
మెర్రీ కేక్స్
‘మెర్రీ’ అంటే సంతోషం.
ఇది సంతోషాన్నిచ్చే పండుగ.
అవును... ఇచ్చే పండుగ!
ప్రేమను కానుకల్లా...
ప్యాకేజ్ చేసి ఇచ్చే ప్రేమ ఎలా ఉంటుంది?!
మృదువుగా...
అందంగా...
తియ్యగా...
కేకులా ఉంటుంది.
క్రిస్మస్ కేక్స్... మీ కోసం!
‘మెర్రీ క్రిస్మస్’ కోసం!!
క్రిస్మస్ కేక్
కావాల్సినవి: స్పాంజ్ కేక్, ప్లమ్ కేక్‌ని ఈ కింద చెప్పిన విధంగా అలంకరిస్తే క్రిస్మస్ కేక్ సిద్ధం... ప్లమ్ కేక్/ స్పాంజ్ కేక్ – 1 (కేజీ), గుడ్డులోని తెల్లసొన – 100 ఎం.ఎల్, ఐసింగ్ షుగర్ (పంచదార పొడి) – 300 గ్రాములు, నిమ్మకాయ – 1 (రసం తీయాలి) ఆప్రికాట్ జామ్ – 20 గ్రాములు, మార్జిపాన్ క్రీమ్ – తగినంత అలంకరణకు: శాంటాక్లాజ్ – 1, క్రిస్‌మస్ ట్రీ – 1 (చిన్నది), శాటిన్ రిబ్బన్ – 1, స్టార్– 1
తయారీ: ప్లమ్‌కేక్‌కి పైన, చుట్టుపక్కల ఆప్రికాట్ జామ్ పూయాలి. మార్జిపాన్‌తో ప్లమ్‌కేక్‌ను అంతా కవర్ చేయాలి. గుడ్డులోని తెల్లసొనను గరిటతో నురగ వచ్చేదాకా గిలకొట్టాలి. దీంట్లో పంచదార పొడి, నిమ్మరసం కలపాలి. దీనిని ‘రాయల్ ఐసింగ్’ అంటారు. దీనిని ప్లమ్ కేక్ మీద లేయర్‌లాగా పూయాలి. చివరగా శాంటాక్లాజ్, క్రిస్‌మస్ ట్రీ, శాటిన్ రిబ్బన్, స్టార్‌లతో అలంకరిస్తే క్రిస్మస్ కేక్ సిద్ధం.
క్యారెట్ కేక్
కావాల్సినవి: మైదా – 2 కప్పులు, బేకింగ్ పౌడర్ – టీ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, దాల్చిన చెక్క పొడి – అర టీ స్పూన్, జాజికాయపొడి – చిటికెడు, వెన్న – కప్పు, పంచదార పొడి – కప్పు, కండెన్స్‌డ్ మిల్క్ – ఒక టిన్ను (500 మి.లీ), వెనీలా ఎసెన్స్ – అర టీ స్పూన్, క్యారెట్ తురుము – ఒకటిన్నర కప్పు, డ్రై ఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, కిస్‌మిస్) – అర కప్పు, పాలు – అర కప్పు
తయారీ: మైదా, బేకింగ్ పౌడర్, సోడా, ఉప్పు, దాల్చిన చెక్క పొడి, జాజికాయపొడి కలిపి జల్లించాలి. వెన్న, పంచదారపొడి, కండెన్స్‌డ్ మిల్క్, వెనిలా ఎసెన్స్ వేసి నురగ వచ్చేలా గిలకొట్టాలి. ఇందులో జల్లించిన మైదా మిశ్రమం, క్యారెట్ తురుము, సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. పిండి గట్టిగా ఉంటే... కొద్దిగా పాలు పోసి కలపాలి. కేక్ టిన్ను లోపల ఫాయిల్ పేపర్ పరిచి, కేకు మిశ్రమం వేసి గరిటెతో, లేదంటే చేతితో టిన్ను లోపల అంతా సర్దాలి. అవెన్‌ని 150 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో వేడి చేసి, అర గంటపాటు బేక్ చేసి తీయాలి. తర్వాత లేయర్స్‌గా కట్ చేయాలి. లేయర్ల మధ్యలో వైట్ బటర్‌ని పెట్టి, ఆ పైన కట్ చేసిన క్యారెట్ కేక్‌ను అమర్చాలి. పైన వైట్ బటర్‌తోనూ, కలర్ క్రీమ్‌తోనూ అలంకరించాలి.
పైనాపిల్‌కేక్
కావాల్సినవి: గుడ్లు – 4, మైదా – 200 గ్రాములు, బేకింగ్ పౌడర్ – అర టీ స్పూను, వంటసోడా – పావు టీ స్పూన్, వెన్న – 200 గ్రాములు, పంచదార – 200 గ్రాములు, పైనాపిల్ ఎసెన్స్ – 6 చుక్కలు, పైనాపిల్ ముక్కలు – 8, చెర్రీలు – 8
తయారీ: కేక్ చేసే టిన్నులో మూడు చెంచాల పంచదార వేసి, వేడి చేయాలి. అది కరిగి ఎర్రగా అవుతుంది. ఆ పాకాన్ని గిన్నెకి అంతా రాసి ఉంచాలి. మైదాలో బేకింగ్ పౌడర్, వంటసోడా వేసి రెండు మూడు సార్లు చల్లించాలి. పైనాపిల్ చెక్కు తీసి సన్నని, గుండ్రటి స్లైసులుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో వెన్న, పంచదార వేసి కరిగేవరకు బాగా కలపాలి. ఇందులో కోడిగుడ్లు పచ్చసొన వేసి కలపాలి. తెల్లసొనను విడిగా నురుగ వచ్చేలా గిలకొట్టాలి. ఈ వెన్న మిశ్రమంలో గుడ్ల మిశ్రమం, మైదాపిండిని ఒకదాని తరువాత ఒకటి వేసి కలుపుతుండాలి.
చివరలో ఎసెన్స్ వేయాలి. క్యారమిల్ సిరప్ రాసిన కేక్ టిన్నులో పైనాపిల్ ముక్కలు దగ్గర దగ్గరగా అమర్చాలి. వీటి మధ్యభాగంలో చిన్న ముక్క తీసేసి అక్కడ చెర్రీపళ్లు పెట్టాలి. కలిపి సిద్ధంగా ఉంచిన కేక్ మిశ్రమాన్ని వేసి సమానంగా పరవాలి. ముందే వేడి చేసుకున్న 180 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దగ్గర 50 నిముషాల పాటు బేక్ చేయాలి. చల్లారిన తరువాత టిన్నును ఒక పళ్లెంపై పెట్టి తిరగేసి, కేక్‌ను బయటకు తీస్తే పైనాపిల్ ముక్కలు పైకి కనపడుతూ కేక్ తయారవుతుంది. అడుగున పెట్టిన పళ్ల ముక్కలు పైకి వస్తాయన్నమాట. తర్వాత వైట్ బటర్, పైనాపిల్, చెర్రీ, చాకో స్టిక్స్‌తో అలంకరించుకోవాలి.
ఎగ్‌లెస్ కేక్
కావాల్సినవి: మిల్క్‌మెయిడ్ – 400 గ్రాములు, పాలు – 300 మి.లీ, వైట్ బటర్ – 180 గ్రాములు, పంచదార – 15 గ్రాములు, మైదా – 250 గ్రాములు, వంట సోడా– చిటికెడు, బేకింగ్ పౌడర్– టీ స్పూన్, వెనీలా ఎసెన్స్ – 10 మి.లీ.
తయారీ: మైదా, వంటసోడా, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించుకోవాలి. దీనికి మిల్క్‌మెయిడ్, పాలు, వెనీలా ఎసెన్స్, చక్కెర, వైట్ బటర్ కలిపి చిక్కగా చేసుకోవాలి. అవెన్‌ని 150 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో వేడి చేసి, ఈ మిశ్రమం ఉన్న కేక్‌పాత్రను అవెన్‌లో 20 నిమిషాలు బేక్ చేసుకోవాలి.
వాల్‌నట్‌కేక్
కావాల్సినవి: మైదా – పావుకేజీ, గుడ్లు – 6, పంచదార పొడి – 200 గ్రాములు, బేకింగ్ పౌడర్ – అర టీ స్పూన్, వంటసోడా – చిటికెడు, వైట్ బటర్ – పావుకేజీ, వాల్‌నట్స్– 25 గ్రాములు (పలుకులుగా చేయాలి)
తయారీ: ఒక పెద్ద గిన్నెలో మైదా, బేకింగ్ పౌడర్, వంట సోడా వేసి జల్లించాలి. దీంట్లో బాగా గిలకొట్టిన గుడ్లసొన వేసి కలపాలి. తర్వాత పంచదార, బటర్, వాల్‌నట్ పలుకులు బాగా కలిపి, పక్కన ఉంచుకోవాలి. బేకింగ్ గిన్నె అడుగున కొద్దిగా బటర్ రాసి, ఆ తరువాత ఈ మిశ్రమాన్ని అందులో వేసి, సమానంగా చేయాలి. అవెన్‌లో 180 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో 30–40 నిమిషాలు బేక్ చేసి, తీయాలి. పొడి చేసిన పంచదార పైన చల్లి, బటర్ రాసి, వాల్‌నట్స్‌తో అలంకరించాలి.