
న్యూయార్క్ : పెళ్లంటే నూరేళ్ళ మంట అని కొందరు సమర్ధించడం, మనం వినే ఉంటాం. అయితే ఇది ముమ్మాటికీ తప్పేనని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. పెళ్లి అయిన వారి కంటే పెళ్లి కాని వారికే గుండె సంబంధిత వ్యాధుల్లో మరణించే ప్రమాదం ఎక్కువగా ఉందని కొత్త అధ్యయనం వెల్లడించింది. గుండె సంబంధిత వ్యాధులతో మరణించడం, వైవాహిక స్థితికి ఉన్న సంబంధాన్ని తెలుపుతూ పరిశోధకులు మొదటిసారి అధ్యయనం చేపట్టారు. ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. గుండె సంబంధిత పేషెంట్లపై వివాహ ప్రభావం చూసి తాను చాలా ఆశ్చర్యానికి గురయ్యాయని అమెరికాలోని అట్లాంటాలో ఉన్న ఎమోరి యూనివర్సిటీలో పనిచేసే మెడిసిన్ ప్రొఫెసర్, లీడ్ రీసెర్చర్ అర్షద్ క్వియుమి చెప్పారు. వివాహంతో కేవలం సోషల్ సపోర్టు మాత్రమే కాక, ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నారు. గుండె సంబంధిత వ్యాధుల వారికి వివాహం చాలా ముఖ్యమని చెప్పారు.
కాగా, పరిశోధకులు అంతకముందు జరిపిన అధ్యయనాల్లో విడాకులు తీసుకున్న వారు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిసింది. అదేవిధంగా గుండె సంబంధిత వ్యాధిగ్రస్తుల్లో పెళ్లి కాని వారే ఎక్కువగా మరణం బారిన పడుతున్నారని కూడా తాజా అధ్యయనం పేర్కొంది. కరొనరీ అర్టరీ వ్యాధికి కార్డియాక్ కాథెటరైజేషన్ చికిత్స తీసుకుంటున్న 6,051 మంది పేషెంట్లపై జరిపిన అధ్యయనంలో విడాకులు తీసుకున్న, అవివాహిత, వితంతువుల ఫలితాలు చాలా ప్రతికూల ఫలితాలు వచ్చాయని పరిశోధకులు తెలిపారు.
వివాహం చేసుకున్న పేషెంట్లకు, అవివాహిత షేషెంట్లకు మధ్య జరిపిన ఈ అధ్యయనంలో, ఏ వ్యాధి కారణం చేతనైనా మరణించే వారిలో 24 శాతం మంది అవివాహిత పేషెంట్లు ఉంటారని, అదేవిధంగా హృదయ సంబంధ వ్యాధి నుంచి అయితే 45 శాతం మరణించే ప్రమాదం ఎక్కువగా ఉందని వెల్లడించారు. పెళ్లి కాని వారికే 40 శాతం ఎక్కువగా హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. పేషెంట్లపై నాలుగేళ్లుగా జరిపిన అధ్యయనం అనంతరమే పరిశోధకులు ఈ ఫలితాలను వెలువరించారు. జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.
Comments
Please login to add a commentAdd a comment