
ఆయన నా బాధను అర్థం చేసుకుంటారా?
ఇంద్రభవనం లాంటి ఇల్లు, రాకుమారుడిలాంటి భర్త, ముత్యాల్లాంటి పిల్లలు, ఒంటి నిండా నగలు, ఇంటి నిండా నౌకర్లు... ఏం లేదు నాకు! అన్నీ ఉన్నాయి. ఉండాల్సినదాని కన్నా ఎక్కువే ఉన్నాయి. కానీ ఉండాల్సింది ఒక్కటి మిస్సయ్యింది. మావారి ఆదరణ. అలాగని ఆయనేమీ క్రూరుడు, ప్రేమ లేనివాడు కాదు. చాలా బాగా చూసుకుంటారు. ఏ లోటూ రానివ్వరు. కానీ పట్టుమని పది నిమిషాలు ప్రేమగా దగ్గరకు తీసుకోరు. నాలుగు మాటలు సరదాగా మాట్లాడరు. కారణం... క్షణం తీరిక లేకపోవడం!
ఆయన వ్యాపారి. వేర్వేరు ప్రాంతాల్లో వ్యాపారాన్ని విస్తరించారు. ఒక చోటి నుంచి ఇంకో చోటికి కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతారు. ఇవాళ హైదరాబాద్‌లో ఉంటే రేపు వైజాగ్‌లో ఉంటారు. ఆ తర్వాత విజయవాడ అంటారు. ఇలా తిరుగుతూనే ఉంటారు. అక్కడ ఎక్కడా పని లేనప్పుడే ఇంటికొస్తారు. వచ్చినా నిప్పుల మీద ఉన్నట్టే ఉంటారు. ఫోన్ వస్తే వెళ్లిపోవడానికి చెప్పులేసుకుని సిద్ధంగా ఉంటారు. మాక్కూడా కాస్త సమయం కేటాయించండి అంటే... ఈ కష్టమంతా నీకోసం, పిల్లల కోసమే కదా, అర్థం చేసుకోకపోతే ఎలా అంటూ నిట్టూరుస్తారు.
నిజమే. ఆయన చేసేదంతా మా కోసమేనని నాకూ తెలుసు. కానీ సంతోషంగా గడపాల్సిన సమయం చేయిజారిపోతే మళ్లీ ఆ ఆనందం దొరకదు అన్న విషయం ఆయనకు అర్థం కావడం లేదు. పిల్లల ఆటపాటలు, వాళ్ల ముద్దు మాటలు వినే తీరిక లేదు. నాతో సంతోషంగా గడిపే క్షణాలు లేవు. అవన్నీ రేపు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి! ఇప్పుడు సంపాదించినదంతా పెట్టి కొందామన్నా అప్పుడు ఏదీ దొరకదు. ఆ నిజం ఆయనకు ఎంత చెప్పినా బుర్రకెక్కడం లేదు. సంపాదించవద్దని కాదు. కావలసినంత సంపాదించారు కాబట్టి కాస్త విశ్రమించమని, విలువైన విషయాల పట్ల దృష్టి పెట్టమని, అందువల్ల కలిగే తృప్తి కోసం ఇంతవరకూ సంపాదించిన దాని పట్ల తృప్తి చెందడం మంచిదని! ఈ పరుగులో ఆయనకు ఆయనే అలసిపోయి ఆగాలి తప్ప ఆపే శక్తి నాకు లేదని అర్థమైపోయింది. నేనిక ఏమీ చేయలేను... ఆయన నా బాధను అర్థం చేసుకునే సమయం కోసం వేచి చూడటం తప్ప!
- జాహ్నవి, మచిలీపట్నం