుతాయి.
ఇలా వాటి సంఖ్య క్రమంగా తగ్గుతూ పోతూ... అమ్మాయి రజస్వల అయ్యేనాటికి 30,000 - 40,000 అండాలు మాత్రమే ఉంటాయి. వీటిలో 400 మాత్రమే ప్రతినెలా విడుదల అవుతూ, ఫలదీకరణానికి ఉపయోగపడతాయి. అంటే వయసు పెరిగే కొద్దీ అండాలు నశిస్తూ పోవడం, వాటి నాణ్యత తగ్గిపోతూ ఉండటం, దాని వల్ల గర్భం రాకపోవడం, ఒకవేళ వచ్చినా పిండం ఎదుగుదల సరిగా లేకపోవడం, తరచూ అబార్షన్లు జరుగుతూ ఉండటం, పుట్టే శిశువులో జన్యుపరమైన లోపాలు, అవయవ లోపాలు ఏర్పడుతుండటం జరగవచ్చు. అందుకే వయసు మీరుతున్న కొద్దీ మహిళలో గర్భధారణ జరిగితే కొన్ని రకాల సిండ్రోమ్స్ వచ్చే అవకాశాలు పెరుగుతుంటాయి.
అండాల నాణ్యత ఏ వయసులో?
ఆడపిల్లలకు 18 ఏళ్ల వయసు నుంచి 30 ఏళ్ల వయసు మధ్యలో విడుదలయ్యే అండం చాలా నాణ్యంగా, ఉత్తమంగా ఉంటాయి. ముప్పయి ఒకటవ ఏటి నుంచి ముప్పయి ఐదు వరకు ఒక మాదిరిగా ఉంటాయి. 35 ఏళ్ల తర్వాత ఇటు అండాల సంఖ్య, అటు నాణ్యత బాగా తగ్గిపోతాయి. గర్భధారణ ఆలస్యమై పిల్లలు పుట్టని వారిలో ఈ తరహా సమస్యను అధిగమించడానికి ఇప్పటికవరకూ ఎవరైనా దాత నుంచి అండాన్ని స్వీకరించేవారు. ఆ అండాన్ని ‘డోనార్స్ ఎగ్’ అంటారు.
అండాలు దాచుకోవడం ఎలా?
ఇటీవలి శాస్త్రవిజ్ఞానం ద్వారా 18 నుంచి 28 ఏళ్ల వయసు మధ్యలో ఆరోగ్యకరమైన అండాలను భద్రపరచుకొని, వాటి ద్వారా తమకు కావలసిన సమయంలో బిడ్డను కనగలిగే పరిజ్ఞానం లభ్యమైంది. ఈ ప్రక్రియలో అండాశయాలను ప్రేరేపించి, అనేక అండాలు ఉత్పన్నమయ్యేలా చూసి, వాటిని ల్యాబ్‌లో మైనస్ 196 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తే... ఆ అండం ఎప్పటికీ నశించకుండా, నాణ్యతలో లోపం రాకుండా ఉంటుంది. ఆ ఉష్ణోగ్రత వద్ద అండం గాజుగడ్డలా మారి... జీవ, రసాయనపరమైన ఎలాంటి మార్పులకూ లోను కాకుండా ఎన్నేళ్లయినా ఉండిపోతుంది. కొన్నేళ్ల తర్వాత స్త్రీ మళ్లీ గర్భధారణను కోరుకుంటే... ఇప్పటి అంతగా నాణ్యత లేని అండం కంటే ఒకప్పటి నాణ్యమైన తన అండం సాయంతోనే గర్భధారణ జరిగేలా చేసుకోవచ్చు.
గర్భధారణ ప్రక్రియ జరిగేదెలా...?
అండాన్ని మైనస్ 196 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద భద్రపరచడాన్ని ఫ్రీజింగ్ అంటారు. ఇలా ఫ్రీజ్ అయిన అండాలను మళ్లీ మామూలు ఉష్ణోగ్రతకు చేర్చి సాధారణ స్థితికి తీసుకురావడాన్ని థాయింగ్ అంటారు. ఇలా సాధారణ ఉష్ణోగ్రత స్థాయికి తీసుకువచ్చిన అండంలోకి వీర్యకణాన్ని పంపిస్తారు. అలా ‘పిండం’ తయారవుతుంది. ఇలా తయారైన పిండాన్ని మహిళ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియ మనం కోరుకున్న సమయంలో చేసుకోవచ్చు కాబట్టి కెరియర్ను కోరుకునే మహిళలకు ఇది ఒక ఆప్షన్‌గా లేదా వరప్రదాయనిగా భావించవచ్చు.
విజయవంతమయ్యే రేటు...
ఇలా ఫ్రీజ్ చేసిన అండాన్ని సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకువచ్చి (‘థా’ చేసి), ఫలదీకరణ జరిపించి, గర్భాశయంలోకి ప్రవేశపెట్టే కేసుల్లో విజయవంతం అయ్యే అవకాశాలు... ఐవీఎఫ్, టెస్ట్‌ట్యూబ్ బేబీ, ఫ్రోజెన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లాంటి ప్రక్రియల్లో లాగానే 40% నుంచి 60% వరకు ఉంటుంది.
ఎవరెవరికి... ఎప్పుడు...?
కొంతమంది ఆడవారిలో చిన్న వయసులోనే అనేక రకాల క్యాన్సర్లు బయటపడుతున్నాయి. వారికి కీమోథెరపీ, రేడియోథెరపీ వంటి చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. ఈ చికిత్స వల్ల అండాశయంలోని సున్నితంగా ఉండే అండాలు దెబ్బతినడం, నశించిపోవడం వంటి అనర్థాలకు అవకాశాలు ఎక్కువ. ఫలితంగా ఆ మహిళకు ఎప్పటికీ పిల్లలు పుట్టకపోవచ్చు. ఇలాంటివారు చికిత్సకు ముందరే... డాక్టర్‌ను సంప్రదించి, అండాలను భద్రపరచుకోవచ్చు. ఇక చికిత్స పూర్తయ్యాక, ఆరోగ్యం పూర్తిగా కుదుటపడ్డ తర్వాత - భద్రపరచిన తమ అండాలతో గర్భధారణకోసం ప్రయత్నించవచ్చు.
కొంతమంది కుటుంబ చరిత్రల్లో పీరియడ్స్ త్వరగా ఆగిపోవడం జరుగుతుంది (ప్రీ-మెచ్యుర్ మెనోపాజ్). ఇంకొందరిలో టర్నర్స్ సిండ్రోమ్ వంటి కొన్ని జన్యుపరమైన సమస్యలు ఉన్నప్పుడు కూడా అండాలు త్వరగా నశించిపోతాయి. మరికొందరిలో కొన్ని వైద్యకారణాల వల్ల చాలా చిన్నవయసులోనే అండాశయాలను తొలగించాల్సి రావచ్చు. ఇలాంటి వారు... భవిష్యత్తులో గర్భధారణ కోసం ముందుగానే అండాలు భద్రపరచుకోవచ్చు.
కొంతమంది మహిళలు ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం, కుటుంబ బాధ్యతల కోసం పెళ్లిని వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. ఆలస్యంగా పెళ్లిళ్లయ్యాక గర్భధారణ కోసం ప్రయత్నించేనాటికి వారి వయసు 35 ఏళ్లు దాటిపోతోంది. అప్పుడు జరిగే గర్భధారణలో ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ కాబట్టి... ఇలాంటి సందర్భాలు ఉన్నాయనుకున్న వారు ముందుగానే అండాలను భద్రపరచుకోవచ్చు.
ఏ మేరకు సురక్షితం?
ఈ ప్రక్రియపై ప్రయోగాలు 1980లో మొదలయ్యాయి. 1986లో ఇలా ప్రిజర్వ్ చేసిన అండంతో తొలి బిడ్డ పుట్టింది. మనదేశంలోనూ చెన్నైలో ఈ ప్రక్రియ ద్వారా తొలి బిడ్డ పుట్టింది. మనదేశంలోని పెద్ద నగరాల్లో ఈ ప్రక్రియ ద్వారా పిల్లలు పుడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ ఈ ప్రక్రియ ద్వారా 1500 మందికి పైగానే పిల్లలు పుట్టారు. ఇలా పుట్టిన పిల్లలపై చేసిన అనేక అధ్యయనాల్లో వారినీ, మామూలు పిల్లలతో పోల్చిచూసినప్పుడు వారిలో ఎలాంటి తేడాలూ కనిపించలేదు.
2012లో అమెరికన్ సొసైటీ ఆఫ్ రీప్రొడక్టివ్ మెడిసిన్... ఈ పద్ధతిని కేవలం వైద్యపరమైన ప్రతిబంధకాలు ఉన్నవారికి మాత్రమే ఉపయోగించుకునేందుకు అనుమతినిచ్చింది. మన దేశంలో ఈ ప్రక్రియ ద్వారా పిల్లలను కనేందుకు అవసరమైన చట్టబద్ధమైన నియమాలు, మార్గదర్శకాలు ఇంకా రూపొందలేదు. కానీ ఈ సౌకర్యం అందుబాటులోనే ఉంది. అయితే వైద్యపరమైన అవసరాలు ఉన్న వారిని మినహాయించి, మిగతావారూ ఈ ప్రక్రియను ఉపయోగించుకోవాలంటే... దీనిపై మరింత అవగాహన, మరిన్ని పరిశోధనలూ జరగాల్సిన అవసరం ఉంది.