![Hilariously and louboutin shoes is sitting on the leg - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/9/Untitled-4.jpg.webp?itok=2-HR95pF)
ఒక చెట్టు మీద ఒక కాకి రోజంతా అలాగే కూర్చొని ఉంది. కాలి నొప్పో, కంటి నొప్పో అయి కూర్చోవడం కాదు. ఉల్లాసంగా, విలాసంగా కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఉంది! కిందికి, పైకి, పక్కలకు ముక్కు కదపడం ఒక్కటే అది చేస్తున్న పని. ఓ కుందేలు ఉదయాన్నే ఆహారం వెతుక్కుంటూ చెట్టు కిందికి గెంతుకుంటూ వచ్చి, చెట్టు పైన కూర్చొని ఉన్న ఆ కాకిని చూసింది. మళ్లొకసారి అటు గెంతుతూ, ఇటు గెంతుతూ చెట్టు పైకి చూసింది. కాకి ఆ కొమ్మ మీద అలాగే కూర్చొని ఉంది. మధ్యాహ్నం అయినా అలాగే కూర్చొని ఉంది. సాయంత్రం కావస్తున్నా అలాగే కూర్చొని ఉంది. ‘ఆహా.. తిండి తిప్పల్లేకుండా, చీకూచింతా లేకుండా ఎంత హాయిగా బతుకుతోంది ఈ కాకి’ అనుకుంది.
ఇక ఉండబట్టలేక, ‘‘కాకిగారూ.. నేను కూడా మీలాగే రోజంతా పనీపాటా లేకుండా కాలు మీద కాలు వేసుకుని విశ్రాంతిగా కూర్చొవచ్చా?’’ అని అడిగింది. ‘ఓ.. ఎందుక్కూర్చోకూడదూ? తప్పకుండా కూర్చోవచ్చు కుందేలు పిల్లా’’ అంది కాకి. కుందేలుకు సంతోషం వేసింది. ఆ చెట్టు కిందే తీరిగ్గా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది. కొద్దిసేపటికే అటుగా వచ్చిన నక్క.. కుందేలును నోట కరుచుకుని వెళ్లింది. ఇందులో నీతి ఏమిటంటే.. పనీపాటా లేకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడానికి ఎవరికీ అందనంత ఎత్తులో ఉండాలని!
Comments
Please login to add a commentAdd a comment