పీసీవోడీ నయమవుతుందా?  | health counciling | Sakshi
Sakshi News home page

పీసీవోడీ నయమవుతుందా? 

Published Fri, Jan 26 2018 12:47 AM | Last Updated on Fri, Jan 26 2018 12:47 AM

health counciling - Sakshi

హోమియో కౌన్సెలింగ్స్‌

నా భార్య వయసు 34 ఏళ్లు. ఇటీవల ఆమె శరీరంపై వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతుంటే డాక్టర్‌కు చూపిస్తే పీసీఓడీ అన్నారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా?  – రామకృష్ణ, నరసన్నపేట 
రుతుక్రమం సవ్యంగా ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11–18 రోజుల మధ్యకాలంలో వాళ్లలోని రెండు అండాశయల్లోని ఏదో ఒకదాని నుంచి అండం విడుదల అవుతుంది. అలా జరగకుండా అపరిపక్వమైన అండాలు వెలువడి అవి  నీటిబుడగల్లా అండాశయపు గోడలపై ఉండిపోయే కండిషన్‌ను పీసీవోడీ (పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ డిసీజ్‌) అంటారు. ఇవి రెండువైపులా ఉంటే ‘బైలేటరల్‌ పీసీఓడీ’ అంటారు. ఈ సమస్యకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ జన్యుపరమైన అంశాలు ఒక కారణంగా భావిస్తున్నారు. అంతేగాక ఎఫ్‌ఎస్‌హెచ్, ఎల్‌హెచ్, ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్‌ హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. సరైన జీవనశైలి పాటించనివారిలోనూ ఇది ఎక్కువ. 

లక్షణాలు: నెలసరి సరిగా రాకపోవడం, వచ్చినా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం, రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తంపోవడం, రెండు రుతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పిరావడం, నెలసరి రాకపోవడం, బరువు పెరగడం, తలవెంట్రుకలు రాలిపోతుండటం, ముఖం, వీపు, శరీరంపై మొటిమలు రావడం, ముఖం, ఛాతీపైన మగవారిలా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల సంతానకలగకపోవడం, స్థూలకాయం, డయాబెటిస్, కొందరిలో అరుదుగా హృద్రోగ సమస్యలు రావచ్చు.  రోగిని భౌతిక లక్షణాలతో పాటు అల్ట్రాసౌండ్‌ స్కాన్, హెచ్‌సీజీ, టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్, ప్రోలాక్టిన్‌ వంటిహార్మోన్ల పరీక్షలు, రక్తంలో చక్కెరపాళ్లు, కొలెస్ట్రాల్‌ శాతం వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. హోమియో విధానంలో సరైన హార్మోన్‌ వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా దుష్ఫలితాలేవీ లేకుండా శాశ్వతంగా పీసీఓడీని నయం చేయవచ్చు.
డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లావర్, సీఎండీ, 
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్, హైదరాబాద్‌

సోరియాసిస్‌కు చికిత్స ఉందా?
నా వయసు 35 ఏళ్లు. కొన్నాళ్ల నుంచి సోరియాసిస్‌తో బాధపడుతున్నాను. ఎన్ని పూతమందులు, మందులు వాడినా సమస్య పూర్తిగా తగ్గడం లేదు. మళ్లీ మళ్లీ వస్తోంది. దీనికి హోమియోపతిలో చికిత్స ఉందా?  – సందీప్, నిజామాబాద్‌ 
సోరియాసిస్‌ను చాలామంది ఒక చర్మసమస్యగా భావిస్తారు. కానీ ఇది దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్‌ సమస్య. అంటే మన రోగనిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్య. ఇందులో చర్మ కణాలు అత్యంత వేగంగా వృద్ధిచెందడంతో పాటు ఆ కణాలు అనేక పొరలుగా ఏర్పడి, అవి వెండి రంగు పొలుసులుగా రాలిపోతుంటాయి. తర్వాత చర్మంపై రక్తంతో కూడిన చిన్న చిన్న దద్దుర్ల వంటివీ  ఏర్పడతాయి. దురద కూడా ఎక్కువ. చిరాకుగా ఉంటుంది.  సోరియాసిస్‌ వ్యాధి ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల, వీపు, అరచేతులు, అరికాళ్లు, ఉదరం, మెడ, నుదురు, చెవులు మొదలైన ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. సోరియాసిస్‌తో బాధపడుతున్న 15శాతం మందిలో ఆర్థరైటిస్‌ లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనినే ‘సోరియాటిక్‌ ఆర్థరైటిస్‌’ అంటారు. 

కారణాలు: వంశపారంపర్యం ∙మానసిక ఒత్తిడి, ఆందోళన ∙శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఏర్పడే అస్తవ్యస్తత ∙దీర్ఘకాలికంగా కొన్ని రకాల మందులు ఎక్కువగా వాడటం. 

లక్షణాలు:చర్మం ఎర్రబారడం ∙తీవ్రమైన దురద ∙జుట్టు రాలిపోవడం ∙కీళ్లనొప్పులు ∙చర్మం పొడిబారినప్పుడు పగుళ్లు ఏర్పడి రక్తస్రావమూ అవుతుంది. 
నిర్ధారణ పరీక్షలు:  స్కిన్‌ బయాప్సీ, ఈఎస్‌ఆర్, సీబీపీ, ఎక్స్‌–రే పరీక్షలు. 

చికిత్స: సోరియాసిస్‌ నివారణ/చికిత్సలకు హోమియో ఎంతగానో సహాయపడుతుంది. దీన్ని వెంటనే దీన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం అవసరం. లక్షణాలను బట్టి సోరియాసిస్‌కు సాధారణంగా ఆర్సినికం ఆల్బమ్, సల్ఫర్, కాలీకార్బ్, సొరినమ్, పెట్రోలియం మొదలైన మందులతో చికిత్స చేస్తారు. అయితే ఈ మందులను అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడాలి.
డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), 
స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 

స్పాండిలోసిస్‌ బాధిస్తోంది
నా వయసు 37 ఏళ్లు. గత ఆర్నెల్ల నుంచి తీవ్రమైన మెడనొప్పి, నడుమునొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే స్పాండిలోసిస్‌ అంటున్నారు. మందులు వాడుతున్నా, నొప్పి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. ఈ సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా?  – శివశంకర్, భీమవరం 
స్పాండిలోసిస్‌ అనేది అరగడం వల్ల వచ్చే ఒక రకమైన ఆర్థరైటిస్‌. ఇది మెడ భాగంలో వస్తే సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ అని, నడుము భాగంలో వస్తే లంబార్‌ స్పాండిలోసిస్‌ అంటారు. 
కారణాలు: ∙కాళ్లు, చేతులతో ఉన్నట్లు వెన్నులో కూడా జాయింట్స్‌ ఉంటాయి. ఈ జాయింట్స్‌ అరుగుదల వల్ల నొప్పి రావచ్చు ∙జాయింట్స్‌లోనీ ద్రవం తగ్గడం వల్ల ∙స్పైన్‌ దెబ్బతినడం వల్ల ∙వెన్నుపూసల మధ్య నుంచి నరాలు శరీరంలో వ్యాపించడానికి ఉండే దారి సన్నబడి, నరాలపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది. 

లక్షణాలు – సర్వైకల్‌ స్పాండిలోసిస్‌:  మెడనొప్పి, తలనొప్పి తల అటు–ఇటు తిప్పడం కష్టమవుతుంది. మెడ బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు ఉంటుంది. 
లంబార్‌ స్పాండిలోసిస్‌: నడుమునొప్పి, కొన్నిసార్లు నడుము నొప్పితో పాటు మెడ నొప్పి కూడా ఉంటుంది. నొప్పి నడుము నుంచి ఒకవైపు కాలు, పాదం వరకు వ్యాపిస్తుంది. దీనినే సయాటికా నొప్పి అంటారు. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు అవి సప్లై అయ్యే చోటు మొద్దుబారడం, దాంతో నడవడానికి కూడా ఇబ్బందిపడటం వంటి సమస్యలొస్తాయి. 

నివారణ: వెన్నెముకకు సంబంధించిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్‌ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం, ఒక్కసారిగా కూర్చోవడం లేదా నిల్చోవడం వంటివి చేయకపోవడం, దూరప్రాంతాలకు వాహనం నడపడం వంటివి చేయకపోవడం. 
చికిత్స: హోమియో ప్రక్రియలో రోగి శారీరక, మానసిక సమస్యలను పరిగణనలోకి కాన్‌స్టిట్యూషనల్‌ చికిత్స అందిస్తే క్రమంగా రోగనిరోధక శక్తి పెరిగి, వ్యాధి పూర్తిగా తగ్గుతుంది.
డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, 
పాజిటివ్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement