గుడ్‌ సైన్స్‌ | Good Science | Sakshi
Sakshi News home page

గుడ్‌ సైన్స్‌

Published Sun, Jan 1 2017 11:05 PM | Last Updated on Tue, Sep 5 2017 12:08 AM

Good Science

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రేపు తిరుపతిలో ప్రారంభం అవుతున్న 104వ ‘ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌’ లో భాగంగా.. జనవరి 4వ తేదీన మహిళా సైన్స్‌ కాంగ్రెస్‌ జరుగుతోంది. సైన్స్‌లో నోబెల్‌ గ్రహీతలు, సైన్స్‌ శాస్త్రవేత్తలు, సైన్స్‌ పరిశోధకులు, సైన్స్‌ ప్రొఫెసర్లు హాజరవుతున్న ఈ మహిళా కాంగ్రెస్‌లో జాతీయ అభివృద్ధిలో మహిళా సైంటిస్టుల పాత్ర; శాస్త్ర, సాంకేతిక రంగాలలో మహిళలకు గల అవకాశాలు అనే అంశాలపై ప్రసంగాలు ఉంటాయి. ఈ సందర్భంగా సాక్షి ‘ఫ్యామిలీ’... ముగ్గురు ఇస్రో మహిళా శాస్త్రవేత్తల ఉద్యోగ జీవితంలోని స్ఫూర్తిదాయకమైన సందర్భాలను మీకు అందిస్తోంది.



థ్రిల్స్‌ : నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌
అనూరాధ ఇస్రోలో సీనియర్‌ మోస్ట్‌ ఆఫీసర్‌. భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తున అంతరిక్షంలోకి సమాచార ఉపగ్రహాలను పంపించడంలో ఎక్స్‌పర్ట్‌. 34 ఏళ్లుగా ఇస్రోలో ఉన్నారు. తొమ్మిదేళ్ల వయసులో తొలిసారి స్పేస్‌ గురించి ఈ అమ్మాయికి సందేహాలు తలెత్తాయి. ‘అపోలో’ లాంచ్‌ అవుతున్న సమయం అది. నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రుడి మీదకు దిగేశాడని భూమ్మీదకు వార్త వచ్చేసింది! అప్పట్లో టీవీ లేదు. పేరెంట్స్, టీచర్స్‌ చెప్పుకుంటుంటే వినింది అనూరాధ. ఒక్కసారిగా ఎగై్జట్‌ అయింది. మనిషేంటీ? చంద్రుడి పైకి వెళ్లడం ఏంటి?! గుండెలోంచి ఏదో ఫీలింగ్‌ తన్నుకొచ్చింది. మనిషి చంద్రుడిపై అడుగుపెట్టిన ఆ దృశ్యాన్ని ఊహించుకుంటూ కన్నడంలో చిన్న కవిత రాసింది. ఇప్పుడు ఆమె ఇస్రో లోని మహిళా సైంటిస్టులకు ఓ రోల్‌ మోడల్‌. ‘ఆడవాళ్లకు, సైన్స్‌కూ సెట్‌ కాదు’ అనే మాట వినిపిస్తే అనూరాధ అపరకాళి అయిపోతారు! జ్ఞాపకం ఉంచుకోవలసినదేదీ అనూరాధకు ఇష్టమైన సబ్జెక్టు కాదు. లాజిక్‌ ఉంటే ఇష్టపడతారు. లాజిక్‌ ఉన్నప్పుడే మర్చిపోవడం, జ్ఞాపకం పెట్టుకోవడం ఉండదు కదా. అందుకే ఆమెకు లాజిక్‌ చుట్టూ అల్లుకుని ఉండే సైన్స్‌ మీద అంత ప్రేమ. అనూరాధ ఒక మాట అంటారు.. ‘‘భారతదేశంలోని ఏ అమ్మాయినైనా అడిగి చూడండి, మేథ్స్‌ తన ఫేవరేట్‌ సబ్జెక్ట్‌ అని చెబుతుంది’’ అని. ఆమె అలా అనడం ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది.

1982లో అనూరాధ ఇస్రోలో చేరారు. అప్పుడు కొద్ది మంది మహిళలు మాత్రమే ఉండేవారు. ఇంజినీరింగ్‌ విభాగంలోనైతే మరీ తక్కువ. ఆమె బ్యాచ్‌లో ఐదుగురు మహిళా ఇంజినీర్లు ఉండేవారు. ప్రస్తుతం ఇస్రోలోని 16 వేల మంది ఉద్యోగులలో 20 నుంచి 25 శాతం మందికి పైగా మహిళలే. ‘‘అందుకే మహిళగా మేము ప్రత్యేక గుర్తింపును కోల్పోయాం’’ అని నవ్వుతారు అనూరాధ. కొన్నిసార్లయితే తను మహిళనన్న విషయమే మర్చిపోతారట అనూరాధ. ఇస్రోలో నియామకాలు, పదోన్నతుల విధానాలు అన్నీ ‘మనకెంత వచ్చు, మనమేం చెయ్యగలం’ అనే రెండు ప్రధాన అంశాలను బట్టే ఉంటాయి తప్ప, జెండర్‌ని బట్టి కాదు అని చెబుతున్నప్పుడు ఆమె సగర్వమైన ఎక్స్‌ప్రెషన్‌ ఇస్తారు. సైన్స్‌లో కానీ, ఇంకెక్కడైనా కానీ ఎంత ఎక్కువమంది ఉద్యోగినులు ఉంటే అంత ఎక్కువగా మన అమ్మాయిలు స్ఫూర్తి పొందుతారని అనూరాధ బలంగా విశ్వసిస్తున్నారు.
అనూరాధ టి.కె.
జియోశాట్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్, ఇస్రో శాటిలైట్‌ సెంటర్‌


స్క్రీన్‌ ప్లే : చందమామ
రీతూకి నచ్చిన నగరం.. గగనం! పాలపుంతల్లోంచి వచ్చిన పిల్లలా ఎప్పుడూ నింగిలోకే చూస్తుండేది. పుట్టింది లక్నో. ఆమె ఊహలు పుట్టి పెరిగింది ఆకాశంలో. పగలంతా చుక్కలు ఏం చేస్తుంటాయి? చంద్రుడలా ఎందుకు చిక్కిపోతాడు? మళ్లీ ఎందుకలా బొద్దుగా జాబిల్లిలా మారిపోతాడు? ఆకాశంలో ఏముంది? ఆ వెనుక ఇంకా ఏముందీ? ఇవీ.. ఐదూ పదేళ్ల రీతూ ఆలోచనలు. సమాధానాల కోసం సైన్స్‌ స్టూడెంట్‌ అయింది. ఫిజిక్స్, మేథ్స్, కెమిస్ట్రీ. అయితే రీతూ డౌట్స్‌ తీర్చడానికి వాటి శక్తి సరిపోలేదు. న్యూస్‌ పేపర్‌లను ముందేసుకునేది! ‘నాసా’ వార్త కనిపిస్తే కట్‌ చేసి పెట్టుకునేది. రేడియోలో ‘ఇస్రో’ మాటొస్తే చేస్తున్న పని వదిలేసి, రెండు చెవులూ ట్యూన్‌ చేసుకునేది. స్పేస్‌ ఆమె శ్వాస. స్పేస్‌ సైన్స్‌ ఆమె చూపు!

పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ అయింది. చుట్టూ ఉన్న ఉద్యోగాలను వదిలేసి, ఎక్కడో దూరంగా క్రిస్మస్‌ చెట్టుకున్న నక్షత్రం లాంటి ఇస్రోలో జాబ్‌కు అప్లై చేసింది. ఇంటర్వూ్య బోర్డులో ఆమె కనబరిచిన విజ్ఞానం, ఆమెలో కనిపించిన జిజ్ఞాస బోర్డు సభ్యుల్ని ఇంప్రెస్‌ చేశాయి. ‘కంగ్రాచ్యులేషన్స్‌ మిస్‌ రీటా. యూ ఆర్‌ సెలక్టెడ్‌’! ఎక్కడో విశ్వాంతరాళం నుంచి విన్నట్టున్న అభినందన. ఆ క్షణం నుంచి తనో స్పేస్‌ సైంటిస్ట్‌! టార్గెట్‌ను విజయవంతంగా పూర్తి చేసుకొచ్చిన అంతరిక్ష నౌకలా ఇంట్లో ల్యాండ్‌ అయింది రీతూ.

రీతూ పుట్టింది ఎప్పుడైనా కావచ్చు. ఇస్రోలో పుట్టి ఇప్పటికి 18 ఏళ్లు. అదే ఆమెకు లెక్క. మార్స్‌ మిషన్‌ సహా, ప్రతి ప్రాజెక్టులోనూ ఆమె వంతు ఉంది. టీమ్‌ వర్క్‌ భాగస్వామిగా ఆమె సంతకం ఉంది. 2012లో మార్స్‌ మిషన్‌ మొదలైంది. 18 నెలల్లో మార్స్‌ని అంగారక గ్రహం మీదకి పంపాలి. చాలా తక్కువ టైమ్‌. అప్పటికింకా గ్రహాంతర బృహత్కార్యాలను చేపట్టిన అనుభవం ఇస్రోకి లేదు. మార్స్‌ మిషనే మొదటిది. పేరైతే ఫిక్స్‌ అయింది.. ‘మంగళ్యాన్‌’. అది సక్సెస్‌ అయితేనే పేరు! ఛాలెంజ్‌ ఉన్నప్పుడు టెన్షన్‌ ఉంటుంది. రీతూలోనూ టెన్షన్‌ మొదలైంది. రీతూ, మిగతా సైంటిస్టులు రోజంతా ఇంజినీర్లతో కలిసి కూర్చోవాలి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలీదు. శని, ఆదివారాలు కూడా తాత్కాలికంగా రద్దయిపోయాయి. నో.. ఫ్యామిలీ. ఓన్లీ ఇస్రో ఈజ్‌ ద ఫ్యామిలీ. రీతూకి ఇద్దరు చిన్నపిల్లలు. వాళ్లను చూసుకునేదెవరు? మొదట్లో సతమతమైంది. తర్వాత సర్దుకుంది. ‘నేనున్నాను’ అన్నాడు భర్త. ‘మేం లేమా?’ అన్నారు అక్కాచెల్లెళ్లు. అలా పద్దెనిమిది నెలల పాటు భవబంధాలను తెంపేసుకున్నారు రీతూ! భూమ్మీద పనిచేస్తున్నట్లు లేదు ఆమెకు. ఆకాశంలోకి వెళ్లిపోయి, అక్కడేదో దేవుడు అప్పగించిన పనిని చేస్తున్నట్లుగా ఉంది. పనే దైవం అయినప్పుడు, శాస్త్రవేత్తలకు కూడా దేవుడుంటాడా అనే ప్రశ్నే రాదు.

రీతూ కొడుక్కి 11 ఏళ్లు. కూతురుకి 5 ఏళ్లు. ఎంత నాన్న చేసినా, ఎంత చిన్నమ్మలు చేసినా అమ్మ ఉండాల్సిందే. రీతూ డ్యూటీ నుంచి రాగానే పిల్లలు మీద పడిపోయేవారు. కదలనిచ్చేవారు కాదు. స్కూల్లో ఏం జరిగిందో అప్పటికప్పుడు ఆ తల్లి వినవలసిందే. అన్నీ అమ్మతో చెప్పుకుంటే వాళ్లకెంత సంతోషంగా ఉండేదో, రీతూకీ అంత రిలీఫ్‌గా ఉండేది. అలా చూస్తే మార్స్‌ మిషన్‌ సక్సెస్‌లో రీతూ పిల్లల పార్ట్‌ కూడా ఉందనుకోవాలి! తల్లికి  ముద్దు ముద్దు మాటలతో రిలీఫ్‌ని ఇచ్చి, ఆమెను తిరిగి ఉత్సాహంగా పనికి పంపింది వాళ్లే కాబట్టి.
‘‘మెన్‌ ఆర్‌ ఫ్రమ్‌ మార్స్, ఉమెన్‌ ఆర్‌ ఫ్రమ్‌ వీనస్‌ అంటారు కదా! మార్స్‌ సక్సెస్‌ అయింది కాబట్టి ఇక మీదట ఉమెన్‌ ఫ్రమ్‌ మార్స్‌ అనొచ్చా’’ అని ఇటీవల బి.బి.సి. జర్నలిస్టు గీతా పాండే రీతూను అడిగారు. అప్పుడు రీతూ ఏం చెప్పారో తెలుసా? ‘‘ఐ యామ్‌ ఎ ఉమన్‌ ఫ్రమ్‌ ఎర్త్‌’’ అన్నారు! ‘‘ఒక అద్భుతమైన అవకాశాన్ని పొందిన మహిళను’’ అని చెప్పారు!
రీతూ కరిధాల్‌
డిప్యూటీ ఆపరేషన్స్‌ డైరెక్టర్, మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌


ఫిక్షన్‌ : స్టార్‌ టెక్‌
రీతూ.. రాత్రిపూట ఆకాశాన్ని చూసి ఇన్‌స్పైర్‌ అయితే, నందిని.. టీవీలో ‘స్టార్‌ టెక్‌’ ప్రోగ్రామ్‌ చూసి సైన్స్‌ మీద ఇష్టం పెంచుకున్నారు. నందినీ వాళ్లమ్మ మేథ్స్‌ టీచర్‌. నాన్న ఇంజినీర్‌. ఆయనకు ఫిజిక్స్‌ అంటే ప్రాణం. కుటుంబ సభ్యులంతా కూర్చొని సైన్స్‌ ఫిక్షన్‌ ప్రోగ్రామ్‌ స్టార్‌ టెక్‌ను చూస్తుండేవారు... కలిసి నక్షత్రాలను చూస్తున్నట్లు!  అప్పుడైతే నందిని ఏం అనుకోలేదు. సైంటిస్ట్‌ అయిపోవాలని. పెద్దయ్యాక అనుకోకుండా ‘ఇస్రో’లో చేరిపోయారు! ‘హౌ లక్కీ కదా’ అనుకుంటారట ఇప్పుడు. ఇరవై ఏళ్ల క్రితం నందిని.. చెయ్యడమే ఇస్రోకి అప్లై చేశారు. ఫస్ట్‌ అప్లికేషన్‌. అదే ఇప్పటి వరకు ఫస్ట్‌ ఉద్యోగం. ఇన్నేళ్ల ఆమె కెరియర్‌లోని అద్భుతం.. మార్స్‌ మిషన్‌కి పనిచేయడం. నందిని దృష్టిలో మార్స్‌ మిషన్‌ ఇస్రో కోసం మాత్రమే కాదు. ఇండియా కోసం, ప్రపంచం కోసం కూడా. మాక్కూడా కొంత ‘స్పేస్‌’ ఇవ్వండి అని విదేశాలు సైతం ఇండియా వైపు చూసేలా చేసిన మార్స్‌ మిషన్‌లో తన వంతు కృషి కూడా ఉంది కదా అని ఆలోచిస్తే నందినికి అంతరిక్ష విహారం చేసినట్లుగా ఉంటుందట!

చిన్నప్పుడు పిల్లలందరం ఆకాశం గురించి మాట్లాడుకుంటాం కదా. అలా ప్రపంచ దేశాలన్నీ ఇస్రో గురించి గొప్పగా చెప్పుకోవాలని, ఇస్రోలో ఏం జరుగుతోందో తెలుసుకోడానికి ఉవ్విళ్లూరుతూ ఉండాలని నందిని ఆశ. మార్స్‌ మిషన్‌ సక్సెస్‌ని ఇస్రో సైంటిస్టుగా బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు నందిని. ‘బెంగళూరులో మా ఆఫీస్‌కి వచ్చిపోతున్నప్పుడు చూడాలి మమ్మల్ని. ఎంత రికగ్నిషనో చెప్పలేను’ అని నవ్వేస్తారు నందిని. థ్రిల్లింగ్‌ ఉంటుందట.. అందరూ తమను అలా అభినందనగా చూడ్డం. ఇప్పుడు మోదీజీ ఆమెకు ఇంకొక థ్రిల్లింగ్‌ ఇచ్చారు. రెండు వేల రూపాయల నోటు మీద మార్స్‌ మంగళ్యాణ్‌ శాటిలైట్‌ను ముద్రించడం ఇస్రో ఉద్యోగులుగా తమకు దక్కిన గౌరవంగా నందిని భావిస్తున్నారు.  

మార్స్‌ మిషన్‌ ప్రారంభంలో నందిని, ఆమె సహోద్యోగులు రోజూ 10 గంటలు పనిచేసేవారు. లాంచ్‌ డేట్‌ దగ్గర పడడంతో ఆ పది గంటలు పద్నాలుగు గంటలు అయ్యాయి. ఉదయాన్నే ఆఫీసుకు వచ్చేవారు. రాత్రి బాగా పొద్దుపోయేవరకు అక్కడే ఉండేవారు. ఒక్కోసారి రెండోరోజు మధ్యాహ్నం మాత్రమే ఇంటికి వెళ్లేందుకు కుదిరేది. అదీ కాసేపు నిద్రపోడానికి . లేచాక టైమ్‌ చూసుకోవడం, మళ్లీ ఆఫీసుకు పరుగెత్తడం. ప్రాజెక్టులో ఊహించని విధంగా ఏవో సమస్యలు తలెత్తేవి. వాటికి కారణాలు కనుక్కోవడం, పరిష్కారాలు కనిపెట్టడం.. ఇంకో ప్రాజెక్టు నెత్తికి ఎత్తుకున్నంత పని. వీటన్నిటినీ నందిని నెగ్గుకొచ్చారు కానీ, కూతురి ఎగ్జామ్స్‌కి తను దగ్గర లేకపోవడమే ఇప్పటికీ ఆమెకు గుర్తుకొస్తుంటుంది.

మార్స్‌ మిషన్‌ పనులు డెడ్‌లైన్‌కి సరిగ్గా మధ్యలో ఉన్నప్పుడు.. నందిని కూతురికి స్కూల్‌ ఫైనల్‌ ఎగ్జామ్స్‌ వచ్చేశాయి. మంచి కాలేజీలో సీటు రావాలంటే మంచి మార్కులు రావాలి. పక్కనే ఉండి, కూతురికి కావలసినవన్నీ అమర్చిపెడుతూ, ఆమెను చదివించాలని నందినికి ఉండేది కానీ, అలా వీలుకాదని కూడా ఆమెకు తెలుసు. అయినప్పటికీ దొరికిన కొద్ది టైమ్‌లోనే ఆమె కూతురితో ఉన్నారు. ఇంటికీ, ఆఫీసుకీ మధ్య ఒక షటిల్‌లా తిరిగారు. కూతురితో పాటు ఉదయం నాలుగింటికే లేచేవారు నందిని. ఆమె చదువుతున్నంతసేపూ తోడుగా కూర్చొనేవారు. ఇప్పుడు అవన్నీ తలచుకుంటుంటే చాలా సంతోషంగా ఉంటుందట. కూతురికి మంచి మార్కులు వచ్చాయి. మేథ్స్‌లో అయితే నూటికి నూరు! ఇప్పుడా అమ్మాయి మెడిసిన్‌కి ప్రిపేర్‌ అవుతోంది. ‘‘అయితే మిమ్మల్ని ఇప్పుడు మార్స్‌ ఉమన్‌ అనొచ్చా?’’ అని గీతా పాండే అడిగినప్పుడు నందిని కూడా రీతూ చెప్పిన సమాధానమే చెప్పారు. ‘‘నా కాళ్లు భూమి మీదే ఉన్నాయి. మనలోని అత్యుత్తమమైనది బయటికి రావాలంటే మనం డౌన్‌ టు ఎర్త్‌ ఉండాలి’’ అన్నారు. ‘‘మార్స్‌ మిషన్‌ ఒక అడుగు మాత్రమే. ఇంకా వెయ్యడానికి చాలా అడుగులు ఉన్నాయి’’ అని కూడా నందిని అన్నారు.
నందినీ హరినాథ్‌
డిప్యూటీ ఆపరేషన్స్‌ డైరెక్టర్, మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement