తరచూ జలుబు.. తగ్గేదెలా..? | health tips for cold and heart | Sakshi
Sakshi News home page

తరచూ జలుబు.. తగ్గేదెలా..?

Published Thu, Sep 15 2016 11:24 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

తరచూ జలుబు.. తగ్గేదెలా..?

తరచూ జలుబు.. తగ్గేదెలా..?

నాకు తరచూ జలుబు చేస్తోంది. గత ఐదేళ్ల నుంచి ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. దాంతో చాలా బలహీనంగా మారుతున్నాను. రోజువారీ పనులు కూడా కుదరడం లేదు.  జలుబు టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. ఆ తర్వాత మళ్లీ మళ్లీ వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి.  - వెంకటేశ్వర్లు, రేణిగుంట

 మీరు చెప్పిన వివరాలను పరిశీలిస్తే మీకు ‘నేసల్ అలర్జీ’ ఉండవచ్చు అనిపిస్తోంది. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఈ సమస్య ఇబ్బంది ఉందన్నారు. కాబట్టి దీనికి మీరు సరైన చికిత్స తీసుకోలేదని అనిపిస్తోంది. ముక్కు, చెవి, గొంతు ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉంటాయి. దాంతో ఒక భాగంలో సమస్య వస్తే అది మిగతా రెండు చోట్లా సమస్యలకు దారితీయవచ్చు. యాంటీ అలర్జిక్ టాబ్లెట్ వాడటం శాశ్వత పరిష్కారం కాదు. దాన్ని ఎక్కువగా వాడటం వల్ల కొన్ని ఇతర సమస్యలు కూడా రావచ్చు. దీనికంటే ‘నేసల్ స్ప్రే’లు వాడటం కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. వాటితో సైడ్‌ఎఫెక్ట్స్ కూడా తక్కువ. మీరు ముందుగా నిపుణులైన ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించి వారి సూచనల ప్రకారం చికిత్స తీసుకోండి. మీకు అలర్జీ కలిగించే అంశాలను గుర్తించి వాటి నుంచి దూరంగా ఉండండి.

నాకు ఇటీవలే ‘ఓపెన్ హార్ట్ సర్జరీ’ అయ్యింది. అప్పట్నుంచి మాట సరిగా రావడం లేదు. మాట్లాడబోతుంటే గాలిలాగా వస్తోంది. తినేప్పుడు, తాగేప్పుడు, మిగడంలో ఇబ్బందిగా ఉంది. ఎప్పుడూ గొంతులో ఏదో అడ్డం పడ్డట్లుగా ఉంది. దగ్గు కూడా వస్తోంది. దీనికి తగిన పరిష్కారం చూపండి.  - పరంధాములు, నకిరేకల్లు

 మీకు స్వరపేటికలోని ‘వోకల్ ఫోల్డ్’లో సమస్య ఉన్నట్లుగా అనిపిస్తోంది. గుండెకు సంబంధించిన ఆపరేషన్లు (ముఖ్యంగా ఓపెన్‌హార్ట్ సర్జరీ), ట్రకియాస్టమీ, మెడ, ఊపిరితిత్తులకు సంబంధించిన ఆపరేషన్లలో కొన్నిసార్లు ‘వోకల్ ఫోల్డ్’పై ఒత్తిడి పడటానికీ లేదా అవి చెడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. దాంతో మింగడం, మాట్లాడటంలో సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు వోకల్‌ఫోల్డ్ పెరాలసిస్ వచ్చేందుకూ అవకాశం ఉంది. మీ సమస్యను నిర్ధారణ చేయడానికి ముందుగా మీరు నిపుణులైన ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించి ‘ల్యారింగోస్కోపీ లేదా ఎండోస్కోపీ’ వంటి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అంతేగాక స్పీచ్‌థెరపిస్ట్‌ను సంప్రదించి మింగడంలోని ఇబ్బందులు తొలిగిపోడానికీ, గొంతురావడానికి అవసరమైన ఎక్సర్‌సైజ్‌లను తెలుసుకుని వాటిని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది.

కడుపునొప్పికి కారణాలేంటి?
నా వయసు 36 ఏళ్లు. గత కొన్ని నెలలుగా నాకు తరచూ కడుపునొప్పి వస్తోంది. మల విసర్జన తర్వాత కడుపునొప్పి తగ్గుతోంది. మలబద్ధకం, విరేచనాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూ, నన్నే చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే మందులు ఇచ్చారు. అవి వాడినప్పుడు కాస్త మామూలుగా అనిపిస్తోంది. మానేయగానే మళ్లీ సమస్య మొదటికి వస్తోంది. నా సమస్యకు కారణమేంటి? సరైన పరిష్కారం చెప్పండి. - నరేంద్రకుమార్, శ్రీకాకుళం

 మీరు రాసిన లక్షణాలు బట్టి మీరు ఐబీఎస్ (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్)తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మానసికంగా ఆందోళన చెందుతుండే వారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. మీరు ఒకసారి కొలనోస్కోపీ పరీక్ష చేయించుకుంటే మంచిది. ఆ తర్వాత స్కానింగ్ పరీక్ష కూడా అవసరం కావచ్చు. పరీక్షలు అన్నీ నార్మల్ అని వస్తే మీకు ఐబీఎస్ అని నిర్ధారణ అవుతుంది. ఈ సమస్యకు మొదటి పరిష్కారం మీరు మానసికమైన ఒత్తిళ్లను, ఆందోళనలను తగ్గించుకోవాలి. ఆ తర్వాత కొంతకాలం యాంటీ స్పాస్మోడిక్, అనాల్జిక్ మందులు వాడితే మీ వ్యాధి లక్షణాలు తగ్గుతాయి. యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా మీ సమస్య తగ్గుతుంది.

నా వయసు 49 ఏళ్లు. పదేళ్ల క్రితం నాకు ఆపరేషన్ చేసి ఎడమవైపు రొమ్ము తొలగించారు. ఇంతకాలంగా నాకు ఎలాంటి సమస్యా లేదు. కానీ నెల రోజుల నుంచి కళ్లు పచ్చగా కనిపిస్తున్నాయి. ఆకలి కూడా తగ్గింది. నీరసంగా ఉంటోంది. అప్పుడప్పుడూ కడుపులో నొప్పి వస్తోంది. గతంలో రొమ్ముకు వచ్చిన వ్యాధి ఇప్పుడు కడుపులోకి పాకిందంటారా? నాకు తగిన సలహా ఇవ్వండి. - శ్రీలత, కొత్తపేట

 మీరు తెలిపిన విషయాలను బట్టి చూస్తే క్యాన్సర్ కారణంగా మీకు రొమ్ము తొలగించారని అర్థమవుతోంది. ప్రస్తుతం మీరు కామెర్లతో బాధపడుతున్నారు. గతంలో ఉన్న రొమ్ముక్యాన్సర్ ప్రభావం కాలేయంపైన కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్, కాలేయానికి సంబంధించిన రక్తపరీక్షలు చేయించుకోండి. ఈ పరీక్షల్లో మీ సమస్య బయటపడుతుంది. ఒకవేళ క్యాన్సర్ వల్ల మీ లివర్ ప్రభావితమైతే, దీన్ని వీలైనంత త్వరగా గుర్తించి, వెంటనే చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత త్వరగా దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించి, అవసరమైన చికిత్స తీసుకోండి.

ఎందుకీ వాల్వ్స్ సమస్య..?
నా వయస్సు 57 ఏళ్లు. ఒకసారి మాకు దగ్గర్ల ఉన్న కార్డియాలజిస్ట్‌ను సంప్రదించాను. హార్ట్ వాల్వ్స్‌లో (గుండె కవాటాల్లో) సమస్య ఉందని అన్నారు. ఈ సమస్యకు గల కారణాలను తెలపండి. వాల్వ్ మార్చాల్సిందేనా? - శ్రీనివాసరావు, అంకాపూర్

 గుండె కవాటాల్లో ప్రధానంగా రెండు రకాల సమస్యలు రావచ్చు. అవి...

 1. వాల్వ్స్ సన్నబడటం (స్టెనోసిస్)

 2. వాల్వ్ లీక్ కావడం (రీగర్జిటేషన్)

 వీటికి గల కారణాలు :
 కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల
కొందరిలో రుమాటిక్ హార్ట్ డిసీజెస్ వల్ల
మరికొందరిలో ఈ సమస్య పుట్టుకతోనే రావచ్చు
కొందరిలో వయసు పెరగడం వల్ల (డీజరేటివ్) వచ్చే సమస్యగా రావచ్చు

వాల్వ్స్ సమస్యలకు చికిత్స :
ఈ సమస్యలను కొంతవరకు మందులతో చికిత్స చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో మందులతో చికిత్స సాధ్యం కాకపోతే రోగి పరిస్థితిని బట్టి సర్జరీ అవసరమవుతుంది. ప్రస్తుతం గుండె కవాటాలకు వచ్చే సమస్యలకు సర్జరీ కంటే వాల్వ్‌ను రిపేర్ చేయడానికి అప్పుడు వైద్యులు అత్యంత ప్రాధాన్యం వస్తున్నారు. పైగా ఉన్న వాల్వ్‌నే రిపేర్ చేసిన సందర్భాల్లో జీవితాంతం వాడాల్సిన ఎసిట్రోమ్ (రక్తాన్ని పలచబార్చే మందు) ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రత్యేకంగా మైట్రల్, ట్రైకస్పిడ్ వాల్వ్‌లు అయితే రిపేర్ చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement