
జీవిత భాగస్వామికీ వస్తుందా?
హెపటైటిస్-బి ఉంటే.. జీవిత భాగస్వామికీ వస్తుందా?
గ్యాస్ట్రో ఎంటరాలజీ కౌన్సెలింగ్
నా వయసు 29 ఏళ్లు. గత ఐదేళ్ల క్రితం నేను చేయించిన రక్తపరీక్షలో హెచ్‌బీఎస్‌ఏజీ పాజిటివ్ అని తేలింది. పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించిన తర్వాత ఈ వైరస్ వల్ల ఎలాంటి హాని లేదని తెలిపారు. త్వరలో నేను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను. నాకున్న ఈ సమస్య వల్ల నేను చేసుకోబోయే భార్యకు ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా? పెళ్లి చేసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి వివరించగలరు. - ఒక సోదరుడు, హైదరాబాద్
మీరు తెలిపిన వివరాలను చూస్తే మీకు ‘హెపటైటిస్-బి’ వైరస్ ఇన్ఫెక్షన్ సోకిందని తెలుస్తోంది. పరీక్షల తర్వాత ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. కాబట్టి మీరు ప్రస్తుతం క్యారియర్ దశలో ఉన్నారు. అంటే ఈ దశలో ఉన్నవారికి వైరస్ శరీరంలో ఉంటుంది. కానీ ఎలాంటి హానీ తలపెట్టదు. అయితే మీ రక్తం, వీర్యం ద్వారా హెపటైటిస్-బి ఇతరులకు సోకే అవకాశం ఉంది. మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి ముందుగా మీరు చేసుకోబోయే భాగస్వామికి ఈ విషయం చెప్పండి. ఆమెకూ ‘హెపటైటిస్-బి’ పరీక్షలు నిర్వహించండి. ఒకవేళ ఇన్ఫెక్షన్ లేనట్లయితే ఆమెకు హెపటైటిస్-బి వ్యాక్సిన్ ఇప్పించండి. మీరు క్రమం తప్పకుండా ప్రతి ఆర్నెల్లకోసారి ‘లివర్ ఫంక్షన్ టెస్ట్’ను చేయించుకోవాలి. ఆ పరీక్షల్లో ఏదైనా తేడా వస్తే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి. మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
నా వయసు 65 ఏళ్లు. నాకు డయాబెటిస్, హైబీపీ ఉన్నాయి. ఒకసారి ఉన్నట్లుండి కడుపులో నొప్పి వస్తే డాక్టర్‌ను సంప్రదించాను. అప్పుడు డాక్టర్‌గారు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేసి ‘కాలేయంలో కొవ్వు చేరింద’ని చెప్పారు. కొవ్వు పేరుకుపోవడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? - రవీందర్, నూజివీడు
మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం అనేది సాధారణంగా స్థూలకాయం ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. డయాబెటిస్, హైబీపీతో బాధపడేవారు ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకునేవారిలోనూ లివర్‌లో కొవ్వు చేరడం సాధారణంగా జరుగుతుంది. కాలేయంలో కొవ్వు ఉన్నంత మాత్రాన ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కానీ కాలేయం పనితీరులో తేడా కనిపిస్తే మాత్రం కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది. మీరు ఒకసారి లివర్ ఫంక్షన్ పరీక్ష చేయించుకోండి. ఈ పరీక్ష నార్మల్‌గా ఉన్నట్లయితే మీరు ఆందోళన పడాల్సిందేమీ లేదు. మీరు డయాబెటిస్, బీపీ నియంత్రణలో ఉంచుకుంటూ, బరువును తగ్గించుకుంటే కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గిపోయే అవకాశం ఉంది.
డాక్టర్ భవానీరాజు
సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
‘ఏసీ’తో సమస్య..?
ఫ్‌స్టైల్ కౌన్సెలింగ్
నా వయసు 35. ఇటీవలే ఆఫీసు మారాను. ఇక్కడ చాలాసేపు ఎయిర్ కండిషన్ గదిలో ఉండాల్సి వస్తోంది. దాంతో నాకు తలనొప్పి వస్తోంది. పైగా తీవ్రమైన అలసటతో కూడా బాధపడుతున్నాను. నా సమస్య ఏసీ వల్లనేనా? నాకు సరైన పరిష్కారం చెప్పండి. - సుధీర్, హైదరాబాద్
మీరు చెప్పిట్లుగానే ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో చాలా ఎక్కువ సేపు గడపడం వల్ల కొందరిలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొందరికి చాలా సౌకర్యంగా అనిపించే ఏసీ, మరికొందరి ఆరోగ్యానికి అనర్థాలు తెచ్చిపెట్టవచ్చు. ఏసీ వల్ల దాదాపు ఐదు ప్రధానమైన సమస్యలు వస్తాయి. అవి...
తీవ్రమైన అలసట: చాలాసేపు ఏసీలో గడపడంతో పాటు ఆ ఏసీ వల్ల చల్లదనం ఎక్కువగా ఉంటే కొందరిలో పని ముగిసే సమయానికి తీవ్రమైన తలనొప్పి, భరించలేనంత నిస్సత్తువగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చల్లటి వాతావరణంలో కండరాలకు తగినంత రక్తప్రసరణ జరగకపోవడం వల్ల అలసటకు గురవుతారు.
పొడి చర్మం: సుదీర్ఘకాలం పాటు ఏసీలో గడిపేవారి చర్మంపై తేమ తగ్గుతుంది. దాంతో వారి చర్మం పొడిగా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించే వారు తమ చర్మంపై మాయిశ్చరైజర్‌ను రాసుకుంటూ ఉండటం మంచి పరిష్కారం.
దీర్ఘకాలిక వ్యాధులు తీవ్రం కావడం: కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారిలో... అంటే తక్కువ రక్తపోటు (లో బ్లడ్ ప్రెషర్), ఆర్థరైటిస్, న్యూరైటిస్ (నరాల చివరలు మొద్దుబారి స్పర్శ తెలియకపోవడం లేదా కాళ్లు, చేతులు తిమ్మిర్లు పట్టడం) వంటి జబ్బులు ఉన్నవారిలో సమస్యలు తీవ్రమవుతాయి. కొందరిలో ఈ న్యూరైటిస్ కారణంగా నిస్సత్తువ కలిగే అవకాశాలు ఎక్కువ.
అలవాటైతే వేడిని తట్టుకోలేకపోవడం: నిత్యం ఏసీలో ఉండటం అలవాటైన వారు (గతంలో వేడి వాతావరణంలో ఉన్నవారైనప్పటికీ) ఇక ఏమాత్రం వేడిమిని భరించలేదు. వేసవిలో బయటకు రావడమే వారికి కష్టంగా అనిపిస్తుంది. దాంతో తేలిగ్గా వడదెబ్బకు గురవుతుంటారు.
శ్వాస సమస్యలు: చాలాసేపు ఏసీ కారులో మూసి ఉన్న డోర్స్, గ్లాసెస్ వల్ల అక్కడి సూక్ష్మజీవులు అక్కడే తిరుగుతూ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడం వల్ల తేలిగ్గా శ్వాససంబంధమైన వ్యాధులకు గురవుతుంటారు. అందుకే నిత్యం ఏసీలో ఉండేవారు తప్పనిసరిగా ప్రతి రెండు గంటలకు ఒకసారి కాసేపు బయటకు వచ్చి స్వాభావిక వాతావరణంలో పదినిమిషాల పాటైనా గడిపి వెళ్తుండాలి. అదే ఆరోగ్యకరం.
డాక్టర్ సుధీంద్ర ఊటూరి
కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
డెంగ్యూ ఫీవర్ నివారణ, చికిత్స
ఆయుర్వేద కౌన్సెలింగ్
ప్రస్తుతం డెంగ్యూ ఫీవర్ చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఆయుర్వేదంలో దీనికి నివారణ, చికిత్స వివరించండి. - కొడుకుల వెంకటరమణి, హైదరాబాద్
ఎవరికైనా జ్వరం వస్తే, దాని స్వరూప స్వభావాలు, జ్వరగ్రస్తునికి ఉన్న ఇతర లక్షణాలను బట్టి రోగ నిర్ధారణ చేయాలి. ఆయుర్వేదంలో దోషప్రాబల్యాన్ని బట్టి, వాత, పిత్త, కఫ సన్నిపాతజ జ్వరాలు, దూష్యప్రాధాన్యతననుసరించి ధాతుగత జ్వరాలు, కారణాన్ని బట్టి క్రిమిజ జ్వరాలు, రకరకాలుగా వర్గీకరించారు. డెంగ్యూ వ్యాధికి పగటిపూట కుట్టే దోమలు కారణం. మనిషి ప్రకృతి, రోగనిరోధకశక్తిని బట్టి వ్యాధి తీవ్రత, లక్షణాలు ఆధారపడి ఉంటాయి. రోగబలం, రోగిబలం పరిగణనలోకి తీసుకొని చికిత్సను నిర్ణయించాలి. డెంగీ జ్వరంలో... ప్లేట్‌లెట్ల సంఖ్య దిగజారినప్పుడే ప్రమాదభరితమవుతుంది.
నివారణ కారణాన్ని దృష్టిలో ఉంచుకొని, దోమలు చేరని వాతావరణాన్ని సృష్టించుకోవాలి. కాళ్లు, చేతులు కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. పుష్టికరమైన, హానిరహితమైన ఆహార విహారాలు పాటించాలి.
చికిత్స {పధానంగా లక్షణాలను బట్టి శమన చికిత్స చేయాల్సి ఉంటుంది. ఆయుర్వేదంలో దీనికి ఉపకరించే కొన్ని జ్వరహర ఔషధాలను ఈ కింద పొందుపరచడం జరిగింది. మృత్యుంజయరస (మాత్రలు) ఉదయం 1, రాత్రి 1 (7 రోజులు వాడాలి) అమృతారిష్ట (ద్రావకం) 4 చెంచాలకు సమానంగా నీళ్లు కలిపి మూడు పూటలా తాగాలి (జ్వరం తగ్గే వరకు వాడాలి) ఆమలకీ స్వరసం, కుమారీ స్వరసం రెండేసి చెంచాలు కలిపి, రోజూ మూడు పూటలా సేవించాలి గిలోయీ ఆమ్ల సిరప్, అలోయిస్ సిరప్ అనే పేర్లతో ఇవి షాపుల్లో లభిస్తాయి. ఈ స్వరసాలు నివారణకూ, చికిత్సకూ కూడా పనికొస్తాయి. దీనివల్ల నీరసం, జ్వరం తగ్గడమే కాకుండా, ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోకుండా ఉంటుంది. ఒకవేళ పడిపోతే, పెరగడానికి కూడా దోహదపడుతుంది.
ఆహారం
బలకరమైన ద్రవాహారాన్ని తీసుకోవాలి. (బార్లీ, జావ, కొబ్బరినీళ్లు, ఉప్మారవ్వతో చేసిన జావ, పలుచని మజ్జిగ మొదలైనవి) ఆకలి బాగా ఉంటే స్వల్ప ప్రమాణంలో ఇడ్లీ తేనెతో తినవచ్చు జ్వరం తగ్గినప్పటికీ ‘ఒళ్లంతా నొప్పులు, నీరసం, అరుచి’ వంటి లక్షణాలు ఇబ్బంది పెడతాయి. అప్పుడు ‘యోగరాజగుగ్గులు’ మాత్రల్ని రోజుకి రెండు (ఉదయం 1, రాత్రి 1) సేవించాలి. పైన చెప్పిన రెండు రకాల ‘స్వరసాల’ మిశ్రమాన్ని ఒక నెలరోజులు వాడవచ్చు. దానివల్ల లివర్‌కీ, ధాతువులకు బలం, క్షమత్వం కలుగుతాయి. నోటికి రుచి కలగాలంటే ‘భావన అల్లం లేదా భావన జీలకర్ర’ (బజారులో లభిస్తాయి) నమిలి మింగితే, చాలా గుణం కనిపిస్తుంది.
డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్