చిలగడదుంపను వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తుంటారు. కొన్నిచోట్ల మోరం గడ్డ అని, మరికొన్ని చోట్ల గెణుసు గెడ్డ అని అంటుంటారు. పేరు మారినా రుచి, పోషకాలు మాత్రం మారవు కదా. అనారోగ్యాలను గడగడలాడించే చిలగడతో సమకూరే ప్రయోజనాల్లో ఇవి కొన్ని.
చిలగడదుంపలో పీచు (ఫైబర్) పాళ్లు చాలా ఎక్కువ. అందువల్ల ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుతుంది. ఇందులోని కొన్ని ప్రత్యేక పోషకాలు డియోడినల్ అల్సర్లు, గ్యాస్ట్రిక్ అల్సర్లను నివారిస్తాయి. నొప్పినివారణ మందుల వల్ల కడుపులో వచ్చే నొప్పి, మంట వంటి (ఇన్‌ఫ్లమేటరీ) ప్రభావాలనూ చిలగడదుంప నివారిస్తుందని తాజా అధ్యయనాల్లో తేలింది.
చిలగడదుంపలో విటమిన్–బి6 పాళ్లు ఎక్కువ. విటమిన్–బి6 హోమోసిస్టిన్ అనే రసాయనం దుష్ప్రభావాన్ని తగ్గిస్తుంది. గుండెజబ్బులు వచ్చేందుకు హోమోసిస్టిన్ అన్నది ఒక ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్. ఫలితంగా చిలగడదుంప వల్ల అనేక గుండెజబ్బులు నివారితమవుతాయని పరిశోధనల్లో తేలింది.చిలగడదుంపలో విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అది శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థను మరింత పటిష్టం చేసి, అనేక వ్యాధులను నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది.
చర్మంలోని కణాలను గట్టిగా దగ్గరగా పట్టి ఉంచే కొలాజెన్ ఉత్పత్తికి విటమిన్–సి బాగా దోహదపడుతుంది. అందుకే విటమిన్–సి పోషకాలను పుష్కలంగా తీసుకునేవారి చర్మం చాలా కాలం యౌవనంగా ఉంటుంది. చిలగడదుంపలోనూ విటమిన్–సి పాళ్లు చాలా ఎక్కువ. అందుకే తరచు చిలగడ దుంప తినేవారి చర్మం అంత త్వరగా ఏజింగ్ దుష్ప్రభావాలకు గురికాదు. చిలగడదుంపలో పొటాషియమ్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నివారిస్తుంది. అందుకే హైబీపీ ఉన్నవారికి చిలగడదుంప ఎంతో మంచిది.
Comments
Please login to add a commentAdd a comment