జీవితంలో మనకు ప్రధానమైన శత్రువు భయం. మతంగ మహర్షి శాపం వల్ల వాలి ఋష్యమూక పర్వతం మీదకు రాలేడని సుగ్రీవునికి తెలుసు. అయినా ధనుర్బాణాలు, కత్తులు ధరించి, ఋషి వేషంలో ఉన్న బలిష్టులైన రామలక్ష్మణులను ఋష్యమూక పర్వత శిఖరాల మీద నుండి చూసి భయంతో బిగుసుకు పోయాడు సుగ్రీవుడు. అప్పుడు సుగ్రీవునికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ తొలిసారి మనకు రామాయణంలో దర్శనమిస్తాడు హనుమ. ఈ రకంగా చూస్తే హనుమ తొలి దర్శనంలోనే మనకు నిర్భయత్వాన్ని అలవరచుకొమ్మన్న పాఠం చెప్పే గురువు.
సందర్భోచిత వేషధారణ
సందర్భోచిత వేషధారణ హనుమను చూసే నేర్చుకోవాలి. సుగ్రీవుని కోరిక మేరకు రామలక్ష్మణులతో మాట్లాడ్డానికి వెళ్ళేముందు కపివేషంలో కాక భిక్షువు వేషంలో వెళతాడు. వచ్చినవారు ఎవరు, ఎలాంటి వారు అన్న విషయం తెలిసిన తర్వాతనే నిజరూపం ధరిస్తాడు. మనం రూపాలు మార్చలేకపోయినా వస్త్రధారణనైనా సందర్భోచితంగా మార్చుకోగలం గదా! సమయోచిత వేషధారణ మాత్రమే కాదు, సమయోచిత సంభాషణా చాతుర్యమూ హనుమకు వెన్నతో పెట్టినవిద్య.
అతను మాట్లాడిన నాలుగు మాటలకే మురిసిపోతాడు తానే గొప్ప వాగ్విశారదుడైన శ్రీరామచంద్రుడు.బలహీన క్షణాల్లో ఒక్కొక్కసారి ఎంత టి అసాధారణ ప్రజ్ఞావంతులకైనా క్షణం పాటు ‘ఆత్మహత్యతో ఈ బాధకంతా భరతవాక్యం పాడదామా‘ అని అనిపించవచ్చు. కానీ అలాంటి సందర్భాలలో కూడా వెంటనే తేరుకోగలగడం నిజమైన ధీశాలి లక్షణం. లంకానగరమంతా వెదికి సీత జాడ కానరాక హనుమంతుడు అదేస్థితికి చేరుకొంటాడు.
‘సీతమ్మ జాడ దొరికే వరకు వానప్రస్థుడిలా ఉంటాను, లేదా అగ్నిలోకి ప్రవేశిస్తాను, లేదా నీటిలోకి ప్రవేశించి శరీరాన్ని వదిలేస్తాను’ అనుకున్నాడు హనుమ. కాని వెంటనే ‘ఆత్మహత్య మహాపాపం. జీవించి ఉంటేనే సుఖాలను పొందగలం. కనుక మళ్ళీ ఉత్సాహాన్ని పొంది వెతుకుతాను. ఎవడు శోకానికి లొంగిపోడో, ఎవడు నిరంతరం ఉత్సాహంతో ఉంటాడో, వాడు మాత్రమే కార్యాన్ని సాధించగలడు. అందుకని నేను శోకానికి లొంగను, మళ్లీ సీతమ్మని అన్వేషిస్తాను, మళ్లీ ఈ లంకాపట్టణం అంతా వెతికేస్తాను‘ అని ఉత్సాహాన్ని పొంది సీతాన్వేషణలో పడతాడు హనుమ. ఇదే సామాన్యులకూ, ధీశాలికీ మధ్య గల తేడా.
సిసలైన సంభాషణా చతురుడు
సంభాషణా చాతుర్యం అంటే ఊరకే మాట్లాడుతూ వెళ్ళడం కాదు. అవసరమైనపుడు అతి స్వల్పంగా, ముక్కుకు సూటిగా, క్లుప్తంగా, ప్రధాన విషయాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడటం కూడా రావాలి. లంకనుంచి తిరిగి వచ్చిన తరువాత దూరం నించే‘దృష్టా సీతా‘ అని ఒక్క మాటలో తన కార్యం విజయవంతమైనదన్న విషయాన్ని సూచించి ఆ తరువాత మిగతా విశేషాలను వివరిస్తాడు.
అలాగే లంకలో సీత దగ్గిర అకస్మాత్తుగా ఊడిపడి గాభరా పెట్టకుండా కొమ్మమీద కూర్చుని మొదట రామకథను వినిపించి, ఆమెను తగిన మానసిక స్థితికి తేవడంలో హనుమంతుని నేర్పు కనిపిస్తుంది. అదీ మాట తీరు అంటే. ఇది మనం నేర్చుకోవాలి హనుమన్న దగ్గర. అంతేకాదు, సవాళ్లను స్వీకరించి సమర్థంగా ఎదుర్కొని విజయవంతంగా బయటపడటమెలాగో అన్న అంశాన్ని నేర్చుకోవడానికి హనుమన్న జీవితమే మనకు పాఠ్యపుస్తకం.
సముద్ర తీరానికి చేరుకొన్నప్పుడు హనుమన్న ప్రవర్తన చూసి వినయమంటే ఏమిటో, అన్నీ ఉన్నా ఒదిగి ఉండటమంటే ఏమిటో నేర్చుకోవాలి. సముద్రాన్ని దాటి లంకను చేరే పని నువ్వే చేయగలవని అందరూ కలిసి అడిగేంతవరకూ తానుగా నా బలమింతటిది అనీ, ఈ పని నేను చేయగలను అనీ మిడిసి పడలేదు. అవాంతరాలను ఎదుర్కొని కార్యసాధన చేయడమెలాగో, తొణకకుండా బెణకకుండా కార్యాన్ని చక్కబెట్టడమెలాగో హనుమ చేసి చూపించాడు.
మైనాకుడు అనే పర్వతం ఆదరించి ఆతిథ్యం స్వీకరించి పొమ్మని అడగటం, దాన్ని సున్నితంగా తిరస్కరించి ముందుకు సాగటం సానుకూలంగా కనిపించే విఘ్నాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పుతాయి. భుజబలాన్నీ, బుద్ధిబలాన్నీ ఉపయోగించి విఘ్నాలను గట్టెక్కడం ఎలాగో సింహికను జయించడంలోనూ, సరమ నోటిలోనికి ప్రవేశించి బయటకు రావడంలోనూ చూపుతాడు.
ఆటంకాలను ఎలా ఎదుర్కోవాలన్న విషయాన్ని హనుమయ్య దగ్గర నేర్చుకోవాలి. అంతిమవిజయానికి ఉపయోగ పడుతుందనుకొంటే, కార్యసాధనలో అవసరమైతే చొరవతీసుకొని స్వతంత్ర నిర్ణయాలను కూడా తీసుకోగలిగి ఉండాలి కార్య సాధకుడు. సీతాన్వేషణకు బయలుదేరినప్పుడు, లంకా దహనం చేయమనీ, రాక్షస సంహారం చేయమనీ, రాముడు ఆయనతో చెప్పలేదు.
కానీ రామదూతనైన తనే ఇంత విధ్వంసాన్ని సృష్టించగలిగితే కపిసైన్యంతో రాముడు వస్తే ఎంత రాముడి ముందు తాను నిలవగలనా అన్న అనుమానాలను రావణునిలో రేకెత్తించడం అనే ప్రయత్నం చేయడం హనుమ తీసుకొన్న స్వతంత్ర నిర్ణయం. అక్కడికక్కడ నిర్ణయాలను తీసుకోగలగాలి.ఇలా హనుమంతుని దగ్గర మనమెన్నో వ్యక్తిత్వ వికాసలక్షణాలనూ, సకారాత్మక ఆలోచనా విధానాన్నీ, మేనేజ్ మెంట్ స్కిల్స్ అని చెప్పుకొనే యాజమాన్య కౌశలాన్నీ ఎంతైనా నేర్చుకోవచ్చు, నేర్చుకోవాలి కూడా. – రాయపెద్ది అప్పాశేష శాస్త్రి, ఆదోని
సమున్నతమైన ఆలోచనా విధానం, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే తెగువ, అసాధారణ కార్యకుశలత, భయాన్నీ, నిరాశనూ, నిస్పృహనూ దరిచేరనివ్వని ధీశక్తి... వీటన్నిటి కలబోత ఉత్తమవ్యక్తిత్వం అవుతుంది. వీటికి తోడు బుద్ధిబలం, కీర్తిని సాధించాలన్న తపన, ధైర్యం, భయరాహిత్యం, వాక్చాతుర్యం, ఆరోగ్యంతో కూడిన బలిష్టమైన శరీరం వంటివి మనం కోరదగిన వ్యక్తిత్వంలోని అంశాలు. మన పురాణసాహిత్యాన్ని పరిశీలించినపుడు ఈ గుణాలలో కొన్ని, కొంతమందిలో కనపడవచ్చు. కానీ ఈ లక్షణాలన్నీ ఒక్కరిలోనే సందర్శించ గలమా అని ఆలోచిస్తే హనుమంతుడొక్కడే కానవస్తాడు.
కష్టాల్లో ఉన్న వాళ్ళను ఓదార్చడం గొప్ప కళ. అశోకవనంలో సీతతో మాట్లాడుతున్నప్పు్పడు చూడాలి హనుమ చాతుర్యం. ‘అమ్మా, వానరసైన్యంలో నాకన్నా తక్కువ వాళ్ళెవరు లేరు, నాతో సమానమైనవారూ, నన్ను మించినవారూ ఎందరో ఉన్నారు. రాముడు వానరసైన్యంతో రావణుని సునాయాసంగా జయించగలడు. కనుక నీవు నిర్భయంగా ఉండమ్మా‘ అన్న ఇటువంటి పలుకులు ఎంత దుర్భర పరిస్థితిలో ఉన్న వారికైనా ఎంత సాంత్వన కలిగించ గలుగుతాయో చూడండి. ఇదీ మనం హనుమ దగ్గర నేర్చుకోవాల్సిన చాతుర్యం.
Comments
Please login to add a commentAdd a comment