మానవునిపై దైవానుగ్రహం ప్రసరించే పండుగ ఈదుల్ ఫితర్
మానవునిపై దైవానుగ్రహం ప్రసరించే పండుగ ఈదుల్ ఫితర్
Published Thu, Aug 8 2013 10:57 PM | Last Updated on Fri, Nov 9 2018 6:22 PM
రమజాన్ పేరు వినగానే ప్రతిఒక్కరికీ సేమియా, షీర్ ఖుర్మాలే గుర్తుకు వస్తాయి. పట్టణవాసులకైతే దీనితోపాటు హలీమ్, హరీస్ లాంటి వంటకాలు కూడా నోరూరిస్తాయి. ఈ పండుగను ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఎందుకంటే ఇది ఒక్కనాటి పండుగ కాదు. నెల రోజులపాటు ఆనందంగా, ఆరాధనా భావ తరంగాల్లో తేలియాడుతూ జరుపుకునే ముగింపు ఉత్సవం. ఈ నెలరోజులూ ముస్లింల ఇళ్లు, వీధులన్నీ సేమ్యా, షీర్ ఖుర్మా, బగారా, బిరియానీ... ఘుమఘుమలతో, అత్తరు పన్నీరు పరిమళంతో, ఉల్లాస పరవళ్ల హడావుడితో కళకళలాడుతూ, ప్రేమామృతాన్ని చిలకరిస్తూ, సేవాభావాన్ని పంచుతుంటాయి. భక్తులు పవిత్ర గ్రంథ పారాయణంలో, తరావీహ్ నమాజుల తన్మయత్వంలో ఓలలాడుతుంటారు. నిజం చెప్పాలంటే, ఇలాంటి అనుభూతులు, ఆనందాలు, ఆహ్లాదాల సమ్మేళనాన్నే పండుగ అనడం సమంజసం. ఇలాంటి అపూర్వ అపురూప సందర్భమే ఈదుల్ ఫిత్ ఇదే రమజాన్ పండుగ.
అసలు రమజాన్ అన్నది పండుగ పేరు కాదు. అదొక మాసం పేరు. సంవత్సరంలోని పన్నెండు మాసాల్లో తొమ్మిదవ మాసం పేరు రమజాన్. అయితే దైవం పవిత్ర ఖురాన్ లాంటి మానవ సాఫల్య గ్రంథరాజాన్ని అవతరింపజేయడానికి, అత్యుత్తమ ఆరాధనా విధానమైన రోజాను విధిగా చేయడానికి ఈ మాసాన్ని ఎన్నుకున్నాడు. అందుకే ఈ మాసానికి ఇంతటి ఔన్నత్యం ప్రాప్తమైంది. మానవుల మార్గదర్శక గ్రంథమైన ఖురాన్, రోజాలతో ఈ నెలకు విడదీయరాని సంబంధం ఉంది. ఈ విషయాన్ని దైవం తన గ్రంథంలో ఇలా పేర్కొన్నాడు...
‘విశ్వాసులారా! మీ పూర్వీకులపై ఉపవాస వ్రతం ఎలా విధిగా నిర్ణయించబడి ఉందో, అలాగే మీపై కూడా విధిగా నిర్ణయించడం జరిగింది. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది. రమజాన్ మాసంలోనే పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరించింది. అది మొత్తం మానవాళికి సంపూర్ణ మార్గదర్శక గ్రంథం. రుజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరు చేసే స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి. (2-183, 185).
మనం ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే , మానవులపై దేవుని అనుగ్రహం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఆయన తన అపార ప్రేమానురాగాలతో మానవ మనుగడ కోసం అనేక ఏర్పాట్లుచేశాడు. మానవుల ఆధ్యాత్మిక వికాసం కోసం, నైతిక మార్గదర్శకం కోసం పవిత్ర ఖురాన్ లాంటి మహత్తర ఆరాధనను పరిచయం చేశాడు. మానవుల్లో దైవభక్తిని, దైవభీతిని, సదాచారాన్ని, నైతిక సుగుణాలను, మానవీయ విలువలను జనింపచేయడానికి నెలరోజులపాటు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. అపారమైన ఆయన కారుణ్యానుగ్రహాలను వర్ణించడం ఎవరి వల్లా కాదు. దైవాదేశ పాలనకు మనిషిని బద్ధునిగా చేయడం రమజాన్ శిక్షణ ముఖ్య ఉద్దేశం.
మాసం రోజులపాటు నియమబద్ధంగా, నిష్ఠగా సాగే ఆరాధనా విధానాలు మనిషిని ఒక క్రమశిక్షణాయుతజీవన విధానానికి, బాధ్యతాయుత జీవన విధానానికి, దైవభక్తి పరాయణతతో కూడిన జీవనవిధానానికి అలవాటు చేస్తాయి. మానవుల్లో ఇంతటి మహోన్నత విలువలను, సుగుణాలను జనింపచేసే రమజాన్ వ్రత దీక్షలను దైవం తమకు అనుగ్రహించినందుకు, వాటిని వారు శక్తివంచన లేకుండా చిత్తశుద్ధితో పాటించగలిగినందుకు దైవానికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రవక్త మహనీయులవారి సంప్రదాయ వెలుగులో ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. దైవప్రసన్నతను చూరగొనడానికి ఉపవాసవ్రతం పాటించడంతోపాటు, ఫర్జ్, సున్నత్, నఫిల్; తరావీహ్ నమాజులు ఆచరిస్తూ, అనేక సదాచరణలు ఆచరిస్తారు. అనవసర కార్యక్రమాల్లో, వినోదాలకు, భోగవిలాసాలకు ధనం వృథా చేయకుండా నలుగురికీ మేలు జరిగే మంచి పనులకోసం వ్యయపరచాలి.
మంచిపనులకు, సమాజ సంక్షేమ కార్యక్రమాలకు వినియోగమయ్యే ధనవ్యయాన్నే దైవం స్వీకరిస్తాడు. ఈవిధంగా రమజాన్ నెలవంక దర్శనంతో ఆరంభమయ్యే ఉపవాస దీక్షలు నిరంతరాయంగా నెలరోజులపాటు సాగి ‘షవ్వాల్’ మాసం చంద్రదర్శనంతో ముగుస్తాయి. షవ్వాల్ మొదటితేదీన జరుపుకునే పండుగ ఈదుల్ ఫిత్.్ర ఈ పండుగకు సంబంధం రమజాన్ మాసంతో పెనవేసుకుపోయి ఉండడంతో సాధారణ ప్రజలు దీన్ని రమజాన్ పండుగ అని కూడా వ్యవహరిస్తారు. పండుగరోజున ముస్లిమ్‌లంతా ఉదయాన్నే లేచి స్నానపానాదులు ముగించుకుని ప్రాతఃకాల ఫజర్ నమాజులు చేస్తారు. అనంతరం నూతనవస్త్రాలు ధరించి, అత్తరు, పన్నీరు వంటి సుగంధ పరిమళాలను అద్దుకుని ఆనందోత్సాహాలతో ఈద్‌గాహ్‌కు బయలుదేరుతారు.
అందరూ ఒకచోట గుమికూడి తమకు రోజా వ్రతం పాటించే భాగ్యం కలుగజేసినందుకు, మానవుల మార్గదర్శనం కోసం, సాఫల్యం కోసం, పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరింపజేసినందుకు దైవానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ రెండు రకతుల నమాజులు చేస్తారు. తరువాత ఇమాం ఖురాన్; హదీసుల వెలుగులో వారికి నైతిక, ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తాడు. అందరూ కలసి దేవుని గొప్పతనాన్ని ఘనంగా కీర్తిస్తారు. తమకోసం, కుటుంబం కోసం, బంధుమిత్రుల కోసం, దేశంకోసం, దేశవాసుల సుఖసంతోషాలకోసం, యావత్ ప్రపంచ శాంతి సంతోషాల కోసం దైవాన్ని ప్రార్థిస్తారు. దైవం సమస్త మానవాళినీ సన్మార్గంలో నడిపించాలనీ, యావత్ ప్రపంచంలో సుఖసంతోషాలతో, సుభిక్షంగా వర్థిల్లాలని మనసారా కోరుకుందాం.
- యండి. ఉస్మాన్‌ఖాన్
Advertisement