ఎన్కౌంటర్ మరణాల్లో భారత్ రికార్డు!
భారతదేశంలో రికార్డు స్థాయిలో అవినీతి విస్తరిస్తోందని, ఎన్కౌంటర్ మరణాలు భారీగా జరుగుతున్నాయని అమెరికా స్టేట్ హ్యూమన్ రైట్స్ డిపార్ట్ మెంట్ 2015 నివేదికల్లో వెల్లడించింది. అంతేకాదు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మాలెగావ్ పేలుళ్ళ కేసులో హిందుత్వ విషయాలపై మెతకగా వ్యవహరిస్తున్నట్లు తమ పరిశీలనలో తేలినట్లు వెల్లడించింది.
భారత్ లో 2008-2013 మధ్య కాలంలో పోలీసులు, భద్రతా దళాల ద్వారా 555 ఎన్కౌంటర్ హత్యలు జరిగాయని అమెరికా మానవ హక్కుల నివేదిక వెల్లడించింది. ఉత్తర ప్రదేశ్ లో 138, జార్ఖండ్ లో 50, మనిపూర్ లో 41, అస్సాంలో 33, ఛత్తీస్ ఘడ్ లో 29, ఒడిస్సా 27, జమ్మూ కాశ్మీర్ 26, తమిళనాడు 23, మధ్యప్రదేశ్ లో 20 ఎన్కౌంటర్లు జరిగినట్లు తెలిపింది. దీనికి తోడు సోహ్రాబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసును కూడా ప్రస్తావించింది. అంతేకాక భారత్ లో జరిగిన మరిన్ని అవినీతి, వేధింపులు, హింసలతోపాటు.. మౌలిక సదుపాయాల లేమి, సమస్యలపై యు హెచ్ఆర్ డి నివేదించింది.
భారత్ లోని జైళ్ళు తరచుగా నిండిపోతున్నాయని, జైళ్ళలో ఆహారం, వైద్య సంరక్షణ, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిస్థితులు పేలవంగా ఉంటున్నాయని నివేదికలు చెప్తున్నాయి. జైళ్ళలో తాగునీరు అప్పుడప్పుడు సమస్యగా మారుతుంటుందని, ఖైదీలకు తగినన్ని మౌలిక సదుపాయాలు లేకపోవడమే కాక, వారిని భౌతిక హింసలకు గురి చేస్తున్నట్లు యూహెచ్ఆర్డీ పేర్కొంది. విచారణ కోసం వేచి ఉండాల్సిన వారికంటే రెండు వంతులు ఎక్కువ మందిని జైళ్ళలో నింపుతున్నట్లు తెలిపింది.
ముఖ్యంగా భారతదేశంలో మావోయిస్టులు, సాయుధ గ్రూపుల్లో పిల్లలను రిక్రూట్ చేసుకుంటున్నారని యూహెచ్ ఆర్డీ ఆందోళన వ్యక్తం చేసింది. 12 సంవత్సరాల వయసున్న యువత మావోయిస్టు సభ్యులుగా ఉంటున్నట్లు పేర్కొంది. ఒకవేళ పిల్లలు తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తే ప్రతీకారంగా వారి కుటుంబ సభ్యులను హత్య చేసి ప్రతీకారం తీర్చుకుంటున్నారని, సాయుధ దళాలు, భద్రతా బలగాలు తమకు రక్షణ కవచాలుగా పిల్లలను ఉపయోగించుకుంటున్నట్లు నివేదికల్లో వెల్లడించింది.
మరోవైపు తమిళనాడువంటి కొన్ని రాష్ట్రాల్లో పరువు నష్టం కేసులు అధికంగా ఉంటున్నాయని, అలాగే పటేళ్ళ ఆందోళన వంటి సమయాల్లో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించి స్వేచ్ఛను హరిస్తోందని, భారత్ లో సమస్యలు, హింసపై ఆమెరికా మానవ హక్కుల నివేదికలో పలు విషయాలను వెల్లడించింది.