సెనఘనగ | Health food with senagalu | Sakshi
Sakshi News home page

సెనఘనగ

Published Sat, Aug 18 2018 1:04 AM | Last Updated on Sat, Aug 18 2018 1:04 AM

Health food with senagalu - Sakshi

చిరుతిండ్లలో సెనగలు ఘనమైనవి. నానబెట్టి, ఉడకబెట్టి వండితే తప్ప పంటికి లోబడవు ఒంటికి కట్టుబడవు. ఇది శ్రావణ మాసం... ఇంటింటా సెనగలు వానజల్లులా వచ్చిపడే మాసం... మరెందుకాలస్యం... ఉడికించండి, వెరైటీగా ఆరగించండి.


చెన్నా మసాలా సాండ్‌విచ్‌
కావలసినవి: బ్రెడ్‌ స్లయిసెస్‌ – ఆరు; చెన్నా మసాలా – అర కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; క్యాప్సికమ్‌ తరుగు – పావు కప్పు; చాట్‌ మసాలా – ఒక టీ స్పూను; వేయించిన జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; నల్ల ఉప్పు – కొద్దిగా; బటర్‌ – కొద్దిగా.
చెన్నా సాండ్‌విచ్‌ను... టొమాటో సాస్, గ్రీన్‌ చట్నీ, స్వీట్‌ చట్నీలతో కలిపి తింటే బాగుంటుంది.
తయారీ: ∙ బ్రెడ్‌ స్లయిసుల అంచులను కట్‌ చేయాలి ∙బటర్‌ను స్లయిసుల మీద చాకుతో సమానంగా పూయాలి     ∙ రెండు టేబుల్‌ స్పూన్ల చెన్నా మసాలా వాటి మీద ఉంచాలి ∙ వాటి మీద ఉల్లి చక్రాలు, టొమాటో చక్రాలు, క్యాప్సికమ్‌ చక్రాలు ఉంచాలి ∙ వాటి మీద కొద్దిగా చాట్‌ మసాలా, జీలకర్ర పొడి చల్లాలి ∙మరొక బ్రెడ్‌ స్లయిస్‌ను దాని మీద ఉంచాలి ∙ గ్రిల్‌ మీద బంగారు రంగులోకి వచ్చేవరకు కాల్చాలి (పెనం మీద కూడా కాల్చుకోవచ్చు) ∙వేడి వేడి సాండ్‌విచ్‌లను, గ్రీన్‌ చట్నీ లేదా టొమాటో సాస్‌ లేదా స్వీట్‌ చట్నీతో అందించాలి.


చోలే పులావ్‌
కావలసినవి: కాబూలీ సెనగలు – ముప్పావు కప్పు; బాస్మతి బియ్యం – పావు కేజీ; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; మిరప కారం – పావు టీ స్పూను; గరం మసాలా – చిటికెడు; పసుపు – చిటికెడు; కుంకుమ పువ్వు – కొద్దిగా; నిమ్మ రసం – అర టీ స్పూను; నెయ్యి – రెండు టేబుల్‌ స్పూన్లు; పుదీనా ఆకులు – గార్నిషింగ్‌ కోసం కొద్దిగా; ఉప్పు – తగినంత;
మసాలా దినుసులు ... షాజీరా – అర టీ స్పూను; ఏలకులు – 2; జాపత్రి – కొద్దిగా; బిర్యానీ ఆకు – 1; లవంగాలు – 2; దాల్చిన చెక్క – చిన్న ముక్క
గ్రీన్‌ పేస్ట్‌ కోసం...  అల్లం తురుము – ఒక టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 4; పుదీనా ఆకులు – ఒక టేబుల్‌ స్పూను; కొత్తిమీర తరుగు – మూడు టేబుల్‌ స్పూన్లు; పచ్చి మిర్చి – ఒకటి.
తయారీ:
కాబూలీ సెనగలను ముందు రోజు రాత్రి నానబెట్టి, మరుసటి రోజు ఉదయం నీరు ఒంపేసి, రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి
కుకర్‌లో కాబూలీ సెనగలు, కొద్దిగా ఉప్పు, తగినన్ని నీళ్లు జత చేసి మూత పెట్టి, 10 విజిల్స్‌ వచ్చేవరకు ఉంచి దింపేయాలి
విజిల్‌ తీశాక నీరు ఒంపేసి కాబూలీ సెనగలను పక్కన ఉంచాలి
బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగిన ంత నీటిలో సుమారు అరగంట సేపు బియ్యం నానబెట్టాలి
గ్రీన్‌ పేస్ట్‌ కోసం చెప్పిన పదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా చేసి, పక్కన ఉంచాలి.
పులావ్‌ తయారీ:
♦  ప్రెజర్‌ కుకర్‌ను స్టౌ మీద ఉంచి వేడెక్కిన తరవాత నెయ్యి వేసి కరిగాక షాజీరా, ఏలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు వంటి మసాలా దినుసులు వేసి వేయించాలి
బాగా వేగిన తరవాత ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
పచ్చి బఠాణీ జత చేసి కొద్దిగా వేయించిన తరవాత అల్లం + వెల్లుల్లి ముద్ద, టొమాటో తరుగు వేసి వేయించాలి
పసుపు, మిరప కారం, గరం మసాలా పొడి జత చేసి బాగా వేయించాలి
బాస్మతి బియ్యం జత చేసి బాగా కలియబెట్టాలి
♦  నానబెట్టిన సెనగలను జత చేయాలి
నిమ్మ రసం, కుంకుమ పువ్వు జత చేసి బాగా కలిపి, తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి మూడు విజిల్స్‌ వచ్చాక దింపేయాలి
ఆవిరి పోయిన తరవాత మూత తీసి, చెన్నా పులావ్‌ను గరిటెతో జాగ్రత్తగా కలపాలి
కొత్తిమీర లేదా పుదీనా ఆకులతో అందంగా అలంకరించాలి
వెజ్‌ సలాడ్‌ లేదా రైతా లేదా పాపడ్‌లతో అందించాలి.


పాలక్‌ చోలే
కావలసినవి: పాలకూర – 5 కట్టలు(శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి); కాబూలీ సెనగలు – ఒక కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; నీళ్లు – 2 కప్పులు; నూనె – 4 టేబుల్‌ స్పూన్లు; ఎండు దానిమ్మ గింజల పొడి – ముప్పావు టీ స్పూను; కసూరీ మేథీ – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత.
పేస్ట్‌ కోసం... ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి – 2; వెల్లుల్లి రెబ్బలు – 4.
పాలక్‌  చెన్నా మసాలా కోసం... దాల్చినచెక్క – చిన్న ముక్క; లవంగాలు – 3; ఏలకులు – 2; బిర్యానీ ఆకు – 1; పాలక్‌ చోలే మసాలా కోసం...  జీలకర్ర పొడి – అర టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; పంజాబీ గరం మసాలా పొడి – ముప్పావు టీ స్పూను.
తయారీ:
కాబూలీ సెనగలను ముందురోజు రాత్రి నానబెట్టాలి
మరుసటి రోజు ఉదయం నీరు ఒంపేసి, మూడుసార్లు బాగా కడిగి, నాలుగు కప్పుల నీరు, ఉప్పు జత చేసి కుకర్‌లో ఉంచి, స్టౌ మీద పెట్టి,  పది విజిల్స్‌ వచ్చాక దింపేయాలి
మిక్సీలో ఉల్లి తరుగు, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి
టొమాటోలను మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి.
పాలక్‌ చోలే తయారీ:
స్టౌ మీద బాణలిలో నూనె వేసి వేగాక మసాలా వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
ఉల్లి ముద్ద జత చేసి మరోమారు బాగా వేయించాలి
టొమాటో ప్యూరీ జత చేసి బాగా వేయించాలి
♦  నూనె విడిపడిన తరవాత పాలకూర తరుగు జత చేయాలి
ఉడికించిన కాబూలీ సెనగలను జత చేసి బాగా కలిపి, రెండు కప్పుల నీళ్లు పోయాలి
ఎండు దానిమ్మ గింజల పొడి వేసి మరోమారు కలపాలి
చివరగా కసూరీ మేథీ జత చేసి రెండు నిమిషాల తరవాత దింపేయాలి
రోటీ, పూరీలలోకి రుచిగా ఉంటుంది.


చెన్నా మసాలా
కావలసినవి: కాబూలీ సెనగలు (చెన్నా) – ఒక కప్పు; నీళ్లు – 3 కప్పులు; ఉప్పు – అర టీ స్పూను;
మసాలా కోసం...
పచ్చి కొబ్బరి తురుము – ఒక కప్పు; దాల్చిన చెక్క – చిన్న ముక్క; సోంపు – అర టేబుల్‌ స్పూను; జీలకర్ర – అర టేబుల్‌ స్పూను; ధనియాలు – ఒక టేబుల్‌ స్పూను; ఎండు మిర్చి – 4; లవంగాలు – 2; ఏలకులు – 3; మిరియాలు – 5;  
చెన్నా మసాలా కోసం...
నూనె – 3 టేబుల్‌ స్పూన్లు; బిర్యానీ ఆకు – 1; ఆవాలు – అర టీ స్పూను; కరివేపాకు – రెండు రెబ్బలు; పచ్చి మిర్చి – 1 ; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; పసుపు – అర టీ స్పూను; ఇంగువ – చిటికెడు; అల్లం + వెల్లుల్లి – ఒక టీ స్పూను; నీళ్లు – ఒక కప్పు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – తగినంత.
తయారీ:
ముందుగా కాబూలీ సెనగలను శుభ్రంగా కడిగి ముందురోజు రాత్రి నానబెట్టి, మరుసటి రోజు నీళ్లు ఒంపేసి, తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి కుకర్‌లో ఉంచి,  సన్నటి మంట మీద సుమారు 20 విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించి దింపేయాలి.
మసాలా తయారీ:
స్టౌ మీద బాణలి ఉంచి, మసాలా కోసం చెప్పిన దినుసులన్నీ (పచ్చి కొబ్బరి తురుము మినహా) వేసి వేయించాలి
అర కప్పు పచ్చి కొబ్బరి తురుము జత చేసి ఆపకుండా కలుపుతుండాలి
బాగా వేగిన తరవాత దింపి చల్లారనివ్వాలి
మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి.
చెన్నా మసాలా గ్రేవీ తయారీ:
స్టౌ మీద బాణలిలో మూడు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి కాగాక, ఆవాలు వేసి చిటపటలాడేవరకు వేయించాలి
బిర్యానీ ఆకు జత చేసి మరోమారు వేయించాలి
అర కప్పు ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
♦  అల్లం + వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇంగువ, కరివేపాకు జత చేసి పచ్చివాసన పోయేవరకు కలియబెట్టాలి
♦  టొమాటో తరుగు వేసి రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించాలి
ముద్దగా చేసిన మసాలా పేస్ట్‌ వేసి బాగా కలపాలి
ఉడికించుకున్న కాబూలీ సెనగలను జత చేయాలి (ఉడికించిన నీళ్లు పక్కన ఉంచుకోవాలి)
బాగా కలిపిన తరవాత పక్కన ఉంచుకున్న నీళ్లు, పచ్చి మిర్చి వేసి బాగా కలపాలి
తగినంత ఉప్పు జత చేయాలి
మిశ్రమం బాగా దగ్గరపడేవరకు కలుపుతుండాలి
కొత్తిమీరతో అలంకరించి దింపేయాలి
రోటీలు, పూరీలలోకి రుచిగా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement