పెరిగే వయసు... తగ్గే అవకాశాలు | Growing old ... Reduce the chances | Sakshi
Sakshi News home page

పెరిగే వయసు... తగ్గే అవకాశాలు

Published Sat, May 14 2016 11:50 PM | Last Updated on Tue, Oct 2 2018 4:09 PM

పెరిగే వయసు... తగ్గే అవకాశాలు - Sakshi

పెరిగే వయసు... తగ్గే అవకాశాలు

సందేహం
నా వయసు 29. ఈ మధ్యనే పెళ్లయ్యింది. నాకు కొన్నాళ్లు సంతోషంగా ఎంజాయ్ చేసి, తర్వాత పిల్లల్ని కనాలని ఉంది. కానీ త్వరగా బిడ్డని కనకపోతే ఇబ్బందులు వస్తాయని మావాళ్లు అంటున్నారు. అది నిజమేనా? ఇంకొక సంవత్సరం ఆగవచ్చా? లేక వెంటనే పిల్లల్ని కనేయమంటారా? ఒకవేళ ఆగవచ్చు అంటే ప్రత్యేక జాగ్రత్తలేమైనా తీసుకోవాలా?                                                 
- పి.సారిక, ఖమ్మం
 
సాధారణంగా ఆడవారిలో 22 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు పిల్లల్ని కనడానికి కావలసిన ప్రక్రియకు సంబంధించిన హార్మోన్స్, అవయవాలు, అండాశయాల పనితీరు.. అన్నీ సక్రమంగా ఉంటాయి. 30 సంవత్సరాలు దాటే కొద్దీ ప్రక్రియ మెల్లగా మందగించడం ప్రారంభమవుతుంది. దాంతో హార్మోన్ల తేడాలు, అండం నాణ్యత కొద్దికొద్దిగా తగ్గడం మొదలవుతుంది. దానివల్ల అబార్షన్లు, పిండంలో అవయవ, జన్యుపరమైన లోపాలు తలెత్తే అవకాశాలు పెరుగుతాయి. 33 సంవత్సరాలు దాటితే ఈ సమస్యలు ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి.

మీకు ఇప్పుడు 29 సంవత్సరాలు కాబట్టి, మీకు సంతోషంగా గడపాలని ఉంటే ఆరునెలలు గ్యాప్ తీసుకుని త్వరగా గర్భం కోసం ప్రయత్నించడం మంచిది. ఇంకా ఎక్కువ అంటే ఒక సంవత్సరం, అంతకంటే ఎక్కువ కాలం ఆగకపోవడమే మంచిది. ఈ గ్యాప్ కోసం మీరు low dose oral contraceptive pillsప్రతినెలా పీరియడ్ మొదలైన మూడో రోజు నుంచి 21 రోజుల వరకు వాడొచ్చు. లేదా మీవారు కండోమ్స్‌ను జాగ్రత్తగా వాడుకోవచ్చు. కానీ కండోమ్స్ ఫెయిలై గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఫెయిలైనా.. గర్భం ఉంచుకునే ఉద్దేశం ఉంటే కండోమ్స్ వాడొచ్చు.
 
నా వయసు 20. ఆరోగ్యంగానే ఉంటాను. అయితే ఈ మధ్య నా రొమ్ముల్లో తేడా గమనించాను. ఎడమ రొమ్ము కాస్త చిన్నగా ఉంది. అలాగే అందులో చిన్న చిన్న గడ్డలు రెండు ఉన్నాయి. దాంతో అనుమానం వచ్చి డాక్టర్ దగ్గరకు వెళ్లాను. పరీక్షలు చేసి ఏ సమస్యా లేదు, క్యాన్సర్ కాదని చెప్పారు. అయితే పిల్లలు పుట్టినప్పుడు పాలు రాకపోతే వేరే పరీక్షలు చేస్తాం అన్నారు. అంటే ఏంటి? ఒకవేళ పాలే రాకపోతే ఏం పరీక్షలు చేస్తారు? అదేమైనా ప్రమాదకరమైన సమస్యా?
  - చంద్రకళ, మెయిల్

 
కొందరిలో రొమ్ములు పెరిగే క్రమంలో, ఒకటి పెద్దదిగా మరొకటి చిన్నదిగా ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల ఎటువంటి సమస్యా ఉండదు. దాని గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొందరి రొమ్ముల్లో అటు ఇటు కదలాడే నొప్పి లేని చిన్న గడ్డలు ఏర్పడుతుంటాయి (హార్మోన్ల తేడా వల్ల ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి - ఇవి క్యాన్సర్ గడ్డలు కావు). వాటినే ఫైబ్రో అడినోమా (Fibro adenoma)అంటారు.

అవి పెరగకుండా ఉంటే ఫర్వాలేదు. కానీ అవి మరీ పెద్దగా పెరిగిపోతుంటే మటుకు ఆపరేషన్ చేసి తీసివేయవలసి వస్తుంది. ఆ గడ్డలు చిన్నగా ఉంటే పాలు రావటానికి ఎలాంటి సమస్యా ఉండదు. రొమ్ము చిన్నదైనా బిడ్డ దాన్ని చీకే కొద్దీ, పాలగ్రంథులు ప్రేరణకు గురై పాల ఉత్పత్తి జరుగుతుంది. అంతేకానీ పాలు రాకపోతే ప్రత్యేకంగా దానికోసమంటూ ఎలాంటి పరీక్షలు లేవు. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
- డా.వేనాటి శోభ
లీలా హాస్పిటల్ మోతీనగర్, హైదరాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement