ఒక యువకుడికి ఎవరూ లేరు. ఎలా పుట్టాడో తెలీదు. ఎలా పెరిగాడో తెలీదు. ఎలా పుట్టినా, ఎలా పెరిగినా, ఎవరు లేకపోయినా పర్వాలేదు. జీవితాన్ని లాక్కురావచ్చు. కానీ అతడికి కళ్లు లేవు! ఎప్పుడు చూపు పోయిందో కూడా తెలీదు. అతడికి తనపై తనకు కోపం.. ఏదీ చెయ్యలేనని. అమ్మానాన్నలపై కోపం.. కని పడేశారని. అందరికన్నా దేవుడిపై ఎక్కువ కోపం.. తనకు చూపు లేకుండా చేశాడని. అయితే ఇంతమందిపై కోపంగా ఉండే ఆ యువకుడికి ఒక అమ్మాయిపై మాత్రం కోపం లేదు. అతడికి తోడుగా ఉన్న అమ్మాయి ఆమె. ఆ అమ్మాయి తనకు తోడుగా ఎప్పుడు వచ్చిందో తెలీదు. ఎందుకు వచ్చిందో తెలీదు. ఎప్పుడూ అతడి దగ్గరే ఉంటుంది. అతడికి సేవలు చేస్తూ ఉంటుంది. మంచి విషయాలు చెప్పి మనసులో బాధ లేకుండా చేస్తుంది. దేవుడిని కోపగించుకోకూడదని చెబుతుంది. దేవుడి వల్లనే మనం ఇలాగైనా ఉన్నామని చెబుతుంది. ‘నేనంటే నీకు ఇష్టం కదా. మరి నీ దగ్గరికి నన్ను చేర్చింది ఎవరనుకున్నావ్? పైన ఉండే ఆ దేవుడే’ అని అతడి చేతిని చేతిలోకి తీసుకుంటుంది. ఆప్యాయంగా చెంపలు నిమురుతుంది. ఆ యువకుడి అలాంటి మాటలు విన్నప్పుడు కన్నీళ్లు వస్తాయి. ‘ఏడవకు’ అంటుంది ఆ అమ్మాయి. ‘దేవుడు నాకు కంటిచూపు తెప్పించకుండా కన్నీళ్లు తెప్పిస్తున్నాడు’ అని అంటాడు. ‘తప్పు.. అలా మాట్లాడకు. దేవుడు తప్పకుండా నీకు కంటి చూపును ఇస్తాడు’ అని ఓదారుస్తుంది. ‘దేవుడు నాకు చూపు తెప్పిస్తే మొదట ఎవర్ని చూస్తా్తనో తెలుసా? నిన్నే’ అంటాడు ఆ యువకుడు నవ్వుతూ. ఆ అమ్మాయి సంతోషంగా అతడిని దగ్గరికి తీసుకుంటుంది. కళ్లపై ముద్దుపెట్టుకుంటుంది. దాదాపు రోజూ వాళ్ల సంభాషణ ఇలాగే ఉంటుంది.
ఎప్పట్లాగే ఓ రోజు ఆ యువకుడు, యువతి మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ‘నాకు కళ్లొస్తే, నిన్ను పెళ్లి చేసుకుంటాను’ అన్నాడు అతడు. యువతి నవ్వింది. ‘నిజంగానా?’అంది. ‘అవును’ నిజం అన్నాడు.
కొన్నాళ్లకు అతడికి ఎవరో నేత్రదానం చేశారు. డాక్టర్లు కళ్లు తెరిపించిన రోజు.. తను కోరుకున్న విధంగానే మొదట ఆ అమ్మాయిని చూశాడు. చక్కగా ఉంది తన స్నేహితురాలు! దగ్గరికి రమ్మని సైగ చేశాడు. ఆమె రాలేదు! ‘తను నీ సైగను చూడలేదు’ అని డాక్టర్లు చెప్పారు. ‘ఎందుకు చూడలేదు?’ అన్నట్లు చూశాడు. ఆమెకు కళ్లు లేవు అని చెప్పారు డాక్టర్లు. ‘ఇన్నేళ్లూ.. కళ్లు లేకుండానే నాకు తోడున్నావా?!’ అని ఆశ్చర్యంగా అడిగాడు. ‘అవును’ అంది. ఆ తర్వాత అతడు ఆలోచనలో పడ్డాడు.‘కళ్లు లేకుండానే, ఇంతకాలం నువ్వు.. కళ్లు లేని నాకు ప్రపంచాన్ని చూపించావు. నీకూ కళ్లు లేవని తెలిశాక నీకిప్పుడు నేను కొత్తగా చూపించే ప్రపంచం ఏముంటుంది చెప్పు. నిన్ను పెళ్లి చేసుకోలేను. నన్ను క్షమించు’ అన్నాడు!ఆ అమ్మాయి అతడి చేతుల్ని ఎప్పటిలా ఆప్యాయంగా తన చేతిలోకి తీసుకుంది. అయితే మొదటిసారి ఆమె అతడి చేతులను తన చేతులతో వెతుక్కోవలసి వచ్చింది. అతడా వ్యత్యాసాన్ని గ్రహించలేదు. ‘నీకు కళ్లిచ్చింది నేనే’ అని కూడా ఆమె అతడితో చెప్పలేదు. బాధలో ఉన్నప్పుడు, సంతోషంలో ఉన్నప్పుడు మనిషి ఒకేలా ఉండాలి. ఆమె ఒకేలా ఉంది! అదే దైవత్వం.
ఆమె ఒకేలా ఉంది
Published Thu, Dec 7 2017 11:33 PM | Last Updated on Wed, Aug 1 2018 2:31 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment