ఈ బొమ్మలో.. హీరోయిన్‌ని కనుక్కోండి | heroine devayani special chit chat | Sakshi
Sakshi News home page

ఈ బొమ్మలో.. హీరోయిన్‌ని కనుక్కోండి

Published Sun, Jul 12 2015 10:35 PM | Last Updated on Wed, Jul 25 2018 2:35 PM

ఈ బొమ్మలో.. హీరోయిన్‌ని కనుక్కోండి - Sakshi

ఈ బొమ్మలో.. హీరోయిన్‌ని కనుక్కోండి

చుట్టూ స్పాట్ లైట్లు.
క్రేన్ మీద కదులుతున్న కెమెరా. కంప్లీట్ సెలైన్స్.
డెరైక్టర్ గారి అరుపు...
‘‘ఆల్ లైట్స్ ఆన్. రోల్ కెమెరా. యాక్షన్’’
మహేశ్‌బాబు ముద్దలు కలిపి దేవయానికి తినిపిస్తున్నాడు.
సంతోషంతో తల్లి దేవయానికి ఆనందబాష్పాలు!
కట్ చేస్తే...
రియల్ లైఫ్‌లో స్కూలు లంచ్ రూమ్‌లో
టీచర్ దేవయానితో పాటు
పిల్లలు భోజనం చేస్తున్నారు.
అంత స్పాట్ లైట్ చూసిన దేవయాని
ఇంత సింపుల్ లైఫ్ లో అంత హ్యాపీగాఎలా ఉంటున్నారు?!
చాలా సింపుల్.
షి ఈజ్ వెరీ సింపుల్ పర్సన్.  

 
 
హాయ్ దేవయానిగారు.. పాఠాలు చెబుతున్నారట?
 నిజమేనండి. స్కూల్ టీచర్‌గా చేస్తున్నా. టీచింగ్ అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేశా.
     
టీచర్ కావాలని హీరోయిన్ అయ్యి, మనసులో కోరిక తీర్చుకోవడానికి ఇప్పుడు టీచర్ అయ్యారా?

 టీచర్ కావాలని ఎప్పుడూ అనుకోలేదు. హీరోయిన్ అవ్వాలనుకుని ప్లాన్ చేసుకోలేదు. అనుకోకుండా అవకాశం వచ్చింది.. ఓసారి ట్రై చేద్దామని సినిమాల్లోకి వచ్చా.

మీ ముద్దుల కూతుళ్లు చదువుకునే స్కూల్లోనే టీచర్‌గా చేస్తున్నారట..?
మా అమ్మాయిలు ఇనియా, ప్రియాంక చదువుతున్న స్కూల్లోనే టీచర్‌గా చేస్తున్నా. వాళ్ల కోసం అని కాదు కానీ, స్కూల్ మేనేజ్‌మెంట్ అడిగితే చేస్తున్నా.

మొదట్లో క్లాస్‌రూమ్‌లో పిల్లలందరూ మిమ్మల్నో సినిమా స్టార్‌ని చూస్తున్నట్లు ఆసక్తిగా చూసేవారా?
 మా పిల్లలను స్కూల్లో దించడం, మళ్లీ ఇంటికి తీసుకురావడం కోసం నేను రోజూ స్కూల్‌కి వెళ్లేదాన్ని. అప్పుడు టీచర్స్, పేరంట్స్ అందరితోనూ ఫ్రెండ్లీగా ఉండేదాన్ని. అందుకని నన్నో స్టార్‌లా కాకుండా మామూలు టీచర్‌లా చూస్తారు. టీచర్స్, పేరంట్స్ అందరూ నన్ను ‘సో స్వీట్.. బాధ్యత గల టీచర్’ అంటారు (నవ్వుతూ).
   
ఇక, కెరీర్ విషయానికొస్తే... మీరు తెలుగు తెరపై కనిపించి పుష్కర కాలమైంది...

 అవునండి. రోజులు చాలా త్వరగా గడిచిపోతున్నాయి. నిన్న, మొన్నే తెలుగు సినిమాల్లో నటించినట్లుగా ఉంది. అప్పుడే పన్నెండేళ్లయిపోయాయా!
     
మీ మాతృభాష మలయాళం కదా?

 మా నాన్నగారు కొంకణి.. అమ్మ మలయాళీ. నేను పుట్టి, పెరిగిందంతా ముంబయ్‌లో. అందుకని హిందీ బాగా వచ్చు. కొంకణి, మలయాళం కూడా మాట్లాడతాను. తమిళంలో ఎక్కువ సినిమాలు చేశాను కాబట్టి, ఆ భాష బాగా వచ్చు.
     
ఉత్తరాదిన పెరిగి, నటిగా దక్షిణాదిన స్థిరపడ్డారన్న మాట.. ఇంతకీ హిందీ చిత్రాలేవీ చేయలేదా?

 నా కెరీర్ మొదలైంది హిందీ సినిమాతోనే. అది ఆగిపోయింది. బెంగాలీ చిత్రాల్లో నటించాను. ఆ తర్వాత నా ఫొటోలు చూసి, దర్శకుడు ప్రియదర్శన్‌గారు పిలిపించి, ‘కిన్నరిపుళయోరమ్’ అనే మలయాళ చిత్రానికి అవకాశం ఇచ్చారు. అక్కణ్ణుంచి తెలుగు, తమిళ్ చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. కన్నడంలో కూడా ఓ చిత్రంలో నటించాను.
     
‘ప్రేమలేఖ’, ‘సుస్వాగతం’, ‘చెన్నకేశవరెడ్డి’, ‘నాని’ చిత్రాలు మీకు తెలుగులో మంచి పేరు తెచ్చాయి. ఆ తర్వాత ఇక్కడ సినిమాలు చేయకపోవడానికి కారణం?
 తమిళ్‌లో బాగా బిజీగా ఉండటం వల్ల తెలుగు చిత్రాలపై దృష్టి పెట్టలేదు. పైగా, ‘ప్రేమలేఖ’ చిత్రం తమిళంలో నేను చేసిన ‘కాదల్ కోట్టయ్’కి అనువాదం. ‘సుస్వాగతం’ కూడా ఓ తమిళ సినిమాకి రీమేక్. ‘నాని’ దర్శకుడు సూర్య తమిళ పరిశ్రమకు చెందిన వ్యక్తే. అలాగే, ఇక్కడ నేను చేసిన ‘మాణిక్యం’ తమిళ ‘పొర్కాలమ్’కి రీమేక్. ఒక్క ‘చెన్నకేశవరెడ్డి’ మినహా తెలుగులో నేను చేసిన మిగతా చిత్రాలు తమిళ పరిశ్రమతో టచ్ ఉన్నవే.

హీరోయిన్‌గా చేస్తున్నప్పుడే ‘నాని’లో మహేశ్‌బాబుకి అమ్మ పాత్రకు అడిగినప్పుడు ఎలా ఫీలయ్యారు?
 ‘ఈ పాత్రకు మీరు తప్ప వేరే ఎవరూ బాగుండరు’ అని ఎస్.జె. సూర్య పట్టుబట్టారు. పైగా, ఇందులో నేను యంగ్ మమ్మీని. పాత్ర బాగుంటుంది. అందుకని చేశా. ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తూ, ముందు వేరే నటిని తీసుకున్నారు. కానీ, తమిళంలో కూడా మీరు చేస్తేనే బాగుంటుందని అక్కడా నాతోనే చేయించారు.

ఓకే... దర్శకుడు రాజ్‌కుమార్‌తో మీ లవ్‌స్టోరీ గురించి?
 నేను హీరోయిన్‌గా నటించిన ‘సూర్యవంశమ్’ (తమిళ్)కి రాజ్‌కుమార్ అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేశారు. ఆ తర్వాత ఆయన డెరైక్షన్‌లోనే రెండు సినిమాల్లో నటించాను. ముందు ఫ్రెండ్‌షిప్, తర్వాత లవ్. చివరికి పెళ్లి చేసుకున్నాం.
 
పెద్దల్ని కాదని మరీ పెళ్లి చేసుకున్నారు కదా... మీవారి గురించి నాలుగు మాటలు?
 మా పధ్నాలుగేళ్ల వైవాహిక జీవితంలో ఇతన్ని పెళ్లి చేసుకుని మనం తప్పు చేశాం అనుకున్న క్షణం ఒక్కటి కూడా లేదు. తల్లీదండ్రి, స్నేహితుడు.. అన్నీ ఆయనే. చాలా పాజిటివ్ పర్సన్. ఏ విషయాన్నీ నెగటివ్‌గా చూడటం, మాట్లాడటం తెలియని వ్యక్తి. ముఖ్యంగా ‘నీకోసం నేను ఉన్నాను’ అనే భరోసా కలిగించారు

మీరు అత్త, మామలతో కలిసి ఉంటారా?
 మావారిది తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ‘అందియూర్’ గ్రామం. మా అత్త, మామలు అక్కడే ఉంటారు. వాళ్లు నగర జీవితాన్ని ఇష్టపడరు. అప్పుడప్పుడు చెన్నయ్ వచ్చి, వెళుతుంటారు. మా మధ్య ఎలాంటి పొరపొచ్ఛాలు లేవు. అందరం హ్యాపీగా ఉన్నాం.
 
సీరియల్స్‌లో కూడా నటించారు. ముఖ్యంగా ‘కోలంగళ్’ (తెలుగులో ‘ముత్యాల ముగ్గు’)లో నటిస్తున్నప్పుడే ఇద్దరు బిడ్డలకు తల్లి కూడా అయ్యారు కదా?


 ఆ సీరియల్ ఏడేళ్లు సాగింది. పదిహేను వందల ఎపిసోడ్స్ పైగా సాగిన సీరియల్. అదో రికార్డ్. ఆ సీరియల్ చేస్తున్నప్పుడు మా ఇద్దరమ్మాయిలకు నేను జన్మనిచ్చాను. అప్పుడు కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అందుకు తగ్గట్టుగా సీన్స్ ప్లాన్ చేసి, చిత్రీకరించేవారు. దాంతో ఇబ్బంది లేకుండాపోయింది.

సినిమాలు చేయాలనుకోవడంలేదా?
సినిమాలు మానను. నటనంటే నాకిష్టం. మావారికి కూడా నేను సినిమాల్లో కొనసాగడం ఇష్టమే.
     
ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది?

 తెలుగులో నేను చేసింది రెండు, మూడు సినిమాలే అయినా మంచి గుర్తింపు వచ్చింది. బాలకృష్ణగారి ‘చెన్నవకేశరెడ్డి’లో సోదరుడి కోసం భర్తను చంపే అమ్మాయి పాత్ర చేశాను. ఆ సినిమా తర్వాత బాలకృష్ణగారి అభిమానులు ‘మీక్కూడా ఫ్యాన్స్ అయ్యాం’ అన్నారు. అలా గుర్తుండిపోయే పాత్రలు వస్తే చేయాలనుకుంటున్నా.
     
మరి.. మీ ఇద్దరు కూతుళ్ల ఆలనా పాలనా..?

 వాస్తవానికి నేను అవుట్ డోర్ షూటింగ్‌కి వెళితే వాళ్లు బెంగ పెట్టుకుంటారు. అది నాకు బాధగానే ఉంటుంది. అంత బాధపడుతూ ఏ పాత్ర పడితే అది చేయడంకన్నా ఇష్టమైనది చేయడం బెటర్ అనుకుంటున్నా. అదే మంచి పాత్ర చేశాననుకోండి.. నటిగా సంతృప్తి లభిస్తుంది కాబట్టి, ఆ బాధ ఉండదు. అందుకే ఎగ్జయిటింగ్‌కి గురి చేసే క్యారెక్టర్స్ వస్తేనే చేయాలనుకుంటున్నా.
 - డి.జి. భవాని
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement