
అసలే ఆడపిల్ల... ఆమెకు తోడు మరో ఇద్దరు చెల్లెళ్లు.. బాల్యం సాఫీగా సాగుతున్న సమయంలో కరెంట్ షాక్ వారి కన్నతల్లిని బలి తీసుకుంది. తల్లిలేని ఆ పిల్లలను అమ్మమ్మ చేరదీసి చదువు చెప్పింది. ఖర్చులు పెరగడంతో చేసేది లేక తన మనవరాళ్లను అనాథాశ్రమంలో చేర్చింది. ఆ పిల్లల్లో పెద్ద అమ్మాయి అక్కడే ఉన్నత చదువులను పూర్తి చేసింది. చిన్ననాటి కల అయిన సివిల్స్‌ను సాకారం చేసుకోవడం కోసం మనసున్న మారాజులెవరైనా సాయం చేయకపోతారా అని గంపెడంత ఆశతో ఎదురు చూస్తోంది.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం కమటంగూడెం గ్రామానికి చెందిన కమటం భాగ్య, అశోక్ దంపతులకు రజిత, దీపిక మౌనికలున్నారు. కరెంటు షాక్‌తో తల్లి భాగ్య చనిపోవడంతో వారికి అండగా ఉండాల్సిన తండ్రి వేరే పెళ్లి చేసుకుని తన దారి తాను చూసుకున్నారు. ముగ్గురు పిల్లలను అమ్మమ్మ జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామానికి తీసుకువచ్చింది. ఏడోతరగతి వరకు తమ్మడపల్లిలో చదువుకున్న రజిత ఆ తరువాత బచ్చన్నపేట మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో చదువుకున్నారు. 2006లో పదో తరగతిలో 90 శాతం మార్కులు సాధించారు. 2008లో ఇంటర్ జనగామ జిల్లా కేంద్రంలోని ఎస్‌వీ జూనియర్ కాలేజిలో పూర్తి చేశారు.
అనాథ ఆశ్రమంలో ఉంటూనే ఉన్నత చదువులు..
అమ్మమ్మ ఇంటి వద్దనుంచే అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఇంటర్ వరకు చదివిన రజిత 2008లో జఫర్‌గడ్ మండలం రేగడితండాలో ఉన్న మా ఇల్లు ప్రజాదరణ అనాథ ఆశ్రమంలో చేరారు. ఆశ్రమంలో ఉంటూనే ఉన్నత చదువులను అభ్యసించారు. అనాథ ఆశ్రమం నుంచి హన్మకొండకు రోజు వెళ్లి వస్తూ డిగ్రీ, డబుల్ పీజీ పూర్తి చేశారు. హన్మకొండలోని చైతన్య డిగ్రీ కాలేజిలో బీఎస్సీలో గోల్డ్ మోడల్ సాధించారు. పీజీ ఎంట్రెస్‌లో టాప్ 10లో ర్యాంకు సాధించి వరంగల్ నిట్‌లో సీటు సాధించారు. ఎంఎస్సీ మ్యాథమెటిక్స్‌తో పీజీని పూర్తి చేశారు. తరువాత కాకతీయ యూనివర్శిటీలో ఎంఎస్‌డబ్ల్యూ రెండో పీజీని పూర్తి చేశారు.
చేయూత కోసం ఎదురుచూపులు..
అనాథాశ్రమంలో ఉండి చదువుకున్న రజితకు వసతి కల్పించడమే కష్టతరం. అలాంటిది ఏకంగా సివిల్స్ కోచింగ్‌కు లక్షల్లో ఫీజులు ఉండడంతో చెల్లించలేని దుస్థితి. మా ఇల్లు ఆశ్రమ నిర్వహకులు గాదె ఇన్నారెడ్డి దాతల సహకారంతో కొంత మొత్తాన్ని సర్దుబాటు చేసినప్పటికీ ఆ మొత్తం కోచింగ్ ఫీజులకు ఏమాత్రం సరిపోవడం లేదు. దాతలు ఎవరైనా ముందుకు వస్తే వారికి రుణపడి ఉంటానని రజిత వేడుకుంటున్నారు.
రజితకు సాయం చేయదలిస్తే
9866216680 సెల్ నంబర్‌లో సంప్రదించవచ్చు. తలో చేయి వేసి అనాథకు చేయూతనిద్దాం.
– ఇల్లందుల వెంకటేశ్వర్లు,సాక్షి, జనగామ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment