టీనేజ్‌ పిల్లలు తిరగబడితే ..... | Though the voice of a teenager | Sakshi
Sakshi News home page

టీనేజ్‌ పిల్లలు తిరగబడితే .....

Published Mon, Sep 7 2015 11:28 PM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM

టీనేజ్‌ పిల్లలు  తిరగబడితే ..... - Sakshi

టీనేజ్‌ పిల్లలు తిరగబడితే .....

పడలేరు...  పడతారు! 

టీనేజ్‌లో మాట పడలేరు. స్వాభిమానం దెబ్బతింటే రాంగ్ రూట్‌లో పడతారు.
 చీటికీ మాటికీ టీనేజర్ మీద తిరగమాతలేస్తూ అవమానిస్తే... ఆ చిటపటలకి
 తిరగబడే పిల్లలు ఉన్నారు.... తిరిగిరాని పిల్లలున్నారు...
 ‘పేరెంట్స్ ఏది చేసినా ప్రేమతోనే చేస్తారు కదా’ అంటే చెల్లదు.
అడాలసెన్స్‌లో... అంటే కౌమారంలో పిల్లల హార్మోన్స్ డిస్కో ఆడుతుంటాయి.
వాటిని అవమానిస్తే తాండవిస్తాయి.
ఇలాంటి రియాక్షన్‌ల వల్ల మీ ప్రేమ కాస్తా కక్షలా కనబడుతుంది.
నెక్స్ట్ టైమ్ పిల్లల్ని మందలించేటప్పుడు కొంచెం మృదువుగా, ఇంకొంచెం సున్నితంగా...
తాలింపేస్తే... ిపిల్లలకు కెరీర్ పట్ల,  లైఫ్ పట్ల, రిలేషన్‌షిప్స్ పట్ల
అభి‘రుచి’ భేషుగ్గా ఉంటుంది.
సో... మై డియర్ పేరెంట్స్.... నాలుక మీద కొంచెం తేనె పూసుకోండి.
చెప్పేది మంచికే అయినా, కారాలు మిరియాలు నూరకండి.

 
 
గౌతమ్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ‘మీ అబ్బాయి ఎంతసేపూ స్నేహితులతోనే కబుర్లు, అస్సలు చదవడం లేదు’ అని చెప్పారు తల్లిదండ్రులతో టీచర్లు. ఇల్లు దాటకుండా బుద్ధిగా చదువుకోమని హెచ్చరించాడు తండ్రి. ఓ రోజు ఆఫీస్ నుంచి వచ్చాక గౌతమ్ కనిపించకపోవడంతో అతన్ని వెతుక్కుంటూ వెళ్లాడు తండ్రి. స్నేహితుల మధ్య నవ్వుతూ కనిపించాడు గౌతమ్. అంతే! తండ్రికి విపరీతమైన కోపం వచ్చింది. తన మాటంటే కొడుక్కి లెక్కలేకుండా పోయింది అనుకున్నాడు. ‘ఇంట్లో కుదురుగా చదవమంటే రోడ్డుపట్టుకు తిరుగుతున్నావా?’ అంటూ స్నేహితుల ముందే గౌతమ్‌ని కొట్టాడు తండ్రి. ఇంకోసారి మా అబ్బాయితో తిరిగితే మిమ్మల్నీ వదలను అంటూ గౌతమ్ స్నేహితులనూ నోటికొచ్చినట్టు తిట్టాడు. మరుసటి రోజు గౌతమ్ స్కూల్‌కి వెళ్లాడు. కానీ, తిరిగి ఇంటికి రాలేదు. తలిదండ్రులు కొడుకు కోసం వెతకని చోటంటూ లేదు. ఆర్నెల్ల తర్వాత గౌతమ్ దొరికాడు. పిల్లవాడిని దారిలో పెట్టడం ఎలాగ అని నిపుణులను సంప్రదించారు. ‘తప్పు గౌతమ్‌ది కాదు, స్నేహితుల ముందు అతడిని అవమానించిన మీదే’ అని వారు తల్లిదండ్రులకే కౌన్సెలింగ్ ఇచ్చారు నిపుణులు.
   
ఇంటి కి వచ్చిన బంధువులకు ఇవ్వమని తల్లి ఇచ్చిన టీ ట్రే తీసుకొచ్చింది శ్రీజ. ఆ ట్రే చేయిజారి కిందపడింది. ‘ఏ పనీ సరిగ్గా చేతకాదు. ఎద్దులా పెరగావు తప్పితే...’ బంధువుల ముందే తిట్లదండకం మొదలుపెట్టింది తల్లి. ఏడుస్తూ లోపలికెళ్లిపోయింది శ్రీజ. ఇక ఇంటికి బంధువులెప్పుడు వచ్చినా గదిలోనుంచి బయటకు రావడమే మానేసింది శ్రీజ. ఇంట్లో పేరెంట్సే పదే పదే ఇలాంటి మాటలు అంటుండంతో ‘నాకు ఏ పనీ చేయడం సరిగ్గా చేతకాదు’ అనే భావనలో ఉండిపోయింది. ఈ ప్రభావం చదువుమీద పడింది. స్కూల్లో యాక్టివిటీస్‌లోనే వెనగ్గానే ఉండిపోయింది.
 
ఎదిగే వయసులో పిల్లలను చిన్నచూపుతో చూస్తే జీవితాంతం చిన్నబోతారు. పెద్దవాళ్ల మీద ఎప్పటికీ తృణీకార భావంతోనే ఉంటారు. చాలామంది తమ పిల్లలను చిన్నవాళ్లుగానే భావిస్తూ ఏ చిన్న పొరపాటు చేసినా ఇతరుల ముందు, ఇంటికి వచ్చిన బంధువుల ముందు, వారి స్నేహితుల ముందు అవమానకరంగా మాట్లాడతారు. అలా ప్రవర్తిస్తున్నామనే విషయం కూడా పెద్దలకు తెలియదు. కానీ, ‘చిన్న మనసులు గాయపడి తాము పెద్దయ్యాక కూడా పెద్దవారిని క్షమించలేని స్థితికి చేరుకుంటారు. అంతేకాదు, పెద్దయ్యాక ఇంట్లోవారినే కాకుండా ఇతరులనూ చిన్నచూపు చూస్తారు. పిల్లలైనా సరే చిన్నబుచ్చే మాటలు మాట్లాడకూడదు.
 
చాలామంది పేరెంట్స్ చేసే పొరపాటు ఏంటంటే- ‘ఫ్రెండ్స్ వల్ల పిల్లలు పాడైపోతున్నారు’ అనుకుంటారు. ఫ్రెండ్‌షిప్‌ను కట్‌చేస్తే సరైన దారిలోకి వస్తారు అనుకుంటారు. అందుకే, ఫ్రెండ్స్ ముందే అవమానిస్తారు. ఫ్రెండ్స్‌తో  కలవనీయకుండా కట్టడి చేస్తారు. స్నేహాలు కట్ చేస్తే వారి మానసిక ఎదుగుదలా కట్ అయిపోతుంది. ఎవరితోనూ కలవని పిల్లల్లో ఒకలాంటి మొండితనం అలవడుతుంది. పెద్దలు చేయద్దు అన్నదే చేసి చూపించాలనుకుంటారు. అయితే, చెడు స్నేహాల వల్ల పిల్లలు చెడిపోతారు అని భయపడినప్పుడు సమాజంలో ఎలాంటి మనస్తత్వం గలవారుంటారో, ఎవరితో ఎలా మెలగాలో కొన్ని సంఘటనలు, తమ జీవితానుభవాలద్వారా చెప్పడం మంచిది.
 
ఈ వయసులో పిల్లలకు తమ శరీర ఎదుగుదల పట్ల బోలెడు సందేహాలుంటాయి. కొందరు పెద్దవాళ్లకు చెప్పుకోగలుగుతారు. కొందరు తమలో తామే కుమిలిపోతుంటారు. ఈ వయసులో ఏదైనా తెలిసీ తెలియక చేసే పనుల వల్ల ‘భారీగా శరీరమైతే పెంచావు, బుర్రమాత్రం పెరగలేదు’ అనే తిట్లు సహజంగా వింటుంటాం. అప్పటికే ‘నేనెందుకు ఇలా ఉన్నాను’ అనే కన్ఫ్యూజన్‌లో ఉంటారు పిల్లలు. అలాంటప్పుడు పెద్దల నుంచి వచ్చే పరుషపు మాటల వల్ల  సరైన ఆహారం తీసుకోరు. దీంతో అనారోగ్యసమస్యల బారిన  పడతారు. వీరిలో శారీరక వయసు కాకుండా మానసిక పరిణితి చూడాలి.
 
ఈ వయసులో పిల్లలకు ఊహలు ఎక్కువ, వేగం కూడా ఎక్కువ. నాకేం కాదు అనే పిచ్చి ధైర్యం ఉంటుంది. ఒక ప్రణాళిక లేకుండా వాస్తవానికి దూరంగా ఉంటారు. ‘నేను అలా అవుతాను, ఇలా సాధిస్తాను... కార్లు కొంటాను, బంగళాలు కడ్తాను’ వంటి పెద్ద పెద్ద కబుర్లు చెబుతారు. ఇలాంటప్పుడు పెద్దలు వెటకారంగా మాట్లాడేస్తారు. ‘ముందు ఈ పనిని సవ్యంగా చేయ్, మార్కులు సరిగ్గా తెచ్చుకుంటే అంతే చాలులే’ అంటుంటారు. చిన్న విషయానికే కోపం తెచ్చుకోవడం, అలగడం.. వంటివీ చూస్తుంటాం. ఈ నిరసనను పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. ప్రణాళిక ఉంటే అనుకున్నది సాధిస్తావని ప్రోత్సహించాలి.
 
తమను ఎదుటివారి ముందు అవమానకరంగా మాట్లాడుతున్నారనగానే ఉక్రోషంతో ఎదురు మాట్లాడుతారు. లేదంటే, ఏదో సందర్భంలో పెద్దవాళ్లను తిడతారు. దీంతో పిల్లల ప్రవర్తన పెద్దవాళ్లకు అర్థం కాదు. పిల్లలు దారి తప్పుతున్నారు అనే ఆందోళన, భయం లేకుండా పోతుంది.. ఇంకా బెదిరించాలి అనుకుంటారు. అందుకే ఇంకాస్త హెచ్చుస్వరంతో తిడతారు. కొడతారు. ఈ వయసు పిల్లలకు పెద్దల ఇలాంటి చేష్టలు అవమానకరంగా తోస్తాయి. తమ మీద ఈ పెద్దలకు ఏ మాత్రం ఇష్టం, ప్రేమ లేవు అనుకుంటారు. దీని వల్ల తమ బాధ్యతల పట్ల మరింత నిర్లక్ష్యంగా ఉంటారు. పిల్లల మానసిక ఎదుగుదలకు పెద్దల చిన్నచూపు ఓ చట్రంలా అడ్డుపడుతుంది.
 
‘ఈ ఏజ్‌లో పిల్లలు చాలా బద్ధకంగా ఉంటారు. ఉదయాన్నే నిద్రలేవకపోవడం, బద్దకంగా ఉండటాన్ని పెద్దలు ఇతరుల ముందు ఎత్తిచూపుతారు. ‘మా వాడంత లేజీబోయ్ ఎవరూ ఉండరు’ అని మాట్లాడేస్తుంటారు. ఇలాంటి మాటలు ఎంత యధాలాపంగా అన్నా అవి చిన్న మనసులను గాయపరుస్తూనే ఉంటాయి. ‘ఈ పెద్దవాళ్లు ఎలాగూ ఇలాంటే మాటలు అంటుంటారు’ అని చాలా తేలికగా తీసుకోవచ్చు. బద్ధకంగా ఉండే పిల్లలకు ‘నీ జీవితానికి నీవే కర్తవు’ అని భవిష్యత్తు పట్ల బాధ్యతను తెలియజేయాలి. ఆటలు, కళల్లో ప్రోత్సాహం కల్పిస్తే బద్ధకాన్ని వీడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
 
ఇవి గుర్తించండి...

ఈ వయసులో శారీరక, మానసిక ఎదుగుదలలో హార్మోన్ల ప్రభావం ఎక్కువ. పిల్లలు తమకు నచ్చని విధంగా ప్రవర్తించినప్పుడు పెద్దలు గట్టిగా అరవడం, ఇతరుల ముందు చులకనగా మాట్లాడటం వెంటనే మానేయాలి.పిల్లలకు తల్లిదండ్రులే ఆదర్శం. మీరు ఎదుటివారిని గౌరవిస్తే మిమ్మల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. పిల్లలు ఎదుటివారి పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించినా, అవమానించినా చూసీ చూడనట్టు వదిలేయకూడదు.    ఆకర్షణకు లోనవడం సహజం. వాటిని తమ జీవితానభవాల ద్వారా వివరించాలి.
     
గాలి, నీరు, ఎండ.. తగినంత అందితేనే మొక్క ఎదుగుదల బాగుంటుంది. అలాగే  పిల్లలకు చదువే లోకం కాదు. ఆటలు, ఉల్లాసంగా గడిపే సమయాలూ అవసరం. స్వతంత్రంగా ఎదగడానికి కావల్సిన స్వేచ్ఛకూడా ఇస్తుండాలి. అతి స్వేచ్ఛ వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తుండాలి.
 - గీతాచల్లా, సైకాలజిస్ట్
 
 ‘సారీ’కి వెనకాడకూడదు...
 పిల్లలు తప్పులు చేస్తే, పెద్దలకు సారీ చెబుతారు. కానీ, పెద్దలు పిల్లలకు సారీ చెప్పడం ఏంటని అనుకోకూడదు. ఎదుటివారి ముందు పిల్లలను అవమానపరిచే మాట అంటే తర్వాతనైనా క్షమాపణ కోరాలి. పిల్లలకూ వ్యక్తిత్వం ఏర్పడే దశలో వచ్చే మార్పులను అర్థం చేసుకుంటూ వెళితే వారి బంధంలో గ్యాప్ ఏర్పడదు. పిల్లలు చిన్న తప్పు చేసినా పెద్దగా ఎత్తి చూపుతారు. కానీ, తప్పులు చేస్తూనే నేర్చుకోవాలి. వాటిని చూసీ చూడనట్టు ఉండాలి. అదే పట్టుకొని సాధించకూడదు. వారు హింసాత్మకధోరణికి చేరువకాకుండా, కుటుంబ బాంధవ్యాలకు దూరం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దలమీదే ఉంది.
 - సాక్షి ఫ్యామిలీ
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement