వెన్నుపూసల మధ్య వాపు... తగ్గుతుందా? | health : Homeopathic Counseling | Sakshi
Sakshi News home page

వెన్నుపూసల మధ్య వాపు... తగ్గుతుందా?

Published Thu, Oct 5 2017 12:00 AM | Last Updated on Thu, Oct 5 2017 3:12 AM

health  : Homeopathic Counseling

హోమియో కౌన్సెలింగ్స్‌

నా వయసు 28 ఏళ్లు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ని. రెండేళ్ల నుంచి చాలాసేపు కూర్చున్న తర్వాత లేవలేక, నడవలేకపోతున్నాను. వెన్నుపూసలో పట్టివేసినట్లు ఉంటోంది. హెచ్‌ఎల్‌ఏ బి27 పాజిటివ్‌ వచ్చింది. నా సమస్యకు హోమియోలో చికిత్స ఉందా?
– అనిల్‌కుమార్, హైదరాబాద్‌

మీరు చెబుతున్న అంశాలను బట్టి చూస్తే మీరు యాంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది దీర్ఘకాలికంగా బాధించే సమస్య. ఇది ఒక ఆటోఇమ్యూన్‌ డిజార్డర్‌. అంటే తమ వ్యాధి నిరోధక శక్తే తమకు ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్య. ముఖ్యంగా కీళ్లు, వెన్నెముక భాగాలలో సమస్యను కలిగిస్తుంది. యుక్తవయస్కులు అంటే... సాధారణంగా 18–30 ఏళ్ల వారిలో కీళ్లు, మెడ బిగుసుకొని, నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి పురుషుల్లో చాలా సాధారణం. అంతేకాదు... మరీ ఎక్కువ తీవ్రతతో కూడా వస్తుంది. హెచ్‌ఎల్‌ఏ బి27 అనే ప్రోటీన్‌ గల జన్యువు ఉన్నవారిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ. యాంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌ సమస్య వెన్నుపూసల మధ్య వాపును కలగజేస్తుంది. ఈ వాపు వచ్చిన డిస్క్‌లు వెన్నెముకను పైకి పైకి జరుపుతాయి. ఫలితంగా ఇది పెల్విస్‌ భాగంలోని కీళ్లను ప్రభావితం చేస్తుంది.
కారణాలు : ∙వాతావరణ/పర్యావరణ సంబంధిత అంశాలు ∙బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్‌తో ∙వంశపారం పర్యం/జన్యుపరంగా వచ్చే అవకాశాలు ఉంటాయి.
లక్షణాలు : ∙కంటి సమస్యలు కనిపిస్తాయి. కళ్లు ఎర్రబారతాయి. ∙కీళ్లు, మెడ బిగుసుకు పోతాయి. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది ∙నడుము నొప్పి, శరీరంలో చాలా చోట్ల స్టిఫ్‌నెస్‌ వస్తుంది. ∙శరీరకంగా కదలికలు తగ్గుతాయి.
చికిత్స : యాంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌ను హోమియో మందులతో పూర్తిగా తగ్గించవచ్చు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన బయలాజికల్‌ మందులు వ్యాధి పెరగడాన్ని నిరోధిస్తాయి. హోమియోలో దీనికి కాల్కేరియా ఫాస్, ఫాస్ఫరస్, ఫాస్ఫారిక్‌ యాసిడ్, లైకోపోడియమ్, పల్సటిల్లా, నక్స్‌వామికా, ఆరమ్, సైలీషియా వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని హోమియో డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. ఈ సమస్య గురించి ఆందోళన అక్కరలేదు.
డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో)
స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌

సోరియాసిస్‌... వేధిస్తోంది!

నా వయసు 28 ఏళ్లు. రెండు మూడు సంవత్సరాలుగా చర్మంపైన మచ్చలుగా ఏర్పడి పొట్టు రాలిపోతున్నది. ఎన్ని మందులు వాడినా తాత్కాలికమైన ఉపశమనమే ఉంది. కీళ్లనొప్పులు కూడా వస్తున్నాయి. దీనికి హోమియోలో మందు ఉందా? – సుభాష్, నందిగామ
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీ వ్యాధి సోరియాసిస్‌గా తెలుస్తోంది. ఇందులో చర్మంపై మచ్చలు లేదా బొబ్బల్లా ఏర్పడి, కొద్ది రోజులకు పొలుసులుగా మారి ఊడిపోతుంది. సోరియాసిస్‌ సాధారణంగా 15–30 ఏళ్ల మధ్యవయస్కులకు ఎక్కువగా వస్తుంది. కానీ వంశపారంపర్యంగా ఏ వయసువారికైనా రావచ్చు.
కారణాలు : వంశపారంపర్యం లేదా అధిక ఒత్తిడి ముఖ్యంగా ఆటోఇమ్యూన్‌డిజార్డర్లు సోరియాసిస్‌కు ప్రధాన కారణాలు.
లక్షణాలు : ∙చేతులు, కాళ్లు, తల, ముఖం, చర్మంపై మచ్చలు లేదా బొబ్బలు వచ్చి చేప పొలుసులుగా చర్మం ఊడిపోతుంది.
∙కేవలం చర్మం మీద మాత్రమే గాక గోళ్లపై కూడా మచ్చలు రావడం, కీళ్లనొప్పులు ఉంటాయి.
∙తలపై చుండ్రులాగా పొలుసులతో పాటు జుట్టు కూడా రాలిపోతుంది.

ఈ వ్యాధితో బాధపడుతున్నవారు: తాము చూడటానికి కూడా బాగాలేకపోవడంతో మానసిక క్షోభకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది.
ఇటీవలి వ్యాధి ట్రెండ్‌ : ఆధునిక జీవన శైలి వల్ల ఇటీవల వంశపారంపర్యంగా వ్యాధి లేని వారిలోనూ ఇది కనిపిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. చాలా హడావుడి, ఆదుర్దా కలిగిన జీవనశైలి వల్ల ఇది చాలామందిలో కనిపిస్తోంది. కాబట్టి ఒత్తిడిని వీలైనంత దూరంగా ఉంచుతూ, మంచి పౌష్టికాహారం తీసుకుంటూ ఉండాలి. చర్మం మరీ పొడిబారిపోకుండా తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాలి.
చికిత్స:  ఈ సమస్యను హోమియో చికిత్స ద్వారా సమూలంగా తగ్గించవచ్చు. ముందుగా రోగి స్వభావం, తత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. రోగిలో వ్యాధి నిరోధక శక్తి పెంచేలా జెనెటిక్‌ కన్‌స్టిట్యూషన్‌ పద్ధతిలో చికిత్స చేయాలి. ఈ చికిత్స ద్వారా సోరియాసిస్‌ సమస్య పూర్తిగా నయమవుతుంది.
డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ
పాజిటివ్‌ హోమియోపతి, హైదరాబాద్‌

డయాబెటిస్‌ ఉండి బరువు తగ్గడం ప్రమాదమే..!
డయాబెటిక్‌ కౌన్సెలింగ్‌

నా స్నేహితుడి వయసు 38 ఏళ్లు. డయాబెటిస్‌ వ్యాధి ఉంది. అయిదారు నెలల కిందటి వరకు కాస్త స్థూలకాయం ఉండేది. రోజుకు 40 నిమిషాలు వ్యాయామం చేస్తుంటాడు. ఇంతకాలం తన బరువు అదుపులో ఉంది. ఇటీవల హఠాత్తుగా బరువు తగ్గడం ప్రారంభమైంది. చూస్తుండగానే బాగా బరువు తగ్గి, చాలా సన్నగా కనిపిస్తున్నాడు. అతడి పరిస్థితి చూస్తే ఆందోళన కలిగిస్తోంది. ఇలా డయాబెటిస్‌ వ్యాధితో ఉన్నవారు ఈ విధంగా బరువు తగ్గడంలో ఏదైనా ప్రమాదం ఉందా? – సి. ఆశీర్వాదం, సంగారెడ్డి
సాధారణంగా ఏమాత్రం ఊబకాయం ఉన్నా బరువు తగ్గడం ఆరోగ్యానికి మంచిదనే అనుకుంటాం. శారీరక వ్యాయామం, క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ, నెమ్మదిగా బరువు తగ్గడం ఆహ్వానించదగినదే. ఇలా బరువు తగ్గడం... కొలెస్ట్రాల్, బీపీని అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనికితోడు ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ను తగ్గించడమే కాకుండా కండరాలు, కణజాలం, రక్తంలోని కొవ్వులు ఇన్సులిక్‌కు స్పందించేలా చేస్తుంది కూడా. శరీర కణజాలం, కండరాలు గ్లూకోజ్‌ను ఉపయోగించుకుని శక్తి పొందడానికి ఇన్సులిన్‌ అవసరమవుతుంది. ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ వల్ల కండరాలు, కణజాలం గ్లూకోజ్‌ను వాడుకోవాలంటే మామూలు కంటే అధిక స్థాయిలో ఇన్సులిన్‌ అందుబాటులోకి రావాలి. టైప్‌–2 డయాబెటిస్‌లో ఈ పరిస్థితి ఉంటుంది. ఫలితంగా ఒక విషవలయం ఏర్పడుతుంది.

ఇన్సులిన్‌ లెవెల్‌ ఎక్కువ అవుతున్న కొద్దీ శరీరం బరువు తగ్గడం కష్టమవుతుంది. మరోవైపు శరీరం బరువు అధికమవు తున్నకొద్దీ ఇన్సులిన్‌ లెవెల్‌ పెరుగుతుంటుంది. ఈ చక్రవలయాన్ని ఛేదించడం కష్టం. డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులు ఉద్దేశపూర్వకంగా బరువు తగ్గించుకోవడం మంచి పరిమాణం.కానీ వారి ప్రయత్నం లేకుండా శరీరం బరువు తగ్గడం మాత్రం మంచి సూచన కాదు. రక్తంలో చక్కెర పరిమాణం ఎక్కువగా ఉన్నపక్షంలో వారు తరచూ మాత్ర విసర్జనకు వెళ్తుంటారు. ఇది డీ–హైడ్రేషన్‌కు దారితీస్తుంది. దాంతో శరీరం బరువు తగ్గిపోతుంది. డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులు చాలామంది మొదటిసారి డాక్టర్‌ను కలిసినప్పుడు చేసే ఫిర్యాదు తమ బరువు తగ్గిందనే. డయాబెటిస్‌తోపాటు థైరాయిడ్, క్యాన్సర్‌ వంటి వ్యాధుల వల్ల కూడా శరీరం బరువు తగ్గిపోతుంది. అందువల్ల వ్యాయామం, డైటింగ్‌ వంటి తమ ప్రయత్నాలు ఏమీ లేకుండా బరువు తగ్గడం ఒక ప్రమాద సూచిక.
ఈ పరిస్థితిలో... రక్తంలో చక్కెర పరిమాణంలో మార్పులకు మించి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయేమో అని కచ్చితంగా తేల్చుకోవడం అవసరం. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా మీ స్నేహితుడికి పూర్తిస్థాయి వైద్యపరీక్షలు చేయించండి.
డాక్టర్‌ రామన్‌ బొద్దుల, సీనియర్‌ ఎండోక్రైనాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement