B.Sc
-
‘ఉద్యాన’ ప్రవేశాలకు రెండో దశ వెబ్ ఆప్షన్స్
తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ, గుర్తింపు పొందిన కళాశాలల్లో బీఎస్సీ (హానర్సు) హార్టీకల్చర్ కోర్సుకు సంబంధించి మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల 12, 13, 14 తేదీల్లో రెండోదశ వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చని వర్సిటీ రిజిస్ట్రార్ బి.శ్రీనివాసులు బుధవారం తెలిపారు. మొదటి కౌన్సెలింగ్ ద్వారా కాలేజీల్లో చేరిన విద్యార్థులు, ఈ కోర్సు కోసం దరఖాస్తు ద్వారా రిజి్రస్టేషన్ చేసుకున్న మిగిలిన విద్యార్థులు అందరూ వెబ్ ఆప్షన్స్‌కు అర్హులు అని పేర్కొన్నారు. హార్టీసెట్–2023 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 21న డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని కోరారు. ప్రభుత్వ కళాశాలల్లో ఫీజుల వివరాలు సెమిస్టర్ ఫీజు జనరల్ సీటు రూ.51,083 పేమెంట్ సీటు రూ.1,38,488 ఫీజులు, ఇతర వివరాల కోసం... ప్రభుత్వ ఉద్యాన కళాశాల వెంకట్రామన్నగూడెం, 7382633648 అనంతరాజుపేట –7382633651 పార్వతీపురం–7382633660 చినలాటరపి–7382633443 నంబర్లలో సంప్రదించవచ్చు. వర్సిటీ గుర్తింపు కళాశాలల్లో ఫీజులు ఎన్ కాలేజ్ ఆఫ్ హార్టీ సైన్సెస్, మార్కాపురం రూ.44,000 శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ సైన్సెస్, అనంతపురం రూ.77,000 జేసీ దివాకరరెడ్డి హార్టికల్చర్ కాలేజ్, తాడిపత్రి రూ.65,000 కేబీఆర్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ సీఎస్.పురం రూ.38,700 -
ఈ సరస్వతికి లక్ష్మి తోడుకావాలి!
అసలే ఆడపిల్ల... ఆమెకు తోడు మరో ఇద్దరు చెల్లెళ్లు.. బాల్యం సాఫీగా సాగుతున్న సమయంలో కరెంట్ షాక్ వారి కన్నతల్లిని బలి తీసుకుంది. తల్లిలేని ఆ పిల్లలను అమ్మమ్మ చేరదీసి చదువు చెప్పింది. ఖర్చులు పెరగడంతో చేసేది లేక తన మనవరాళ్లను అనాథాశ్రమంలో చేర్చింది. ఆ పిల్లల్లో పెద్ద అమ్మాయి అక్కడే ఉన్నత చదువులను పూర్తి చేసింది. చిన్ననాటి కల అయిన సివిల్స్‌ను సాకారం చేసుకోవడం కోసం మనసున్న మారాజులెవరైనా సాయం చేయకపోతారా అని గంపెడంత ఆశతో ఎదురు చూస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం కమటంగూడెం గ్రామానికి చెందిన కమటం భాగ్య, అశోక్ దంపతులకు రజిత, దీపిక మౌనికలున్నారు. కరెంటు షాక్‌తో తల్లి భాగ్య చనిపోవడంతో వారికి అండగా ఉండాల్సిన తండ్రి వేరే పెళ్లి చేసుకుని తన దారి తాను చూసుకున్నారు. ముగ్గురు పిల్లలను అమ్మమ్మ జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామానికి తీసుకువచ్చింది. ఏడోతరగతి వరకు తమ్మడపల్లిలో చదువుకున్న రజిత ఆ తరువాత బచ్చన్నపేట మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుకున్నారు. 2006లో పదో తరగతిలో 90 శాతం మార్కులు సాధించారు. 2008లో ఇంటర్ జనగామ జిల్లా కేంద్రంలోని ఎస్వీ జూనియర్ కాలేజిలో పూర్తి చేశారు. అనాథ ఆశ్రమంలో ఉంటూనే ఉన్నత చదువులు.. అమ్మమ్మ ఇంటి వద్దనుంచే అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఇంటర్ వరకు చదివిన రజిత 2008లో జఫర్గడ్ మండలం రేగడితండాలో ఉన్న మా ఇల్లు ప్రజాదరణ అనాథ ఆశ్రమంలో చేరారు. ఆశ్రమంలో ఉంటూనే ఉన్నత చదువులను అభ్యసించారు. అనాథ ఆశ్రమం నుంచి హన్మకొండకు రోజు వెళ్లి వస్తూ డిగ్రీ, డబుల్ పీజీ పూర్తి చేశారు. హన్మకొండలోని చైతన్య డిగ్రీ కాలేజిలో బీఎస్సీలో గోల్డ్ మోడల్ సాధించారు. పీజీ ఎంట్రెస్లో టాప్ 10లో ర్యాంకు సాధించి వరంగల్ నిట్‌లో సీటు సాధించారు. ఎంఎస్సీ మ్యాథమెటిక్స్‌తో పీజీని పూర్తి చేశారు. తరువాత కాకతీయ యూనివర్శిటీలో ఎంఎస్‌డబ్ల్యూ రెండో పీజీని పూర్తి చేశారు. చేయూత కోసం ఎదురుచూపులు.. అనాథాశ్రమంలో ఉండి చదువుకున్న రజితకు వసతి కల్పించడమే కష్టతరం. అలాంటిది ఏకంగా సివిల్స్ కోచింగ్‌కు లక్షల్లో ఫీజులు ఉండడంతో చెల్లించలేని దుస్థితి. మా ఇల్లు ఆశ్రమ నిర్వహకులు గాదె ఇన్నారెడ్డి దాతల సహకారంతో కొంత మొత్తాన్ని సర్దుబాటు చేసినప్పటికీ ఆ మొత్తం కోచింగ్ ఫీజులకు ఏమాత్రం సరిపోవడం లేదు. దాతలు ఎవరైనా ముందుకు వస్తే వారికి రుణపడి ఉంటానని రజిత వేడుకుంటున్నారు. రజితకు సాయం చేయదలిస్తే 9866216680 సెల్ నంబర్లో సంప్రదించవచ్చు. తలో చేయి వేసి అనాథకు చేయూతనిద్దాం. – ఇల్లందుల వెంకటేశ్వర్లు,సాక్షి, జనగామ జిల్లా -
బీఎస్సీకి బీకామ్ పట్టా: మంత్రి గంటా సీరియస్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఎస్సీ చదువుకున్న విద్యార్థికి బీకామ్ పట్టా ఇవ్వడంపై మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై ఆంధ్ర వర్సిటీ వైస్ చాన్స్‌లర్‌తో ఆయన మాట్లాడారు. బీఎస్సీ చదివిన విద్యార్థికి బీకామ్ పట్టా ఎలా ఇచ్చారని ఈసందర్భంగా ఆయన ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, పట్టా ఇచ్చిన బాధ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన వీసీకి ఆదేశాలు జారీచేశారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడవద్దని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే.. బాధ్యులను విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. శ్రీకాకుళం విద్యార్థికి షాక్..! శ్రీకాకుళం జిల్లాకు చెందిన అట్టాడ శ్రీహరి.. టెక్కలి బీఎస్ అండ్ జేఆర్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ సీబీజెడ్ కోర్సు చేశాడు. 2015లో డిగ్రీ పట్టా కూడా చేతికొచ్చింది. దాన్ని చూసి ఆనందంతో మెరిసిన అతని కళ్లు.. అందులోని వివరాలు చూసి అంతలోనే బైర్లుకమ్మాయి. మార్కుల వివరాల వద్ద సైన్సు సబ్జెక్టులుగానే పేర్కొన్నా.. పైన మాత్రం బ్యాచిలర్ ఇన్ కామర్స్ అని ఉంది. పొరపాటు జరిగిందని గ్రహించిన శ్రీ హరి వెంటనే కళాశాల యాజమాన్యాన్ని సంప్రదిస్తే.. తమకేం సంబంధం లేదని, విశాఖ వెళ్లి ఆంధ్రా యూనివర్సిటీ అధికారులను సంప్రదించాలని సూచించారు. దీంతో ఆ యువకుడు వర్సిటీ అధికారులను కలిసి.. జరిగిన పొరపాటు గురించి వివరించారు. ‘ఆహా అలా జరిగిందా.. ఏముంది మార్చేద్దాంలే’.. అని చాలా తేలిగ్గా మాట్లాడిన పరీక్షల విభాగం అధికారులు మూడేళ్లయినా తమ తప్పును సరిదిద్దుకోలేదు. బాధిత విద్యార్థిని అదిగో.. ఇదిగో.. అంటూ తిప్పుతూనే ఉన్నారు. ఉద్యోగావకాశమూ పోయె.. సర్టిఫికెట్లో తప్పు కారణంగా శ్రీహరికి ఉద్యానవనశాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేజారింది. ఎంపిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో ఇతని డిగ్రీ పట్టా తిరస్కరణకు గురైంది. బీఎస్సీ అని చెప్పి బీకామ్ సర్టిఫికెట్ ఎలా పెట్టావని సంబంధిత అధికారులు శ్రీహరిని మందలించారు. ‘సార్.. పొరపాటున అలా వచ్చింది.. నేను బీఎస్సీ సీబీజెడ్ చదివానని మొత్తుకున్నా.. సర్టిఫికెట్టే ప్రధానమంటూ అధి కారులు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించారు. పోనీ బీకామ్ సర్టిఫికెట్తో ఏదైనా ఉద్యోగం చేద్దామంటే కామర్స్‌లో అవగాహన లేదు. దీంతో రెం టికీ చెడ్డ రేవడిలా తన పరిస్థితి తయారైందని శ్రీహరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ విద్యార్ధి వేదన మాత్రం వర్సిటీ అధికారులకు ఏమాత్రం పట్టడం లేదు. -
పీజీ...ఎందుకు క్రేజీ?
గ్రాడ్యుయేట్స్ స్పెషల్ బీఏ, బీఎస్సీ, బీకాం ఫైనలియర్ పరీక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని యూనివర్సిటీల్లో ముగిశాయి. మరికొన్నింటిలో త్వరలో ముగియనున్నాయి. గ్రాడ్యుయేషన్ తర్వాత ఉన్నత విద్యవైపు దృష్టి సారిస్తే మంచి భవిష్యత్ అవకాశాలు సొంతం చేసుకోవచ్చని విద్యావేత్తలు, నిపుణులు సూచిస్తున్నారు. బ్యాచిలర్స్ డిగ్రీతో పోలిస్తే పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారికి ఎక్కువ అవకాశాలుండటం ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో డిగ్రీ తర్వాత పీజీ ఎందుకు చేయాలి? పీజీతో ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.. పీజీ ఎందుకు? గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతోనే సివిల్స్, ఎస్ఎస్సీ, గ్రూప్స్, బ్యాంక్స్, రైల్వేస్ వంటి పోటీ పరీక్షలు రాసే అవకాశం ఉన్నప్పుడు పీజీ ఎందుకు? అనే ప్రశ్న సహజంగానే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉదయిస్తుంది. అయితే సంపూర్ణ మూర్తిమత్వం ఉన్న వ్యక్తులుగా ఎదగాలన్నా.. నిర్దేశిత సబ్జెక్టుల్లో మంచి పరిజ్ఞానం పొందాలన్నా పీజీతోనే సాధ్యం అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా గ్రాడ్యుయేషన్‌తోనే పూర్తిస్థాయి నైపుణ్యాలు పొందలేం. డిగ్రీ కళాశాలలు సాధారణంగా మండల కేంద్రాల్లో సైతం ఉంటాయి. అక్కడ వివిధ అంశాలపై విద్యార్థులకు ఎక్స్పోజర్ చాలా తక్కువగా లభిస్తుంది. పట్టణాల్లో చదివితే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. అదే పీజీ అయితే యూనివర్సిటీ క్యాంపస్‌ల్లో, లేదా క్యాంపస్ కళాశాలల్లో చదవాల్సి ఉంటుంది కాబట్టి విద్యార్థులకు వివిధ అంశాలపై అపార నైపుణ్యాలు సొంతమవుతాయి. ప్రతిభావంతులైన విద్యార్థులు, నిపుణులైన ఫ్యాకల్టీ ఉంటారు. దీనివల్ల వివిధ అంశాలపై సానుకూల వాతావరణంలో చర్చలు జరపొచ్చు. యూజీతో పోల్చుకుంటే పీజీతో కెరీర్ అవకాశాలెన్నో ఉన్నాయి. సివిల్స్, గ్రూప్స్ వంటి పరీక్షలకు డిగ్రీనే అర్హతగా ఉన్నప్పటికీ.. యూపీఎస్సీ నిర్వహించే ఇండియన్ ఎకనమిక్ సర్వీస్/ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామ్‌కు నిర్దేశిత సబ్జెక్టుల్లో పీజీ చేసినవారు మాత్రమే అర్హులు. అదేవిధంగా జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్‌గా పనిచేయాలంటే పీజీ ఉండాల్సిందే. ఇక యూనివర్సిటీలు/కేంద్రీయ విద్యా సంస్థల్లో ఫ్యాకల్టీగా పనిచేయాలంటే పీజీతోపాటు పీహెచ్డీ ఉండాల్సిందే. వివిధ ప్రైవేటు ఉద్యోగాల్లోనూ పీజీ పట్టా ఉన్నవారికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. పీజీ ఉంటే అదనపు అర్హతగా పరిగణిస్తున్నారు. కార్పొరేట్, సేవా రంగాలు, మేనేజ్మెంట్ వంటి నిర్దిష్ట విభాగాల్లో పీజీ చదివినవారికే అత్యుత్తమ అవకాశాలున్నాయి. వేతనాల్లో కూడా వీరే ముందుంటున్నారు. సంబంధిత విభాగాల్లో టీమ్ లీడర్‌గా ఎంపిక చేయాలన్నా.. అభ్యర్థి అకడమిక్ అర్హతలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ముందంజకు.. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, గ్రూప్స్, బ్యాంక్స్, డీఎస్సీ వంటి పోటీ పరీక్షల్లో డిగ్రీ అభ్యర్థుల కంటే పీజీ చదివినవారికే ఎక్కువ అవకాశాలుంటున్నాయి. వివిధ పరీక్షల్లో విజేతలుగా నిలిచినవారిని పరిశీలించినట్లయితే పీజీ అభ్యర్థులే ఉద్యోగ సాధనలో ముందుంటున్నారు. గ్రాడ్యుయేషన్‌లో చదివిన సబ్జెక్టులనే వీరు పీజీలో ఎంచుకోవడం ఇందుకు కారణం. ఉదాహరణకు డిగ్రీలో జాగ్రఫీ చదివినవారు పీజీలో కూడా అదే సబ్జెక్టును పూర్తిస్థాయిలో రెండేళ్లపాటు అధ్యయనం చేస్తారు. దీంతో ఆ సబ్జెక్టుపై మంచి పట్టు సాధిస్తారు. ఈ పరిజ్ఞానంతో పోటీ పరీక్షల్లో డిగ్రీ ఉత్తీర్ణులతో పోలిస్తే సులువుగా ఉద్యోగాలను దక్కించుకుంటున్నారు. కొత్త స్పెషలైజేషన్లు డిగ్రీతో పోల్చుకుంటే పీజీలో నేడు ఎక్కువ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. బహుళజాతి కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుండటం, ఈ-కామర్స్ శరవేగంగా అభివృద్ధి చెందుతుండటం, ప్రైవేటు రంగాల అవసరాల నేపథ్యంలో ఎన్నో స్పెషలైజేషన్లు పీజీలో అందుబాటులోకొచ్చాయి. ఎంకాంలో ఈ-కామర్స్, కార్పొరేట్ సెక్రటరీషిప్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్; ఎంఏలో లిబరల్ ఆర్ట్స్, రూరల్ డెవలప్మెంట్, సోషల్‌వర్క్; ఎంఎస్సీలో బయోఇన్ఫర్మేటిక్స్, బయోటెక్నాలజీ, జెనెటిక్స్ వంటి వినూత్న స్పెషలైజేషన్లను ఆయా యూనివర్సిటీలు/కళాశాలలు ప్రవేశపెట్టాయి. ఈ కోర్సులను అభ్యసించడం ద్వారా ఉన్నత విద్యావకాశాలతోపాటు ఉద్యోగావకాశాలు సొంతం చేసుకోవచ్చు. -
ఉమ్మడి పరీక్షలకు ఇలా సెట్ అవ్వండి
ఈసెట్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) విద్యార్థులకు లేటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశం కల్పించే ఈసెట్ (ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)కు నోటిఫికేషన్ వెలువడింది. ఈ పరీక్షను జేఎన్టీయూ -హైదరాబాద్ నిర్వహిస్తుంది. వివరాలు.. ఈసెట్‌లో నిర్దేశించిన అర్హత సాధించిన విద్యార్థులు బీఈ/బీటెక్ కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలో ప్రవేశం పొందొచ్చు. వీరికి యూనివర్సిటీ, ప్రైవేట్, అన్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూట్లలో సీట్లను కేటాయిస్తారు. అదేవిధంగా ఫార్మసీ డిప్లొమా (డి.ఫార్మసీ) విద్యార్థులు నేరుగా బీ.ఫార్మసీ రెండో సంవత్సరంలో అడ్మిషన్ పొందొచ్చు. అర్హత: స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ గుర్తింపు పొందిన కళాశాల నుంచి 45 శాతం మార్కులతో సం బంధిత బ్రాంచ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత. చివరి సంవత్సరం విద్యార్థులూ అర్హులే. లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 45 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్‌గా డిగ్రీ ఉత్తీర్ణత. రాత పరీక్ష: ఆబ్జెక్టివ్ విధానంలో ఇంగ్లిష్ మాధ్యమంలో 200 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో సమాధానాలను మూడు గంటల్లో గుర్తించాలి. ప్రశ్నపత్రం డిప్లొమా హోల్డర్లకు, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) విద్యార్థులకు వేర్వేరుగా ఉంటుంది. ఇంజనీరింగ్ సబ్జెక్ట్ మార్కులు మ్యాథమెటిక్స్ 50 అన్ని బ్రాంచ్‌లకు కామన్ ఫిజిక్స్ 25 అన్ని బ్రాంచ్‌లకు కామన్ కెమిస్ట్రీ 25 అన్ని బ్రాంచ్‌లకు కామన్ ఇంజనీరింగ్ 100 ఎంచుకున్న బ్రాంచ్‌ను బట్టి {పశ్నలు వేర్వేరుగా ఉంటాయి ఫార్మసీ సబ్జెక్ట్ మార్కులు ఫార్మస్యూటిక్స్ 50 ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ 50 ఫార్మకాగ్నసీ 50 ఫార్మకాలజీ 50 బీఎస్సీ (మ్యాథమెటిక్స్) సబ్జెక్ట్ మార్కులు మ్యాథమెటిక్స్ 100 అనలిటికల్ ఎబిలిటీ 50 కమ్యూనికేటివ్ ఇంగ్లిష్ 50 ప్రశ్నల క్లిష్టత: సంబంధిత సబ్జెక్ట్‌లలో ప్రాథమిక అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లలో అడిగే ప్రశ్నల క్లిష్టత స్థాయి ఇంటర్మీడియెట్. బ్రాంచ్ సబ్జెక్ట్ మాత్రం డిప్లొమా స్థాయిలో ఉంటుంది. మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు రావాలంటే 200లోపు ర్యాంకు సాధించాలి. నోటిఫికేషన్ సమాచారం: దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 15, 2015. (రూ. 500 లేట్ ఫీజుతో: ఏప్రిల్ 25 వరకు, రూ. 1000 లేట్ ఫీజుతో: మే 2 వరకు, రూ. 5000 లేట్ ఫీజుతో: మే 9 వరకు, రూ. 10,000 లేట్ ఫీజుతో: మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు) రాత పరీక్ష తేదీ: మే 21, 2015. పీజీఈసెట్ గేట్ తర్వాత రాష్ట్ర విద్యార్థులకు ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో చేరడానికి అవకాశం కల్పిస్తున్న పరీక్ష పీజీఈసెట్ (పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎం ట్రెన్స్ టెస్ట్). 2015-16 విద్యా సంవత్సరానికి పీజీఈసెట్ నోటిఫికేషన్ వెలువడింది. ఉస్మానియా యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. వివరాలు.. పీజీఈసెట్ ద్వారా రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలు, అనుబంధ పీజీ కళాశాలల్లో ఎంఈ/ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, ఫార్మ్‌డీ (పోస్ట్ బాక్యులరేట్) కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది బీటెక్ విద్యార్థులు బయటికి వస్తున్నారు. కాబట్టి జాబ్ మార్కెట్లో ఎంఈ/ఎంటెక్ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత లభిస్తుంది. అర్హతలు: సంబంధిత లేదా అనుబంధ బ్రాంచ్‌లతో బీటెక్/బీఈ/ఏఎంఐఈ/బీఫార్మసీ/బీఆర్క్/బీప్లానింగ్. ఫైనలియర్ విద్యార్థులు కూడా అర్హులే.రాత పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ పద్ధతిలో రాతపరీక్షను నిర్వహిస్తారు.ఇందులో 120ప్రశ్నలు ఉంటాయి. వీటికి 120 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాలి. ఇందులో 60 శాతం థియరీ, 40 శాతం ప్రాబ్లమ్స్ (ఫార్ములా బేస్డ్) ఉంటాయి. జాతీయ స్థాయిలో నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్) మాదిరిగానే పీజీఈసెట్ సిలబస్ ఉంటుం ది. ప్రశ్నలు క్లిష్టత స్థాయి మాత్రం కొంచెం తక్కువ. నోటిఫికేషన్ సమాచారం: దరఖాస్తు విధానం:ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 27, 2015. (రూ. 500 లేట్ ఫీజుతో: మే 11 వరకు, రూ. 2000 లేట్ ఫీజుతో: మే 22 వరకు, రూ. 5000 లేట్ ఫీజుతో: మే 28 వరకు, రూ. 10,000 లేట్ ఫీజుతో: జూన్ 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు) రాత పరీక్ష తేదీలు: జూన్ 2 నుంచి 8 వరకు. ఇలా చదవాలి ఈసెట్ డిప్లొమా విద్యార్థులు: మ్యాథమెటిక్స్‌లో క్యాలికులస్, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, కో-ఆర్డినేట్ జామెట్రీ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటిల్లో క్యాలికులస్, ట్రిగ్నోమెట్రీ అంశాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఫిజిక్స్‌లో యూనిట్స్, డెమైన్షన్స్, వెక్టార్స్, కైనమెటిక్స్, ఫ్రిక్షన్, వర్క్, పవర్, ఎనర్జీ, హీట్, సౌండ్ మోడ్రన్ ఫిజిక్స్ వంటి అంశాలు కీలకమైనవి. కెమిస్ట్రీలో వాటర్ ట్రీట్మెంట్, కరోజన్, సొల్యూషన్స్,ఫ్యూయల్స్, పొల్యూషన్, పాలిమర్స్ అంశాలను క్షుణ్నంగా చదవాలి. డిప్లొమా సబ్జెక్ట్‌లో ప్రతి అంశం నుంచి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ప్రామాణిక పుస్తకాలను చదువుతూ.. ప్రాథమిక భావనలను అవగాహన చేసుకుంటూ ఆబ్జెక్టివ్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. ఈ పరీక్షలో నెగిటివ్ మార్కు లు ఉండవు. ఈ నేపథ్యంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయడం ఉత్తమం. ప్రస్తుత ఏడాది డిప్లొమా పూర్తి చేస్తున్న విద్యార్థులకు ఈ-సెట్ ప్రిపరేషన్ కోసం తక్కువ వ్యవధి మాత్రమే లభిస్తుంది. కాబట్టి వీలైనన్నీ ఆబ్జెక్టివ్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. ఈ క్రమంలో సాధ్యమైనన్నీ షార్ట్‌కట్ మెథడ్స్ తెలుసుకోవాలి.బీఎస్సీ విద్యార్థులు: మ్యాథమెటిక్స్‌కు అత్యధిక వెయిటేజీ ఉంటుంది. ఇందులోని ప్రశ్నల క్లిష్టత డిగ్రీ స్థాయిలో ఉంటుంది. ఇప్పటికే డిగ్రీ పరీక్షల కోసం మ్యాథమెటిక్స్ను ప్రిపేర్ అయి ఉంటారు. కాబట్టి మరోసారి మాదిరి ప్రశ్నపత్రాలను పరిశీలిస్తూ పునశ్చరణ చేసుకుంటూ పోతే ఇందులో మెరుగైన మార్కులు సాధించవచ్చు. ఇంగ్లిష్‌లో ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, సినానిమ్స్, ఆంటోనిమ్స్, వర్డ్ రీప్లేస్-సబ్‌స్టిట్యూట్ తరహా ప్రశ్నలు అడుగుతారు. అనలిటికల్ ఎబిలిటీలో డేటా సఫిషియన్సీ, కాలం, వేగం, నిష్పత్తి, వడ్డీ, వయసు, కోడింగ్- డీకోడింగ్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పీజీఈసెట్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం, మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్ సిలబస్ నుంచి ఎక్కువ ప్రశ్న లు అడిగే అవకాశం ఉంది. కాబట్టి వీటిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ప్రధానంగా సంబంధిత బ్రాంచ్‌లో బేసిక్స్, ఫండమెంటల్స్, ముఖ్యమైన నిర్వచనాలు, ఫార్ములాలపై పట్టు సాధించాలి. ప్రతి ప్రాబ్లమ్‌ను కాన్సెప్ట్, ఫార్ములాను ఆధారం చేసుకొని వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. గేట్, ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం కూడా మంచిది. పీజీఈసెట్ ప్రిపరేషన్.. ట్రాన్స్‌కో, జెన్కో, ఏఈఈ, బీఎస్ఎన్ఎల్ (జేటీఓ), డీఆర్డీఓ వంటి ఉద్యోగ నియామక పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది.-జి.ర మణ, డెరైక్టర్, సాయి మేధ విద్యా సంస్థలు. లాసెట్/పీజీలాసెట్ అవకాశాల వారధిగా మారుతున్న లా కోర్సుల్లో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్న యువత సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని న్యాయ కళాశాల్లో బ్యాచిలర్, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి వీలుకల్పించే లాసెట్, పీజీలాసెట్ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో సంబంధిత వివరాలు.. లాసెట్ (లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్): ఈ పరీక్ష ద్వారా మూడేళ్లు/ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. ర్హత: మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సుకు-45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ (10+2+3 విధానంలో). ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సుకు-45 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్/తత్సమానం (10+2 విధానంలో). రాత పరీక్ష విధానం: లా, సమకాలీన అంశాల్లో అభ్యర్థుల అవగాహనను పరీక్షించే విధంగా ఆబ్జెక్టివ్ పద్ధతిలో లాసెట్ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో 120 ప్రశ్నలు ఉంటాయి. వీటికి కేటాయించిన మార్కులు 120. గంటన్నర ( 90 నిమిషాలు)లో సమాధానాలను గుర్తించాలి. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. అవి.. విభాగం అంశం ప్రశ్నలు మార్కులు పార్ట్-ఎ జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ 30 30 పార్ట్-బి కరెంట్ అఫైర్స్ 30 30 పార్ట్-సి ఆప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా 60 60 మొత్తం 120 120 ఐదేళ్ల లా కోర్సుకు నిర్వహించే పరీక్షలో ప్రశ్నల క్లిష్టత ఇంటర్మీడియెట్ స్థాయిలో, మూడేళ్ల కోర్సు కోసం నిర్వహించే పరీక్షలో డిగ్రీ స్థాయిలో ప్రశ్నల క్లిష్టత ఉంటుంది. నెగెటివ్ మార్కులు లేవు.పార్ట్-ఎలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, చరిత్ర, జాగ్రఫీ, కంప్యూటర్, తదితర అన్ని రంగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఉదాహరణకు.. 1975లో నిర్మితమైన మొదటి పర్సనల్ కంప్యూటర్ పేరు?పార్ట్-బిలో కరెంట్ అఫైర్స్‌లో భాగంగా గత ఏడాది కాలంగా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయంగా చోటు చేసుకున్న సంఘటనల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఉదాహరణ-సంస్కృతి ప్రతిష్టాన్ పురస్కారం అందుకున్న వ్యక్తి?పార్ట్-సిలో న్యాయ సూత్రాలు, రాజ్యాంగానికి సంబంధించిన ప్రాథమిక అవగాహనను పరీక్షించే ప్రశ్నలు ఉం టాయి. ఉదాహరణకు-భారత రాజ్యాంగంలో మూడు లెజిస్లేటివ్ పట్టికలను ఎందులో ఉటంకించారు? నోటిఫికేషన్ సమాచారం: దరఖాస్తు రుసుం: రూ.250 దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 10, 2015. (రూ. 250 లేట్ ఫీజుతో: ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 21 వరకు, రూ. 500 లేట్ ఫీజుతో: ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 30 వరకు, రూ. 1000 లేట్ ఫీజుతో: మే 1 నుంచి మే 7 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు) రాత పరీక్ష తేదీ: మే 19, 2015. పీజీలాసెట్: ఎల్ఎల్ఎం/ఎంఎల్ కోర్సుల్లో ప్రవేశానికి పీజీలాసెట్ (పోస్ట్‌గ్రాడ్యుయేట్ లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) నిర్వహిస్తారు.అర్హత: ఎల్ఎల్బీ/బీఎల్ (మూడు/ఐదేళ్లు). చివరి సంవత్సరం విద్యార్థులు కూడా ద రఖాస్తు చేసుకోచ్చు. రాత పరీక్ష: రాత పరీక్షలో 120 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో పార్ట్-ఎ, బి అనే రెండు భాగాలు ఉంటాయి. వీటికి 90 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాలి. వివరాలు.. పార్ట్-ఎలో 40 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో జూరిస్ ప్రుడెన్స్‌పై 20 ప్రశ్నలు (20 మార్కులు), కాన్స్టిట్యూషనల్ లాపై 20 ప్రశ్నలు (20 మార్కులు) అడుగుతారు. పార్ట్-బిలో 80 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో అంశాలవారీగా వచ్చే ప్రశ్నల సంఖ్య-మార్కులు: పబ్లిక్ ఇంటర్నేషనల్ లా (16 ప్రశ్నలు-16 మార్కులు), మర్కంటైల్ లా (16 ప్రశ్నలు-16 మార్కులు), లేబర్ లా (16 ప్రశ్నలు-16 మార్కులు), క్రైమ్స్ అండ్ టోర్ట్స్ (16 ప్రశ్నలు-16 మార్కులు), ఐపీఆర్ అండ్ అదర్ లాస్ (16 ప్రశ్నలు-16 మార్కులు). నోటిఫికేషన్ సమాచారం: దరఖాస్తు రుసుం: రూ.500 దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 10, 2015. (రూ. 250 లేట్ ఫీజుతో: ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 21 వరకు, రూ. 500 లేట్ ఫీజుతో: ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 30 వరకు, రూ. 1000 లేట్ ఫీజుతో: మే 1 నుంచి మే 7 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు) రాత పరీక్ష తేదీ: మే 19, 2015. వెబ్సైట్: http://tslawcet.org/ -
ఐబీపీఎస్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్
ఆకర్షణీయ వేతనాలు, ఆహ్లాదకర పనివాతావరణం, కెరీర్లో చకచకా ఎదిగేందుకు విస్తృత అవకాశాలు.. ఇవే నేటి యువతకు బ్యాంకులో కొలువుదీరడాన్ని లక్ష్యంగా నిర్దేశిస్తున్నాయి. బీఎస్సీ, బీఏ, బీకామ్, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ.. చేసిన కోర్సు ఏదైనా ఇప్పుడు చాలా మంది బ్యాంకు ఉద్యోగం లక్ష్యంగా కసరత్తు చేస్తున్నారు. ఇలాంటి వారికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) గేట్ వే వంటిది. ఇది నిర్వహించే పరీక్షల్లో విజయం సాధించడం ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులో కొలువును ఖాయం చేసుకోవచ్చు. బ్యాంకు ఉద్యోగ నియామకాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఐబీపీఎస్ తాజాగా కొన్ని పరీక్షల విధానాన్ని మార్చింది. వీటిపై స్పెషల్ ఫోకస్.. ఎస్బీఐ, దాని అనుబంధ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి ఎస్బీఐ సొంతంగా నియామక ప్రక్రియ చేపడుతోంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్).. అలహాబాద్ బ్యాంకు, ఆంధ్రాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యునెటైడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తదితర ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్లరికల్ కేడర్, ప్రొబేషనరీ ఆఫీసర్, స్పెషలిస్టు ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తోంది. వీటి తర్వాత ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పుడు ఐబీపీఎస్ కొన్ని పరీక్షల విధానంలో మార్పులు చేసింది. వీటికి పాత విధానమే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(ఆర్ఆర్బీ)ల్లో స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఆఫీసర్లు; ఆఫీస్ అసిస్టెంట్ నియామకాలకు కామన్ రిటెన్ ఎగ్జామినేషన్(సీడబ్ల్యూఈ)-4ను పాత విధానంలో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఒకే పరీక్ష నిర్వహిస్తారు.ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ వంటి స్పెషలిస్టు ఆఫీసర్ల నియామకాలకు కూడా పాత విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. నియామక ప్రక్రియలో ఒకే పరీక్ష ఉంటుంది. ప్రధాన మార్పులు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లరికల్ కేడర్, ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్మెంట్ ట్రెయినీ నియామకాలకు ఇప్పటి వరకు ఒకే పరీక్ష ఉండేది. ఇక నుంచి రెండు దశల్లో అంటే ప్రిలిమనరీ, మెయిన్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌లో నిర్దేశ మార్కులు సాధించిన వారిని మెయిన్ రాసేందుకు అనుమతిస్తారు. ఇందులో విజయం సాధించిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. తుది జాబితా రూపకల్పనకు ప్రిలిమ్స్ మార్కులను పరిగణనలోకి తీసుకోరు. సీడబ్ల్యూఈ-5 నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుంది. మార్పులెందుకు? ప్రస్తుతం బ్యాంకు పరీక్షలకు ఏటా లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. 2013-14లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని క్లరికల్ పరీక్షలకు 14.24 లక్షల మంది, ఆఫీసర్ కేడర్ పరీక్షలకు 13.19 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఒకే పరీక్ష ఉండటం వల్ల అందులో ఉత్తీర్ణత సాధించిన వారందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించడం కష్టమవుతోంది. అందువల్ల పరీక్ష దశలోనే అభ్యర్థులను వడపోసేందుకు ప్రిలిమనరీ, మెయిన్ పరీక్షల విధానాన్ని తెచ్చినట్లు తెలుస్తోంది. మారిన ఫీజు చెల్లింపు విధానం ఇప్పటి వరకు దరఖాస్తు ఫీజును ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో చెల్లించే వెసులుబాటు ఉండేది. ఇకపై ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, మొబైల్ వేలెట్, క్యాష్‌కార్డు ద్వారా చెల్లించవచ్చు. ప్రిపరేషన్ ప్రణాళిక ఐబీపీఎస్ 2015-16లో నిర్వహించనున్న పరీక్షలకు కేలండర్‌ను ముందుగానే విడుదల చేసింది కాబట్టి అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌కు పటిష్ట ప్రణాళిక వేసుకునేందుకు అవకాశం లభించింది. పరీక్ష విధానం ఏదైనా కష్టపడేవారికి విజయం తథ్యం. ప్రభుత్వరంగ బ్యాంకుల క్లరికల్, పీవో పరీక్షలకు ప్రిలిమినరీ, మెయిన్ రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టినా, పరీక్షల సిలబస్, మార్కులు, సమయం, ప్రిలిమ్స్ నుంచి మెయిన్‌కు ఎందరిని ఎంపిక చేస్తారు తదితర అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రిలిమ్స్‌లో రీజనింగ్, ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లపై ప్రశ్నలు ఉండే అవకాశముంది. తక్కువ ప్రశ్నలు ఉండి, స్వల్ప వ్యవధిలో పరీక్ష ముగిసేలా ఉంటుంది. మెయిన్‌లో ఇప్పుడున్న సబ్జెక్టుల నుంచి కొంత క్లిష్టతతో ప్రశ్నలు అడిగే అవకాశముంది. గత సబ్జెక్టులనే కొనసాగించే అవకాశముంది కాబట్టి పరీక్ష విధానంలో మార్పుల వల్ల ఆందోళన చెందనవసరం లేదు. రోజుకు ఎన్ని గంటలు చదివామనే దానికంటే ఎంత విశ్లేషణాత్మకంగా చదివామన్నదే ముఖ్యం. రోజూ కోచింగ్ తీసుకునే సమయాన్ని మినహాయించి, ఇంటి దగ్గర ప్రిపరేషన్‌కు మూడు, నాలుగు గంటలు కేటాయించాలి. శిక్షణ కేంద్రంలో నిర్వహించే రోజువారీ, వారంతపు పరీక్షలను తప్పనిసరిగా రాయాలి. దీనివల్ల ఏ సబ్జెక్టుల్లో బలహీనంగా ఉన్నారో తెలుస్తుంది. దానికనుగుణంగా ప్రిపరేషన్ ప్రణాళికను మార్చుకోవచ్చు. రీజనింగ్‌లో ఎరేంజ్మెంట్, పజిల్ సాల్వింగ్ విభాగాలు చాలా ముఖ్యమైనవి. వీటితో పాటు బ్లడ్ రిలేషన్స్ సమస్యల సాధన కీలకం. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో డేటా ఇంటర్‌ప్రిటేషన్ ముఖ్యమైంది. 8, 9 పాఠ్యపుస్తకాల్లోని అంశాలను ప్రాక్టీస్ చేస్తే క్వాంటిటేటివ్ విభాగంలో అధిక స్కోర్ సాధనకు వీలవుతుంది. ఇంగ్లిష్‌లో కటాఫ్ దాటేందుకు చాలా మంది అభ్యర్థులు ఇబ్బందులుపడుతున్నారు. ఈ పరిస్థితి రాకూడదంటే కాంప్రెహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. దీనికోసం ఇంగ్లిష్ గ్రామర్, రూట్ వర్డ్స్‌పై పట్టు సాధించాలి. ఇంగ్లిష్ గ్రామర్‌పై పట్టు సాధించడానికి ఇంగ్లిష్ దినపత్రికలు, ప్రామాణిక పుస్తకాలను ఉపయోగించుకోవాలి. ోజూ తప్పకుండా నమూనా పరీక్షలు రాయాలి. గ్రూపుగా ఏర్పడి ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది.