
‘గుడ్’ జపాన్
కోడిగుడ్డు కనపడగానే ఆమ్లెట్ గుర్తుకొస్తుంది మనకి. అక్కడితో మన ఆలోచన ఆగిపోతుంది. అయితే కాస్త కళాపోసన ఉండాలేగానీ మన ఆలోచనలు ఆమ్లెట్ దగ్గర మాత్రమే ఆగిపోవు. కళాత్మక ఐడియాలు ఎన్నో వస్తాయి. జపానీయులు కళొక్కటే కాదు... ప్రచారాలకు కూడా గుడ్డుని వాడి అందరితో వెరీగుడ్ అనిపించుకుంటున్నారు. అక్కడ కొన్ని పాఠశాలలో విద్యార్థులు తమ సందేశాలను చెప్పడానికి గుడ్డునే వాడుతున్నారు. టోక్యోలోని షినిల్ గర్ల్స్ హైస్కూలు విద్యార్థులు ‘ప్రిపేర్డ్ మైండ్స్ చేంజ్ ద వరల్డ్’ అనే కార్యక్రమంలో వారి సందేశాలను, ఆలోచనలను గుడ్డుపై పెయింటింగ్ వేసి చూపించారు.
ఇంటి అలంకరణలో...
సందేశానికి, కళాత్మక వస్తువులకు మాత్రమే కాదు... ఇంటిని అలంకరించడంలో కూడా జపాన్ గుడ్డుకళ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. గుడ్డుకి చిన్న రంధ్రం చేసి లోపలున్న సొనంతా తీసేసి ఒక ప్రత్యేకమైన డ్రిల్లింగ్ మెషీన్‌తో గుడ్డుని ఇష్టమైన ఆకారంలోని మార్చుకునే కళ జపాన్ సొంతమన్నమాట. గ్లోబ్ నుంచి అందమైన ఆడపిల్ల వరకు దేన్నయినా గుడ్డుపెంకుపై అందంగా తీర్చిదిద్దవచ్చు.
ఎగ్ సిటీ....
కొత్త సంవత్సరం వేడుకలప్పుడు గుడ్లతో ఓ చిన్న నగరం నిర్మించారు జపాన్‌లోని కొందరు కళాకారులు. అందులో రాజు రాణిల బొమ్మలు కూడా ఉన్నాయి. కొన్నివేల గుడ్లను ఉపయోగించి నిర్మించిన ఆ నగరం చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంది. జపాన్ భాషలో రాసిన కొన్ని వాక్యాలు, నెంబర్లు... మొదలైనవి ఉన్నాయందులో. తెలుపు, గోధుమ, లేత ఆకుపచ్చ రంగులలో ఉన్న గుడ్లతో నిర్మించిన ఆ నగరం ‘భేష్’ అనిపించుకొంటుంది.