
పంచ్‌లు ఇవ్వండి...పైసలు కూడా ఇవ్వండీ!
సమ్‌థింగ్ స్పెషల్
‘‘నేను మనిషిని కాదు. పంచ్ బ్యాగ్‌ను. గట్టిగా పంచ్‌లు ఇవ్వండి. ఆ తరువాత మీకు తోచిన డబ్బులు ఇవ్వండి’’ అంటున్నాడు షుపింగ్.
చైనాలోని వుహన్ నగరంలోని బార్‌లు, నైట్‌క్లబ్‌లు, వీధుల్లో నిల్చొని ‘‘కమాన్.. రండీ’’ అని పిలుపునిస్తుంటాడు నలభై ఎనిమిది సంవత్సరాల షుపింగ్.
ఇదేదో సరదాగా ఉందనుకొని దారిన పోయే దానయ్యలు షుపింగ్‌కు పంచ్‌లు ఇచ్చి ఆ తరువాత డబ్బు ఇస్తారు. మొత్తానికైతే పింగ్ బాగానే సంపాదిస్తున్నాడు. అయితే పింగ్ చేస్తున్న పని అతని భార్యా బిడ్డలకు బొత్తిగా నచ్చడం లేదు. ‘‘వద్దు మొర్రో’’ అంటున్న వినిపించుకోవడం లేదు పింగ్. ఒక సూపర్ మార్కెట్ ప్రమోషన్ షోలో భాగంగా ‘హూమన్ పంచ్’ అవతారం ఎత్తాడు. మంచి స్పందన లభించడంతో దీన్నే వృత్తిగా ఎందుకు ఎంచుకోకూడదు అనుకున్నాడు షుపింగ్.
‘‘మొదట నేను దీన్ని జీవికగా ఎంచుకోవాలనుకోలేదు. ఒకసారి ప్రయత్నించి చూద్దాం అనుకున్నాను. డబ్బులు బాగానే వస్తున్నప్పుడు... వేరే వృత్తి ఎంచుకోవడం ఎందుకని ఇదే వృత్తిలో స్థిరడ్డాను’’ అంటున్న షుపింగ్ తన వృత్తిని ‘అసాధారణమైన వృత్తి’ అని అభివర్ణిస్తుంటాడు.