పెళ్లి పీటలపై పబ్జీ | Groom Plays PUBG at His Wedding as Bride Looks On | Sakshi
Sakshi News home page

పెళ్లి పీటలపై పబ్జీ

Published Fri, May 3 2019 12:26 AM | Last Updated on Fri, May 3 2019 12:26 AM

Groom Plays PUBG at His Wedding as Bride Looks On - Sakshi

ఓ భర్త తన భార్యను పబ్‌జీ ఆడొద్దన్నాడని.. విడాకులకు దరఖాస్తు చేసింది భార్య. ఈ ఘటన యూఏఈ లో జరిగింది. తన భార్య నిత్యం ఆన్‌లైన్‌లో పబ్‌జీ ఆడుతుండటంతో.. ఆ ఆటను ఆడొద్దని సూచించాడు. మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో వారిద్దరు పోలీసులను ఆశ్రయించారు. చాట్‌ ఆప్షన్‌ యాక్టివేట్‌ చేయకుండా.. తన బంధువులు, స్నేహితులతో మాత్రమే ఆడుతున్నానని ఆమె పోలీసులకు తెలిపింది. అయితే తన భార్య ఇలా నిత్యం ఆటలో మునిగిపోవడంతో భార్యగా తన బాధ్యత, విధులను నిర్వహించకుండా ఉంటుందన్న భయంతోనే ఆడొద్దన్నాని ఆ భర్త తెలిపారు. అయినా గేమ్‌ ఆడొద్దు అని అంటే స్వేచ్ఛను హరించడం కాదంటూ.. ఈ చిన్న విషయానికే తన భార్య విడాకులు అడగటం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నాడు. ప్రస్తుతం పబ్‌జీ ట్రెండ్‌ నడుస్తోంది. జనాలు నిద్రాహారాలు మాని పబ్‌జీ గేమ్‌ను ఆడుతున్నారు. ఇదొక వెర్రిగా మారి.. చివరకు వారి ప్రాణాలనూ తీస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ గేమ్‌కు బలయ్యారు. పబ్‌జీ ఆడొద్దన్నారని ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కోకొల్లలు. పచ్చటి కాపురాల్లో కూడా పబ్‌జీ చిచ్చు పెట్టడం మొదలైనట్లే ఉంది.

పెళ్లిలో జీలకర్రాబెల్లం పెట్టేటప్పుడు పెళ్లికూతురూ పెళ్లికొడుకూ ఏం చేస్తారు?  ఇదేం పిచ్చి ప్రశ్న?  ఒకళ్ల కళ్లలోకి మరొకళ్లు చూసుకుంటూ ఉంటారు.. పెళ్లికూతురు కాస్త సిగ్గుతో ఓరగా చూస్తుంటే, పెళ్లికొడుకు కొంటెగా చూడ్డం, తమనెవరూ గమనించడం లేదనుకున్నప్పుడు చిలిపిగా నవ్వడం వంటివి చేస్తారు. కాకపోతే ఇప్పుడు సీన్‌ కాస్త మారింది, ఇద్దరూ కలిసి ఫొటోగ్రాఫర్‌ లేదా వీడియోగ్రాఫర్‌ కళ్లలోకి చూడవలసి వస్తోంది. మరి తాళి కట్టేటప్పుడు? అప్పుడూ అంతేగా... కావాలంటే ‘పెళ్లిపుస్తకం’ సినిమాలో సీన్‌ గుర్తు తెచ్చుకోండి... తాళికడుతూ రాజేంద్రప్రసాద్, దివ్యవాణి మెడమీద మెల్లగా గిల్లుతాడు... సారీ.. గిలిగింతలు పెడతాడు కదా!ఇంతకీ ఇప్పుడీ ఉపోద్ఘాతమంతా ఎందుకనేగా డౌటు.అక్కడికే వెళ్దాం... అక్కడికంటే పెళ్లి సీన్‌కి. రీల్‌ పెళ్లి కాదు... రియల్‌ పెళ్లే అది. అక్కడ ఒక పక్క పంతులుగారు మంత్రాలు చదువుతూనే ఉన్నారు. మరోపక్క ఆహూతులందరూ విచ్చేశారు. పెళ్లికూతురు పక్కనే కూర్చుని ఉంది. పెళ్లికొడుకేమో సీరియస్‌గా సెల్‌ఫోన్‌లో పబ్జీ గేమ్‌ ఆడుకుంటున్నాడు!ఎలాగో పెళ్లి కూడా అయిపోయింది... ఆ తర్వాత బంధుమిత్రులందరూ ఒక్కొక్కరుగా వచ్చి అభినందనలు తెలిపి, తెచ్చిన బహుమతో, కానుక ఉన్న కవరో చేతిలో పెట్టి షేక్‌హ్యాండిస్తుంటే అప్పుడు కూడా పెళ్లికొడుకు పబ్జీని వదల్లేదు. కనీసం మర్యాదకైనా కళ్లెత్తి కూడా చూడలేదెవరినీ. 

ఈ తతంగాన్ని.. కాదు... నిర్వాకాన్నంతటినీ ఎవరో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. అది ఇప్పుడు వైరలైంది. ఇదెక్కడి గోలండీ బాబూ... అంటారా? అనండి... అయితే ఆ వెంటనే ఓ ఆలోచన కూడా చెయ్యండి. అదేమిటంటే... మీ పిల్లలు కూడా పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటేనో... స్పోర్ట్స్‌లోనో, గేమ్స్‌లోనో స్కోర్‌ సాధిస్తేనో మురిసి మూర్ఛపోయినంత పని అయ్యి, ఆ మురిపెంలో ఓ స్మార్ట్‌ ఫోన్‌ గిఫ్ట్‌ ఇచ్చేస్తారు. ఆనక అందులో ఉండే రకరకాల యాప్‌ల ద్వారా జరిగే చిన్నచిన్న లాభాలు చూసి మీ పిల్లల తెలివితేటలకు మరోసారి మురిసిపోతారు. ఆ తర్వాత జరిగేదే మీకు అర్థం కాదు... వాళ్లు ఆ ఫోన్‌లో అడ్డమైన సైట్లూ చూసి, అడ్డగాడిదలెవరో, అసలైన వాళ్లెవరో తెలియక లౌలోనో, గేమ్స్‌లోనో మునిగిపోతారు. చదువు కాస్తా చెట్టెక్కించేస్తారు. ఇవన్నీ జరగాలని లేదు... జరగ కూడదని కూడా ఏమీ లేదు. గేమ్స్‌... అందులోనూ పబ్‌జీ అనే గేమ్‌ ఒకేసారి వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి కొన్ని వందలమంది ఆడుకోవచ్చు. ఒకసారి ఆ రుచి మరిగారా... ఇక పిల్లలను అందులోనుంచి బయటకు తీసుకురావడం మన వల్ల కాదు.పైనున్న వీడియో గురించి ఎక్కువ సమాచారం లేదు కానీ, అది చూస్తుంటే మాత్రం ఈ సమాచారాన్నంతా చెప్పుకోవలసి వచ్చింది. 
ఇక మీ ఇష్టం
– డి.వి.ఆర్‌. భాస్కర్‌ 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement