ఇది ఆమె జీవనచిత్రం | guduru lakshmi inspired by laasya words | Sakshi
Sakshi News home page

ఇది ఆమె జీవనచిత్రం

Published Tue, Sep 2 2014 11:47 PM | Last Updated on Sat, Sep 2 2017 12:46 PM

ఇది ఆమె జీవనచిత్రం

ఇది ఆమె జీవనచిత్రం

 కొన్నేళ్ల కిందటి వరకు ఆమె సాధారణ గృహిణి.
 భర్త... కూతురితో అందంగా అల్లుకున్న పొదరిల్లు ఆమెది.
 ఓ రోజు... ఊహించని ప్రమాదం.
 బస్సు తాకిడికి కింద పడిపోయారామె.
 బస్సు చక్రం ఆమె చేతి మీద నుంచి వెళ్లిపోయింది.
 తాను కోల్పోయింది చేతినా... జీవితాన్నా?
 ఈ ప్రశ్నకు తనకు తానే సమాధానం చెప్పుకున్నారామె.
 ఇప్పుడామె... ఒక చేత్తోనే బొమ్మలు వేస్తున్నారు.
 చిన్న పిల్లలకు బొమ్మలు వేయడం నేర్పిస్తున్నారు.
 గాంధీజీ ఆశయాలను బోధిస్తున్నారు.
 జీవితాన్ని జయించడం ఇలా... అంటున్నారు.
 తన జీవితాన్ని కొత్తగా చిత్రించుకున్నారు.

 
గూడూరు లక్ష్మిది శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా. జిల్లా కేంద్రం నెల్లూరులోని పొగతోటలో ఆమె నివాసం. లక్ష్మి తాత రావూరు జయరామిరెడ్డి సినీ నటుడు. విజయ వాహిని స్టూడియోలో పనిచేసేవారు. ఆమె పుట్టే నాటికి చెన్నై నగరంలో ఉన్న వారి కుటుంబం తండ్రికి లైబ్రేరియన్‌గా ఉద్యోగం రావడంతో నెల్లూరు జిల్లా వాకాడుకు మారింది. పెద్దయిన తర్వాత లక్ష్మణ్‌కుమార్‌తో వివాహమైంది. ఇంత వరకు ఎటువంటి ప్రత్యేకతలూ లేకుండానే చాలా సాధారణంగా గడిచిపోయింది ఆమె జీవితం.
 
పెళ్లయిన ఏడేళ్ల వరకు వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగిపోయింది. ఓ రోజు బంధువుల పెళ్లికి భర్తతోపాటు బైక్ మీద వెళ్తున్నారామె. ఇంతలో... వెనుక నుంచి బస్సు వచ్చి ఢీకొట్టింది. తేరుకుని చూస్తే ఎడమ చెయ్యి రెండుగా తెగిపోయి దూరంగా పడి ఉంది. ఆ చేతిని అతికించడం అసాధ్యమన్నారు డాక్టర్లు. ఆ పరిస్థితిలో భర్త, కుటుంబసభ్యులందరూ ఆమెకి ధైర్యం చెప్పారు. కానీ ఆమెని ఆవరించిన దిగులు మాత్రం వదల్లేదు.
 
తాను కొలిచే దేవుడే పలికించినట్లు...

ప్రమాదం గురించి తెలిసిన బంధువుల్లో ఒక్కొక్కరు ఒక్కోరోజు వచ్చి పలకరించి పోతున్నారు. ఎవరికి తోచినట్లు వాళ్లు జీవితం పట్ల నిరాశ చెందవద్దని ధైర్యం చెప్పి పోతున్నారు. అలాంటప్పుడు కూతురు లాస్య అన్న మాటలే తనకు మార్గదర్శనం చేశాయంటారు లక్ష్మి. బంధువుల్లో ఒకామె... ‘‘లాస్యా... మీ అమ్మకి చేయి లేదు కదా. తనేమీ చేసుకోలేదు. నువ్వు సాయం చేస్తుండాలి’’ అన్నారు. వెంటనే లాస్య... ఉక్రోషంతో ‘‘మా అమ్మ ఒక్క చేత్తోనే అన్ని పనులూ చక్కగా చేస్తోంది.
 
ఒకచెయ్యి లేకపోతేనేం మరో చెయ్యి ఉందిగా. ఎవ్వరూ మా అమ్మకు చెయ్యి లేదనవద్దు’’ అన్నది. ఆరేళ్ల లాస్యకు ఏం తెలిసి అన్నదో కానీ ఆ మాటలే తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయంటారు లక్ష్మి. ‘‘బహుశా నేను పూజించే దేవుడే పాప చేత ఆ మాటలు పలికించాడేమో అనిపిస్తుంది. ఆ తర్వాత నేను ఏ రోజూ నాకు చెయ్యి లేదనుకోలేదు. ఉన్న చేత్తోనే ఏమేం చేయవచ్చో అన్నీ చేస్తున్నాను. అప్పటికే నాకు చిత్రలేఖనంలో ప్రవేశం ఉంది. కుట్లు, అల్లికలు బాగా చేసేదాన్ని. ప్రమాదం తర్వాత చిత్రలేఖనంలో మళ్లీ శిక్షణ తీసుకున్నాను. ఇప్పుడు గ్లాస్ పెయింటింగ్స్, తంజావూరు పెయింటింగ్స్, పాట్ పెయింటింగ్... అనేక రకాల చిత్రలేఖనాలు వేస్తున్నాను. నాలో ఉన్న కళకు మెరుగులు దిద్దుకోకుండా ఇంటికే పరిమితమవుతున్నానని ఆ దేవుడే ఇలా చేశాడేమో అనుకుంటున్నాను’’ అని స్థితప్రజ్ఞతతో అన్నారామె.
 
గాంధీజీ స్ఫూర్తితో...

లక్ష్మి వేసిన బొమ్మలలో గాంధీజీ ఎక్కువగా కనిపిస్తారు. అలాగే ఆమె ఆసక్తి ఉన్న చిన్న పిల్లలకు చిత్రలేఖనంలో ఉచితంగా శిక్షణనిస్తుంటారు. పిల్లలకు గాంధీజీ ఆశయాలను బోధిస్తుంటారు. గాంధీ ఆశ్రమ నిర్వహణ బాధ్యతల్లో చురుగ్గా పాల్గొంటారు. అదే విషయాలను ప్రస్తావించినప్పుడు... ఆమె బాల్యంలో జరిగిన సంఘటలను గుర్తు చేసుకున్నారు. ‘‘నాకు మా తాత దగ్గర పెరగడం ఇష్టం. ఆయనతో సినిమా షూటింగులకు వెళ్లడం ఇష్టం. అలా తరచూ మద్రాసు (చెన్నై)కు వెళ్లేదాన్ని. ఒకసారి... అవి ‘యమగోల’ షూటింగ్ జరుగుతున్న రోజులు. తాతతోపాటు స్టూడియోకి వెళ్లాను. నటుడు కైకాల సత్యనారాయణగారు కనిపించారు. దగ్గరకు వెళ్లి పలకరించాను. అప్పుడాయన ‘‘పరిచయం లేకపోయినా సరే చూడగానే గుర్తు పట్టి వచ్చి పలకరించావు.
 
నీలో మంచి విల్‌పవర్, ఆత్మవిశ్వాసం ఉన్నాయి. నువ్వేమైనా సాధించగలవు’’ అని మెచ్చుకున్నారు. అప్పుడే ఆయన గాంధీజీ గురించి చాలా చెప్పారు. అలా గాంధీజీ గురించి చదవడం అలవాటైంది. ఆ తర్వాత బొమ్మలు వేయడం కూడా. ఒకసారి పల్లెపాడు గ్రామం (నెల్లూరు జిల్లా)లో ఉన్న గాంధీజీ ఆశ్రమం నుంచి నాకు పిలుపు వచ్చింది. నేను ఆశ్రమ నిర్వహణ బాధ్యత తీసుకోవడానికి సంతోషంగా అంగీకరించాను’’ అన్నారు.
 
చేతిరాత బాగుంటే...
గాంధీ ఆశ్రమంలోని పిల్లలకు చిత్రలేఖనం నేర్పించడానికి మరో కారణాన్ని చెప్తారు లక్ష్మి. గాంధీజీ తరచుగా ‘చేతిరాత బాగాలేకపోతే తల రాత బాగుండదనేవారు’ పిల్లల చేతిరాత బాగుపడాలంటే చిత్రలేఖనం మంచి మార్గం- అనుకున్నాననంటారు. రక్తదానం ఎన్నిసార్లు చేశారంటే ఆమె నుంచి ఇన్నిసార్లనే సమాధానం రాదు. ఎన్నిసార్లు చేశానో లెక్కపెట్టుకోలేదు. రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ‘ఉత్తమ సేవా ప్రతినిధి అవార్డు’ అందుకున్నారామె. గాంధీ ఆశ్రమ నిర్వహణలో భాగంగా చాలా సందర్భాల్లో ఆమె చేతి నుంచి డబ్బు ఖర్చవుతూ ఉంటుంది. ఒకసారి లక్ష్మి అల్లుడు (లాస్య భర్త) లక్షన్నర రూపాయల వరకు సహాయం చేశారు. ‘‘ఆ సంఘటనతో నా కుటుంబం నాకే కాక, నా ఆశయానికి కూడా అండగా ఉందనిపించి చాలా సంతోషం కలిగింది’’ అన్నారామె.
 
లక్ష్మి తన జీవితాన్ని పలువురికి స్ఫూర్తిదాయకంగా మలుచుకున్నారు. నెల్లూరు నగరంలో ఏటా ఇస్కాన్ ఆధ్వర్యంలో రథయాత్ర జరుగుతుంది. ఆ రథం మీద శంకుచక్రాలు, హనుమంతుడు, గోవిందనామాలతోపాటు, ఇస్కాన్ మందిరంలో పరదాల మీద చిత్రాలు కూడా లక్ష్మి వేసినవే.
 
ఎవరి జీవితంలోనైనా ప్రమాదం జరిగితే అది వారి జీవితాన్ని అనూహ్యమైన మలుపులు తిప్పుతుంది. చాలా మంది ప్రమాదం తర్వాత ఆ దిగులుతో ఇంటి నాలుగ్గోడలకే పరిమితమవుతుంటారు. కానీ లక్ష్మి మాత్రం ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని చక్కటి మలుపులు తిప్పుకున్నారు.
- సాక్షి, నెల్లూరుఫొటోలు : ఆవుల కమలాకర్
 
నటులు సత్యనారాయణగారు మనందరం ఆ జాతిపిత అడుగుజాడల్లో నడవాలన్నారు. ఆ మాటలు నాలో చాలా ప్రభావం చూపించాయి. నాన్న లైబ్రేరియన్ కావడంతో పుస్తకాలు చదివే అవకాశం ఉండేది. గాంధీజీ పుస్తకాలే ఎక్కువగా చదివేదాన్ని. చిత్రలేఖనంలోనూ ఎక్కువ గాంధీజీ బొమ్మలే వేస్తున్నాను. బాపూజీ బొమ్మ వేయడం నాకిష్టం.
  - లక్ష్మి, విధిని జయించిన మహిళ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement