చిన్నవయసులోనే వెంట్రుకలు తెల్లబడటం అనే సమస్యను ఇటీవల ఎక్కువగా గమనిస్తున్నాం. వంశపారంపర్యం, పోషకాహార లోపం... వీటికి ప్రధానకారణాలు అవుతున్నాయి. జుట్టుకు డై వేయడం ఇష్టపడని వారు ఈ పద్ధతిని అనుసరించవచ్చు.
రెండు టేబుల్ స్పూన్ల హెన్నా పౌడర్, టేబుల్ స్పూన్ పెరుగు, టేబుల్ స్పూన్ మెంతిపొడి, టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, రెండు టేబుల్ స్పూన్ల పుదీన రసం, రెండు టీ స్పూన్ల తులసి రసం బాగా కలపాలి. గంట సేపు అలాగే ఉంచి, తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. గంట తర్వాత నేచురల్ షాంపూతో శుభ్రపరుచుకోవాలి. ఇలా నెల రోజులకు ఒకసారి చేస్తూ ఉండాలి.
నోట్:
అల్లం, తేనె సమపాళ్లలో కలిపి, రోజూ టీ స్పూన్ చొప్పున ఉదయం పూట తీసుకోవాలి.
ఉసరి (సి-విటమిన్), ఆకుకూరలు, ఖర్జూర (ఐరన్), చేప ఉత్పత్తులు (విటమిన్-ఇ) ఉండేవి ఆహారంగా తీసుకోవాలి. మసాజ్‌కు నల్లనువ్వుల నూనె లేదా ఆవ నూనె ఉపయోగించాలి. ఈ జాగ్రత్తలు వెంట్రుకలు తెల్లబడటం, పొడిబారడం సమస్యను నివారిస్తాయి.
నల్లని వలయాలకు చక్కని మందు...
ముఖం జీవకళ కోల్పోయినట్టుగా కనిపిస్తుందనిపిస్తే ముందుగా చెక్ చేయాల్సింది కంటి చుట్టూత భాగాన్ని. కంటి కింద చర్మం వదులుగా అవడం, నల్లబడటం వంటి సమస్యను గుర్తిస్తే నిద్రవేళలను సరిగ్గా పాటించడం లేదని, పోషకాహారం మీద దృష్టిపెట్టడం లేదని, మానసిక ఒత్తిడి పెరుగుతోందని గుర్తించాలి. అంతేకాదు చర్మం ముడతలు పడుతుంది అనే విషయాన్నీ కంటిచుట్టూత చర్మమే ముందుగా తెలియపరుస్తుంది.
అందుకని... నిద్రించేటప్పుడు తల-మెడ సమాంతరంగా ఉండేలా దిండును అమర్చుకోవాలి. దీని వల్ల ద్రవాలు సక్రమంగా చేరి, కంటిచుట్టూత చర్మం బిగువును కోల్పోదు. చర్మం ముడతలు తగ్గడానికి, తెల్లబడటానికి స్కిన్ టైటనింగ్, వైటనింగ్ క్రీమ్‌లను ముఖానికి వాడతారు. కాని కళ్ల కింద వాడలేరు. దీంతో కంటిచుట్టూ నల్లగా తయారవుతుంది.
అందుకని రాత్రి, పగలు ఎలాంటి క్రీములు వాడినా ఫేసియల్ మాయిశ్చరైజర్‌ను కొద్దిగా చూపుడు వేలికి అద్దుకొని కంటి చుట్టూత మృదువుగా రెండు నిమిషాలు రాయాలి. దీంతో కంటి చుట్టూ ఉన్న చర్మం లోపల రక్తప్రసరణ జరిగి, పొడిబారడం తగ్గుతుంది. కంటి చుట్టూత చర్మం సున్నితంగా ఉంటుంది. అందుకని రాత్రిపూట మేకప్ నుంచి, ఇతరత్రా ఫేసియల్ ఉత్పత్తులనుంచి తగినంత విశ్రాంతిని కంటికి ఇవ్వాలి. నల్లని వలయాలకు మనం తీసుకునే జాగ్రత్తలే మంచి రెమిడీగా పనిచేస్తాయి.
వెంట్రుకలు తెల్లబడుతుంటే...!
Published Thu, Jan 9 2014 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM
Advertisement