లండన్ : దీర్ఘకాలం ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే మధ్యవయస్కుల నుంచీ వృద్ధులూ ఓ మాదిరి కఠిన వ్యాయామాలు చేయాల్సిందేనని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. రోజుకు పదివేల అడుగులు నడవడం కూడా సరిపోదని పెద్దలు దృఢంగా, బ్యాలెన్స్డ్‌గా ఉండాలంటే మరింత శ్రమించాల్సిందేనని పరిశోధకులు హెచ్చరించారు. పోల్ డ్యాన్స్, థైచీ, టెన్నిస్, క్రికెట్ వంటి ఆటలతో పాటు జిమ్‌లో బరువులు ఎత్తడం, భారీ బ్యాగ్‌లు మోయడం వంటి కఠిన వ్యాయామాలు చేపట్టాలని సూచించారు. పెద్దలు తమ శారీరక ఆరోగ్యానికి అవసరమైన స్ధాయిలో వ్యాయామం చేయడం లేదని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్(పీహెచ్‌ఈ) పేర్కొంది.
స్ర్తీ, పురుషులు వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామంతో పాటు రెండు సెషన్స్ స్ర్టెంథ్ ట్రైనింగ్ చేపట్టాలని ప్రభుత్వ మార్గదర్శకాలను పలువురు విస్మరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా వ్యాయామాలతో కండరాలు, ఎముకలు పటిష్టమై శరీరం మంచి సమతూకంతో ఉంటూ తరచూ పడిపోవడం, ఫ్రాక్చర్లు, వెన్ను నొప్పి, అకాల మరణం వంటి ముప్పులను నిరోధిస్తుందని పీహెచ్‌ఈ, ఛారిటీ ది సెంటర్ ఫర్ ఏజింగ్ బెటర్‌తో కలిసి నిర్వహించిన అథ్యయనంలో వెల్లడైంది.
వేగంగా నడవడం వంటి ఏరోబిక్ ఎక్సర్‌సైజ్‌లతో పాటు ప్రతి ఒక్కరూ వారానికి రెండు సార్లు బరువులు ఎత్తడం వంటి కఠిన వ్యాయామాలు చేయాలని పీహెచ్‌ఈకి చెందిన డాక్టర్ అలిసన్ టెడ్‌స్టోన్ సూచించారు. ముఖ్యంగా మహిళలు గర్భం దాల్చినప్పుడు, మొనోపాజ్ దశలో, పురుషులు పదవీవిరమణ అనంతరం ఈ తరహా వ్యాయామాలు చేయడం ద్వారా తదుపరి దశల్లో వారు చురుకుగా ఉంటారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment