హృదయరాగం
ఈ ప్రపంచమే ఒక రంగస్థలం అయినప్పుడు, నాట్యానికి ప్రత్యేకంగా రంగస్థలం ఎందుకు? అనుకున్నాడేమో న్యూయార్క్‌కు చెందిన డేన్ షిటగి. వివిధ దేశాల్లో, వివిధ భౌగోళిక సౌందర్యాల నేపథ్యంలో బ్యాలే డ్యాన్సర్‌ల నృత్య విన్యాసాలను తన కెమెరాలోకి అందంగా తీసుకువచ్చాడు. ఈ పని ఆయన పన్నెండు సంవత్సరాలుగా చాలా ఆసక్తితో చేస్తున్నాడు. రంగస్థలం మీద కనిపించని నృత్యాలకు కొత్త వెలుగు ఇస్తున్నాడు. ‘‘నృత్యం అంటేనే అందం...ఆ అందానికి మరింత అందాన్ని జోడించడానికి బాహ్యప్రపంచ అందాలను
వాడుకుంటున్నాను’’ అంటున్నాడు డేన్ షిటగి.
తీసిన ఒక్కో ఫొటో.... డ్యాన్స్, ఫ్యాషన్ డిజైన్, ఫొటోగ్రఫీల సమ్మేళనం అని గర్వంగా చెబుతాడు. తన ఫోటోల్లో నృత్యకారుల భావోద్వేగాలు కనిపిస్తాయనీ, హృదయరాగాలు వినిపిస్తాయనీ అంటాడు ప్రేమగా. ప్రసిద్ధ నర్తకులతో పాటు, ఒకప్పటి నర్తకులు, ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న నర్తకుల సహకారాన్ని కూడా తీసుకుంటున్నాడు షిటగి. విశేషం ఏమిటంటే, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ కాలంలో కూడా షిటగి... పాతకాలపు ఫిల్మ్, కెమెరాలను వినియోగించడం!