సాక్షి, తిరుపతి : పారదర్శక పాలన, జవాబుదారీతనం, నిజాయితీతో ప్రజలకు పాలన అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ శాఖల్లో పనిచేసే రిటైర్డ్ ఉద్యోగులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 18వ తేదీన 2323 జీవోను విడుదల చేసింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే రిటైర్డ్ ఉద్యోగులను తొలగించాలని, వారి స్థానంలో యువతకు అవకాశాలు కల్పించాలని జీవోలో పేర్కొంది. టీటీడీ విద్యా సంస్థలు, ఎస్వీయూ ఈ జీవోను వెంటనే అమలు చేశాయి. మహిళా వర్సిటీలో మాత్రం ఇంతవరకు అమలుకు నోచుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ప్రభుత్వ శాఖల్లో వివిధ ప్రాతిపదికన పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులను తొలగించాలన్న ప్రభుత్వ జీఓ మేరకు టీటీడీ 194 మంది రిటైర్డ్ ఉద్యోగులను వెంటనే తొలగించింది. టీటీడీ విద్యా సంస్థల్లో పనిచేసి, ఉద్యోగ విరమణ తర్వాత మళ్లీ కొనసాగుతున్న రిటైర్డ్ ఉద్యోగులను తొలగించారు. టీటీడీ జూనియర్ కళాశాలల్లో అతిథి అధ్యాపకులుగా పనిచేస్తున్న రిటైర్డ్ అధ్యాపకులను తప్పించారు. డిగ్రీ కళాశాలల్లో పనిచేసే 56 మందిని ఇంటికి పంపారు. ఎస్వీ యూనివర్సిటీలో ఉద్యోగ విరమణ అనంతరం వివిధ పేర్లతో చేరి పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులను తాజా జీఓ ప్రకారం తొలగించారు. ఐదుగురు ఉద్యోగులను తొలగిస్తూ ఈ నెల 5న ఎస్వీయూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని యూనివర్సిటీలు, ఇతర సంస్థలు జీఓను పక్కాగా అమలు చేశాయి.
పట్టించుకోని మహిళా వర్సిటీ
ప్రభుత్వం తాజాగా ఇచ్చిన జీఓ 2323ను శ్రీపద్మావతి మహిళా వర్సిటీ ఏమాత్రమూ పట్టించుకోలేదు. వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో నలుగురు అధ్యాపకులు, ఇతర విభాగాల్లో మరో ఇద్దరు, టెక్నికల్ విభాగం, ఇతర శాఖలలోకలిపి 15 మంది నిబంధలకు విరుద్ధంగా పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ.45 వేల నుంచి రూ.75 వేల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు.
ఈ ఉద్యోగుల వల్ల వర్సిటీపై నెలకు రూ.10 లక్షల వరకు, ఏడాదికి కోటి రూపాయలకు పైగా భారం పడుతోంది. అంతేకాకుండా యువతకు అవకాశాలు రాకుండా రిటైర్డ్ అ«ధ్యాపకుల వల్ల నష్టం కలుగుతోంది. ప్రభుత్వ జీఓను అమలు చేయకపోగా రిటైర్డ్ ఉద్యోగులను తొలగించాల్సిన అవసరం లేదని మొండిగా వ్యవహరిస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులను తొలగించాలని వైఎస్సార్ విద్యార్థి విభాగం ఈ నెల 6న వినతిపత్రం సమరి్పంచింది. అయినప్పటికీ వర్సిటీ అధికారులు స్పందించలేదు.
తెల్ల ఏనుగుల్లా..
మహిళా వర్సిటీలో రిటైర్డ్ అధ్యాపకులు తెల్ల ఏనుగుల్లా మారారు. వారి స్థానంలో యువతకు రెట్టింపు స్థానంలో అవకాశాలు ఇవ్వవచ్చు. అయినప్పటికీ రిటైర్డ్ ఉద్యోగులను కొనసాగిస్తుండటం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి జీఓ 2323ని అమలు చేయాల్సిన అవసరం ఉంది.
నిబంధనలకు విరుద్ధంగా..
శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్‌గా రిటైర్డ్ ప్రొఫెసర్‌ను నియమించుకున్నారు. నిబంధనల మేరకు 65 దాటిన అధ్యాపకులకు నిర్ణయాలు తీసుకునే పదవులు ఇవ్వరాదు. ఇక్కడ డైరెక్టర్‌గా పనిచేసే ప్రొఫెసర్‌కు 65 సంవత్సరాలు దాటినా కొనసాగిస్తున్నారు. నిత్యం అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వారిని పొగడడమే ఆయన పనిగా పెట్టుకున్నారని గుసగుసలున్నాయి. తమకు అన్ని విధాలా అనుకూలంగా ఉండడంతో ఆయనను నిబంధనలకు విరుద్ధంగా పదవిలో కొనసాగిస్తున్నట్లు విమర్శలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment