సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జహంగీర్‌పురిలో మత ఘర్షణలు జరిగిన ప్రాంతంలో అక్రమ కట్టడాల కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్‌డీఎంసీ) అధికారులు బుధవారం ఉదయం భారీ బందోబస్తు కూల్చివేతకు దిగారు. కొన్ని తాత్కాలిక, శాశ్వత కట్టడాలను నేలమట్టం చేశారు. నోటీసులివ్వకుండానే కూల్చివేయడం ఏమిటని స్థానికులు ఆగ్రçహించారు. బుల్‌డోజర్లను అడ్డుకున్నారు. కూల్చివేతలను తక్షణం అడ్డుకోవాలంటూ జమైత్ ఉలెమా–ఇ–హింద్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. యథాతథ స్థితిని కొనసాగించాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అవి తమకందలేదంటూ అధికారులు గంటన్నర పాటు కూల్చివేతలు కొనసాగించారు. దాంతో పిటిషనర్ మళ్లీ సుప్రీం తలుపు తట్టడంతో కూల్చివేతలు ఆగాయి. విచారణ గురువారానికి వాయిదా పడింది.
అన్ని పిటిషన్లపై నేడు విచారణ
కూల్చివేతలు రాజ్యాంగవిరుద్ధంగా, అనధికారికంగా జరుగుతున్నాయని పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కోర్టును ఆశ్రయించబోతున్నామని తెలిసి మధ్యాహ్నాం ప్రారంభించాల్సిన కూల్చివేతలను ఉదయం 9 గంటలకే అధికారులు మొదలుపెట్టారని ఆరోపించారు. నివాసాలు, వాణిజ్య ఆస్తులను కూల్చకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కూడా ధర్మాసనాన్ని కోరారు. దీనిపై అన్ని పిటిషన్లను గురువారం విచారించాలని కోరగా జస్టిస్ రమణ అంగీకరించారు. సుప్రీం ఉత్తర్వులను తీసుకొని సీపీఎం సీనియర్ నేత బృందా కారత్ ఘటనా స్థలికి చేరుకుని బాధితులతో మాట్లాడారు.
విలువల విధ్వంసం: రాహుల్
ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లో హింస జరిగిన ప్రాంతాల్లో ప్రభుత్వాలు బల్‌డోజర్లు వాడటంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ విలువల విధ్వంసమేనని మండిపడ్డారు. పేదలు, మైనార్టీలకు లక్ష్యంగా చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ‘‘విద్వేష బుల్‌డోజర్లను తక్షణమే ఆపండి. వాటికి బదులు ప్రధాని మోదీ విద్యుదుత్పత్తి ప్లాంట్లను ప్రారంభించాలి. బీజేపీ అధినేత నేతలు వారి హృదయాల్లోని ద్వేషాన్ని కూల్చేసుకోవాలి’’ అంటూ ట్వీట్ చేశారు.
జేసీబీ.. జిహాద్ కంట్రోల్ బోర్డ్: బీజేపీ
జేసీబీ అంటే జిహాద్ కంట్రోల్ బోర్డ్ అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కొత్త భాష్యం చెప్పారు. బీజేపీ తీరుపై ఆప్ తీవ్రంగా స్పందించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంటిని, బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని, హింసకు కారకులైన బీజేపీ నేతల ఇళ్లను బుల్‌డోజర్లతో కూల్చేయాలి. అప్పుడే మత హింస, అల్లర్ల నుంచి దేశానికి విముక్తి’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
చదవండి: (కొట్టి.. పాదాలు నాకించి.. దళిత విద్యార్థికి తీవ్ర అవమానం)
Comments
Please login to add a commentAdd a comment