అబ్బాయిలూ చూశారా? అమ్మాయి నమ్మింది! | Guys ready? The girl believed | Sakshi
Sakshi News home page

అబ్బాయిలూ చూశారా? అమ్మాయి నమ్మింది!

Published Tue, Oct 28 2014 11:57 PM | Last Updated on Sat, Sep 2 2017 3:30 PM

అబ్బాయిలూ చూశారా?  అమ్మాయి నమ్మింది!

అబ్బాయిలూ చూశారా? అమ్మాయి నమ్మింది!

‘ఉంది’ అని ఆమె నమ్ముతున్న ప్రపంచాన్ని ఆమెకు ఇవ్వగలమా? ‘గోయింగ్ హోమ్’ అనే ఐదు నిమిషాల లఘుచిత్రం పూర్తయ్యాక తెరపై కనిపించే ప్రశ్న ఇది. ఆమె అంటే స్త్రీ. ప్రధానంగా భారతీయ స్త్రీ. ఆమె నమ్ముతున్న ప్రపంచం అంటే? ఎలాంటి ప్రపంచం అది? ఎలాంటిదో తెలుసుకోవాలని ఉన్నా, లేకున్నా ఒక బాధ్యతగా ఈ ‘గోయింగ్ హోమ్’ అనే షార్ట్‌ఫిల్మ్‌ని మీరు (ముఖ్యంగా అబ్బాయిలు, పురుషులు) చూసి తీరాలి. యూ ట్యూబ్‌లో ఈ చిత్రాన్ని ఇప్పటికే ఇరవై లక్షలమందికి పైగా చూశారు.
 
వికాస్ బల్ దర్శకత్వంలో ‘వోగ్ ఇండియా’ సంస్థ ‘వోగ్ ఎంపవర్’ పేరిట తను నిర్వహిస్తున్న నిరంతర సామాజిక చైతన్య కార్యక్రమంలో భాగంగా ‘గోయింగ్ హోమ్’ చిత్రాన్ని సమర్పించింది. ఇందులో ఆలియా భట్ ప్రధాన పాత్రధారి. చిత్రం ఇలా మొదలవుతుంది:
 ఆలియా ఒంటరిగా కారులో ప్రయాణిస్తుంటుంది. అప్పటికే బాగా పొద్దుపోయి ఉంటుంది. చుట్టూ చీకటి. రోడ్డంతా నిర్మానుష్యం. ఇంతలో ఇంటి నుంచి ఫోన్ వస్తుంది. తన కోసం ఆందోళనగా ఎదురుచూస్తున్న తల్లితో, ‘‘మామ్, ఇంకో పది నిమిషాల్లో ఇంట్లో ఉంటాను’’అని ఫోన్ చేసి చెబుతుంది ఆలియా. అలా చెప్పిన కొద్ది క్షణాలకే ఆమె కారు ఫెయిల్ అవుతుంది! ఎంత ప్రయత్నించినా కారు స్టార్ట్ అవదు. అదే సమయానికి ఒక ఎస్.యు.వి. (పెద్ద కారు)లో ఐదుగురు యువకులు అటుగా వెళుతూ ఆలియాను చూసి కారు స్లో చేస్తారు. వారి కళ్లు మెరుస్తాయి. అందమైన అమ్మాయి! ఒంటరిగా... అసహాయంగా! ఇకనేం, కారును ఆ ఆమ్మాయి సమీపానికి తెచ్చి ఆపుతారు. కారులోంచి దిగకుండా తననే తినేసేలా చూస్తుంటారు. వాళ్ల ముఖాలు చూస్తుంటే వారి బుర్రల్లో ఏదో ప్లాన్ తయారవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంటుంది. అయితే వారింకా కారు దిగకుండానే, ఆలియానే తిన్నగా నడుచుకుంటూ వారి దగ్గరకు వచ్చేస్తుంది! ‘‘ కారు ట్రబుల్ ఇచ్చింది, ప్లీజ్ ఓసారి చూస్తారా’’ అని అడుగుతుంది. ఆ మాటతో వాళ్లు కిందికి దిగి, ఆలియా కారు దగ్గరికి వస్తారు. వాళ్లకీ అది స్టార్ట్ అవదు. చివరికి ఆలియానే వారిని అడుగుతుంది తనను వారి కార్లో ఇంట్లో దింపమని! అలా అడుగుతున్నప్పుడు ఆమెలో ఎలాంటి సంకోచమూ ఉండదు. భయం ఉండదు. చాలా మామూలుగా, అదొక మామూలు విషయం అన్నట్లుగా అడుగుతుంది! వెంటనే ఆ ఐదుగురూ ఉత్సాహంగా ఆమెను కార్లో ఎక్కించుకుంటారు.

ఇక అక్కడి నుంచి మనలో (వీక్షకులలో) టెన్షన్ పెరిగిపోతుంటుంది. ఏ క్షణంలో వారు ఆ అమ్మాయిని ఏం చేస్తారో, ఎటు తీసుకుపోతారోనని. ఆలియాకు లేని టెన్షన్ మనకు ఎందుకంటే ఇటీవలి కాలంలో మనం ఎన్ని అఘాయిత్యాల గురించి వినలేదు? ‘నిర్భయ’ ఘటన దగ్గర్నుంచి ఇవాళ్టి వరకూ ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరిపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి కదా, అందుకు. ఆలియాకు ఎందుకు టెన్షన్‌గా లేదంటే ఆమె ఒక ప్రపంచాన్ని నమ్ముతోంది. ఆ ప్రపంచంలో పురుషులంతా మంచివారు. సో... తన కూల్‌గా ఉంది. ఇంతకీ చివరికి ఏమౌతుంది? ఆలియా నమ్మకం నిజం అవుతుంది. ఆ ఐదుగురూ ఆ అమ్మాయిని క్షేమంగా ఇంటి దగ్గర దింపుతారు. వారికి ఆమె థ్యాంక్స్ చెబుతుంది. చిరునవ్వుతో వారి దగ్గర సెలవు తీసుకుంటూ ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా కృతజ్ఞత తెలుపుతుంది. ఆఖరికి అందరికీ కలిపి ఓ ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. తర్వాత స్క్రీన్‌పైన ముందు ప్రస్తావించుకున్న ప్రశ్న కనిపిస్తుంది... ఆమె నమ్ముతున్న ప్రపంచాన్ని ఆమెకు ఇవ్వగలమా? అని.

లెదర్ స్కర్ట్‌లో ఆలియా ఐదుగురు అబ్బాయిలకూ బాగా సెక్సీగా కనిపిస్తుంటుంది. వారి కళ్లలోని కోరిక వీక్షకులకు కూడా స్పష్టంగా కనిపిస్తుంటుంది. అయినా ఏం జరగదు. ‘రెచ్చిపోయే మనస్తత్వాలు ఉంటాయి తప్ప, రెచ్చగొట్టే దుస్తులు ఉండవు’ అని  ఆలియా చేత ఇలాంటి దుస్తులు తొడిగించడం ద్వారా దర్శకుడు సమాజానికి చెప్పదలిచారు.      రెచ్చిపోయే మనస్తత్వాలు ఉంటాయి తప్ప, రెచ్చగొట్టే దుస్తులు ఉండవు.

 - వికాస్ బల్, ‘గోయింగ్ హోమ్’ చిత్ర దర్శకుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement