బీఎస్సీ చదవిన విద్యార్థికి ఇచ్చిన బీకామ్ పట్టా
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఎస్సీ చదువుకున్న విద్యార్థికి బీకామ్ పట్టా ఇవ్వడంపై మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై ఆంధ్ర వర్సిటీ వైస్ చాన్స్‌లర్‌తో ఆయన మాట్లాడారు. బీఎస్సీ చదివిన విద్యార్థికి బీకామ్ పట్టా ఎలా ఇచ్చారని ఈసందర్భంగా ఆయన ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, పట్టా ఇచ్చిన బాధ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన వీసీకి ఆదేశాలు జారీచేశారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడవద్దని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే.. బాధ్యులను విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.
శ్రీకాకుళం విద్యార్థికి షాక్..!
శ్రీకాకుళం జిల్లాకు చెందిన అట్టాడ శ్రీహరి.. టెక్కలి బీఎస్ అండ్ జేఆర్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ సీబీజెడ్ కోర్సు చేశాడు. 2015లో డిగ్రీ పట్టా కూడా చేతికొచ్చింది. దాన్ని చూసి ఆనందంతో మెరిసిన అతని కళ్లు.. అందులోని వివరాలు చూసి అంతలోనే బైర్లుకమ్మాయి. మార్కుల వివరాల వద్ద సైన్సు సబ్జెక్టులుగానే పేర్కొన్నా.. పైన మాత్రం బ్యాచిలర్ ఇన్ కామర్స్ అని ఉంది. పొరపాటు జరిగిందని గ్రహించిన శ్రీ హరి వెంటనే కళాశాల యాజమాన్యాన్ని సంప్రదిస్తే.. తమకేం సంబంధం లేదని, విశాఖ వెళ్లి ఆంధ్రా యూనివర్సిటీ అధికారులను సంప్రదించాలని సూచించారు. దీంతో ఆ యువకుడు వర్సిటీ అధికారులను కలిసి.. జరిగిన పొరపాటు గురించి వివరించారు. ‘ఆహా అలా జరిగిందా.. ఏముంది మార్చేద్దాంలే’.. అని చాలా తేలిగ్గా మాట్లాడిన పరీక్షల విభాగం అధికారులు మూడేళ్లయినా తమ తప్పును సరిదిద్దుకోలేదు. బాధిత విద్యార్థిని అదిగో.. ఇదిగో.. అంటూ తిప్పుతూనే ఉన్నారు.
ఉద్యోగావకాశమూ పోయె..
సర్టిఫికెట్లో తప్పు కారణంగా శ్రీహరికి ఉద్యానవనశాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేజారింది. ఎంపిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో ఇతని డిగ్రీ పట్టా తిరస్కరణకు గురైంది. బీఎస్సీ అని చెప్పి బీకామ్ సర్టిఫికెట్ ఎలా పెట్టావని సంబంధిత అధికారులు శ్రీహరిని మందలించారు. ‘సార్.. పొరపాటున అలా వచ్చింది.. నేను బీఎస్సీ సీబీజెడ్ చదివానని మొత్తుకున్నా.. సర్టిఫికెట్టే ప్రధానమంటూ అధి కారులు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించారు. పోనీ బీకామ్ సర్టిఫికెట్‌తో ఏదైనా ఉద్యోగం చేద్దామంటే కామర్స్‌లో అవగాహన లేదు. దీంతో రెం టికీ చెడ్డ రేవడిలా తన పరిస్థితి తయారైందని శ్రీహరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ విద్యార్ధి వేదన మాత్రం వర్సిటీ అధికారులకు ఏమాత్రం పట్టడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment