భువిపై స్వర్గం... అరవిందుని ఆశయం
‘‘మానవులమైన మనకు, భగవంతునికి ఒక అనుబంధం ఉంది. దైవం- మనిషి పరస్పర రుణగ్రస్థులు. ఆయన స్వభావాన్ని మనం, మన స్వభావాన్ని ఆయనా స్వీకరించి, ధరించాలి. ఈశ్వర సంతానమైనా ఈశ్వరునిలా మనగలగాలి. మానవ స్వభావం దివ్యత్వంగా పరిణమించాలి. పరస్పర విరుద్ధంగా తోచే మానవ జీవితానికి ఈశ్వరుడే మూలసూత్రం. కాబట్టి ఈ భౌతిక ప్రపంచం భగవంతునికి విరుద్ధమైనది కాదు. ఈ భూమిపై భగవంతుడు శాశ్వతంగా భాసిస్తుండాలి. అందుకే నా తపస్సు’’ అని ప్రవచించారు అరవిందులు.
భగవంతుని ప్రసక్తి లేని ప్రపంచం, జీవితం అసంపూర్ణం. మానవజాతి భవిష్యత్తు ఆధ్యాత్మిక ధర్మం మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ ధర్మం మామూలుగా భావించే విశ్వమతం కంటే భిన్నమైనది. బుద్ధిజనిత సిద్ధాంతాల మీద, బాహ్యక్రతువుల మీద ఆధారపడే మతం కాదు. మానసికమైన సిద్ధాంతం, దానికి సచేతన స్వరూపం మనిషికి అవసరం.
గుప్తమైన దివ్యత్వం ఉన్నదనే విశ్వాసం క్రమవికాసం పొందడమే మానవ ధర్మ స్వభావం. ఆ దివ్యత్వ ప్రకటనకు మానవజాతే ఉత్తమ సాధనం. మానవునిలోనే ఆ దివ్యత్వపు అభివ్యక్తి క్రమవికాసం పొందగలదు. ఈ అభిజ్ఞకు అనుగుణంగా జీవితం సాగించి, ఈ భూమి మీద దివ్యత్వపు సామ్రాజ్యాన్ని ప్రతిష్ఠించాలి. ఈ భావన మనలో రేకులు విప్పుకుంటే మానవులందరూ సమానులనే దృష్టి జీవితాన్ని నడిపించే ముఖ్యసూత్రం అవుతుంది.
సహకార సూత్రం కంటే గాఢమైన ఈ భావన ద్వారా సమష్టి జీవనం, సోదరభావం, సమానత్వం మనకు అలవడతాయి. సాటి మానవుల శ్రేయస్సు మూలంగానే వ్యక్తిజీవితం స్వతంత్రంగా సంపూర్ణంగా కొనసాగినప్పుడే తన పరిపూర్ణత్వం, శాశ్వత సుఖం వాటి మీద ఆధారపడి వర్థిల్లగలవని జాతి గుర్తించాలి. ఈ ధర్మాన్ని అనుసరించి క్రమశిక్షణ, ముక్తిమార్గాలను ప్రతివ్యక్తీ సాధించుకోవాలి. ఆ విధమైన లక్షణాలు జాతి అంతటిలోనూ వృద్ధి పొందాలి. ఇతర భావాల మాదిరిగా ఇది కూడా ఒక ఆశయంగా మిగిలి పోకూడదు. ఇది మన అంతర్గత ధర్మం అయితే మనం చేసే ప్రయత్నాల న్నింటికీ అది గమ్యం కావాలి. ప్రాతిపదికమైన, అంతర్గతమైన, సంపూర్ణమైన యథార్థమైన సమైక్యతను సాధించడానికి ఉపకరణం కావాలి. మానవ జీవన సమైక్యతకు అది పదిలమైన పునాది కావాలి. మానసిక సమైక్యతను సాధించగల ఆధ్యాత్మిక సమైక్యత మనకు అవసరం.
ఇది బుద్ధిగతమైన బాహ్యమైన ఏకీభావంతో ముడిపడి ఉండదు. యాంత్రిక విధానాల ద్వారా తెచ్చుకునే ఏకత్వం కాదు. అంతరంగ జీవితంలో స్వేచ్ఛతో కూడిన మార్పులను... వాటిని ప్రకటించుకునే పద్ధతులతో స్వాతంత్య్రాన్ని సమకూర్చగల భద్రమైన సమైక్యతను సాధించుకోవాలి. ఈ సమైక్యతే పునాదిగా ఉత్తమ జీవన విధానం విలసిల్లాలి. ఈ సత్యాన్ని మానవులంతా తొందరగా గ్రహించగలిగితే సమైక్యత సమస్యను పరిష్కరించగలుగుతాం. అంతర్గత సత్యంతో మొదలుపెట్టి బాహ్య స్వరూపాలకు విస్తరించే గంభీరమైన, యథార్థమైన సమైక్యత సాధించగలుగుతాం.
ఈ లోపుగా సమైక్యతను సాధించే యాంత్రిక పద్ధతులు కొనసాగించవలసిందే. కాని, మానవ భవితవ్యం ఆశాజనకం కావాలంటే ఈ తత్వాన్ని అవగాహన చేసుకునే వ్యక్తుల సంఖ్య పెరగాలి. యాంత్రికమైన పరిష్కారాలు తాత్కాలికమైనవనీ, ఆశాభంగం కలిగిస్తాయనీ గ్రహించిన ఆధ్యాత్మికవేత్తల సంఖ్య అధికం కావాలి. అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి ఆవిర్భవించి, అత్యుత్తమ సంపూర్ణ సుఖం దిక్కుగా మానవజాతిని నడిపించాలి. అప్పుడే ప్రకృతి సమున్నత శృంగాల పైన ఆత్మభూమిలో అతీత మానవుడు జీవిత సామ్రాజ్యానికి సార్వభౌముడై పరిపాలించి, భువిని- దివికి సమానంగా మలచగలడు... అన్నారు అరవిందులు. ఈ ప్రపంచంలోని సమస్త వస్తుజాలం ఈశ్వరుని వల్లే మనకు లభిస్తోంది. తిరిగి అంతా ఈశ్వరునికే నివేదింపబడాలన్నది ఆత్మశక్తి సంపన్నులైన అరవిందుల అభిమతం. దేవతలాంటి పూర్ణమానవుడు ఆయన స్వప్నం. దివ్యజీవన ఆవిర్భావం ఆయన యోగ పరమావధి. భువిపై స్వర్గం అరవిందుని ఆశయం.
- చోడిశెట్టి శ్రీనివాసరావు