‘సంజు’లో పరేష్ పాత్రధారి విక్కీ కౌశల్, సంజయ్‌దత్ పాత్రధారి రణవీర్ కపూర్ , సంజయ్‌దత్, పరేష్ గెహలానీ
సంజయ్ దత్‌ను జైల్లో పడేశారు. పెద్ద స్టార్. పైగా టాడా కేసులో ఉన్నాడు. అతడిని ఎవరైనా చంపితే అదొక గొడవ అని ఒంటరి గదిలో ఉంచారు. చీకటి... మాట్లాడే దిక్కు లేదు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. కేసు నడిచింది. ఏకె 56 రైఫిల్ ఉన్నందుకు ఆరేళ్ల జైలు శిక్ష విధించారు. అప్పటికే మూడేళ్లు జైల్లో ఉన్నాడు కనుక ఇంకో మూడేళ్లు ఎరవాడ జైల్లో గడపాలి. ముంబై బ్లాస్ట్స్‌తో కాని టెర్రిరిస్ట్ చర్యతో కాని సంజయ్ దత్‌కు ఏం సంబంధం లేదనీ కాని ప్రాణభయంతో అనుమతి లేకుండా ఏకె 56 దగ్గర ఉంచుకున్నందుకు మాత్రమే జైలు శిక్ష అని కోర్టు ప్రకటించింది.
సంజయ్ దత్ ఎరవాడ జైలుకు చేరుకున్నాడు.ఈసారి నలుగురులో తిరిగేంత స్వేచ్ఛ ఉంది.కొంచెం ఊపిరి సలుపుకునే వీలు ఉంది.కాని అక్కడ సంజయ్‌కు ఏ జ్ఞాపకం వెంటాడింది.తల్లి ఏనాడో మరణించింది. తండ్రి కూడా గతించాడు.తోబుట్టువుల దగ్గర అన్ని రహస్యాలు మాట్లాడలేము.ఇక మిగిలిందల్లా స్నేహితులు.ఆ స్నేహితులే సంజయ్ దత్‌కు జైల్లో పదే పదే గుర్తుకొచ్చారు. దగ్గర కూర్చునే స్నేహితులు, ధైర్యం చెప్పే స్నేహితులు, గట్టిగా హగ్ చేసుకునే స్నేహితులు... మనిషి ఆస్తి ఐశ్వర్యాలు కోల్పోయి ఒంటరి కాడు. స్నేహితులను కోల్పోయినప్పుడే ఒంటరి అవుతాడు.జైల్లో ఉన్నప్పుడు అసలైన శిక్ష స్నేహితులను కలవకపోవడమే.‘సంజు’ సినిమాలో ఒక స్నేహితుడి పాత్ర ఉంటుంది. తెర మీద ఆ పాత్ర పేరు ‘కమలేష్ కన్హయ్యలాల్ కపాసి’. నటుడు వికీ కౌశల్ దానిని పోషించాడు.విక్కీ కౌశల్ గతంలో ‘మసాన్’ సినిమాతో ప్రేక్షకులకు తెలుసు. కాని ‘సంజు’ సినిమాతో ఎక్కువమందికి తెలిసి పెద్ద స్టార్ అయ్యాడు. ‘సంజు’ సినిమాలో ఈ పాత్ర చివరికంటా సంజయ్‌దత పాత్ర పోషించిన రణబీర్ కపూర్‌కు తోడుగా ఉంటుంది. అమెరికాలో డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో చేరినప్పుడు అతనికి బాసటగా నిలుస్తుంది. అతడి కష్టంలో అండగా నిలుస్తుంది. అలాంటి స్నేహితుడు లేకపోతే సంజయ్‌దత్ ఏమైపోయి ఉండేవాడా అనిపిస్తుంది.
సినిమా చూసిన ప్రేక్షకులకు నిజ జీవితంలో ఈ పాత్ర ఎవరా అనే కుతూహలం కలుగుతుంది. అతని పేరు ‘పరేష్ ఘెలాని’. అమెరికాలో స్థిరపడ్డ ఇండియన్. ఇతనిది సంజయ్ దత్‌ది ఒకే వయసు. సంజయ్ తల్లి నర్గిస్ వైద్యం కోసం ఆమెను అమెరికాలోని హాస్పిటల్‌లో ఉంచినప్పుడు ఆమె కోలుకోవడం కోసం ఒక ఫ్యాన్‌గా అక్కడి వస్తాడు. అప్పుడే సంజయ్‌దత్‌కు పరిచయం అవుతాడు. ఆ పరిచయం చాలా మంచి స్నేహంగా మారుతుంది. అప్పటికే సంజయ్‌దత్ డ్రగ్స్‌కు బానిస అయి ఉంటాడు. అతణ్ణి ఆ మత్తు నుంచి బయటపడేయడానికి పరేష్ ఘెలాని చాలా ప్రయత్నించాడు. రిహాబిలేషన్ సెంటర్ నుంచి సంజయ్ పారిపోయి పరేష్ దగ్గరకు చేరుకున్నప్పుడు అతడే తిరిగి సెంటర్‌కు పంపాడు. ఏకే 56 ఉందన్న కారణంగా అరెస్టయినప్పుడు కూడా అమెరికా నుంచి ఇండియాకు వచ్చి సంజయ్ కోసం తిప్పలు పడ్డాడు. అయితే మీడియా ఏకంగా ముంబై పేలుళ్లకు సంజయే సూత్రధారి అన్నంతగా కథనాలు వెలువరించడంతో అమెరికాలో ఎఫ్‌బిఐ తనను కూడా విచారిస్తుందన్న భయంతో సంజయ్‌కు దూరం అయ్యాడు. ఎరవాడ జైలులో సంజయ్‌కు ఎక్కువగా గుర్తొచ్చిన స్నేహితుడు అతడే.
ఇన్నాళ్లకు మళ్లీ ‘సంజు’ సినిమాతో పరేష్ వార్తలలోకి ఎక్కాడు.ఈ సినిమా ఆ ఇద్దరి స్నేహాన్ని మళ్లీ బలపరిచింది.ప్రేక్షకులు ప్రతి మనిషికి ఇలాంటి స్నేహితుడుండాలి అని మెచ్చుకుంటున్నారు.ఆమిర్ ఖాన్ సినిమా చూసి పరేష్ పాత్ర పోషించిన విక్కీ కౌశల్‌కు ప్రశంసలు కురిపించాడు. అన్నట్టు విక్కీ కౌశల్ సినిమా ఇండస్ట్రీలో ఒక సాధారణ స్టంట్ మేన్ కుమారుడు. కొంతకాలం అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి ‘సంజు’ సినిమాతో పెద్ద పేరు సంపాదించుకున్నాడు. ఇంతకీ సంజు చూశారా? ఇంకా లే....దా!
Comments
Please login to add a commentAdd a comment