
మోసమే మ్యాజిక్
హాలీవుడ్ థ్రిల్లర్ / నౌ యు సీ మీ
ప్రపంచంలో నమ్మినా నమ్మకపోయినా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో లైఫ్‌లో ఒక్క మ్యాజిక్ జరిగితే బాగుండుఅనుకుంటుంటారు. కానీ మెజీషియన్లు ఇంద్రజాలం చేస్తే నమ్మరు. గారడీ అని కొట్టి పారేస్తారు. అలాంటి మ్యాజిక్ షో ఓ క్రైమ్‌కి తెర తీస్తే? అదే 2013లో విడుదలైన ‘నౌ యు సీ మీ’.
లూయిస్ లెటరిర్స్ ఓ ఫ్రెంచి దర్శకుడు. ‘ట్రాన్స్‌పోర్టర్’ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన... ‘ది ఇన్‌క్రెడిబుల్ హల్క్’ సినిమాతో హాలీవుడ్‌లో పాగా వేశాడు. ఓ కథని వేగంగా, ఆసక్తిగా చెప్పడంతో పాటు సక్సెస్ చేసి, సీక్వెల్ రెడీ చేయడం లూయిస్ స్టయిల్. ‘ది ట్రాన్స్‌పోర్టర్’ సినిమాతో ఆ విషయాన్ని ప్రూవ్ చేసుకున్న లూయిస్ ‘నౌ యు సీ మీ’ కూడా అలాగే రూపొందించాడు. అందుకే 2013లో ఈ సినిమా విజయవంతం అయ్యింది. 2016లో వచ్చిన ఈ సినిమా సీక్వెల్‌కి బీజం పడింది (అయితే లూయిస్ దర్శకుడు కాదు. జాన్ బౌ అనే చైనీస్ డెరైక్ట్ చేశాడు).
నలుగురు కుర్ర మెజీషియన్లు అనుకోకుండా నలుగురికి విడివిడిగా కార్డ్స్ వచ్చాయి. ఆ పేక ముక్కల ఆధారంగా న్యూయార్క్‌లో ఓ అపరిచితుణ్ని కలుసుకున్నారు.ఏడాది తర్వాత ఆ నలుగురు మెజీషియన్లు ఓ గ్రూప్‌గా ఫామ్ అయ్యి, లాస్ వేగాస్‌లో ఓ ప్రదర్శన ఇవ్వడానికి వచ్చారు. అందులో భాగంగా ప్యారిస్‌లోని ఓ బ్యాంక్ లాకర్లలో ఉన్న డబ్బుని బయటికి గాలికి ఎగురుకుంటూ వచ్చేలా చేయడం వీళ్లు ప్లాన్ చేసిన ట్రిక్. కానీ నిజంగానే ఆ బ్యాంక్‌లో కరెన్సీ మాయమైంది. దాంతో ఇంటర్‌పోల్ ఏజెంట్, ఎఫ్‌బీఐ ఏజెంట్ ఈ నలుగురు మెజీషియన్ల వెనక పడ్డారు. వాళ్లు సహజంగానే తమకేమీ తెలియదన్నారు. సీనియర్ మెజీషియన్ సహకారంతో ఈ కేసు పరిశోధన కొనసాగించారు.
రెండోసారి మరో నగరంలో ఇదే తరహా మ్యాజిక్ షో ఇవ్వడానికి నలుగురు మెజీషియన్లు ప్లాన్ చేశారు. ఈసారి ఇన్సూరెన్స్ కంపెనీ అధినేత ఆర్థర్ డ్రెప్లర్ కంపెనీలో డబ్బుని మాయం చేశారు. ఆర్థర్ పగతో రగిలిపోయాడు. ఇంటర్‌పోల్ ఏజెంట్ అల్మా న్యూయార్క్‌లోని ఈ నలుగురు మెజీషియన్లూ ఉండే అపార్ట్‌మెంట్ మీద రైడ్ చేసింది. ముగ్గురు తప్పించుకుంటారు. ఒకడు (జాక్) ప్రమాదవశాత్తూ చనిపోతాడు. అక్కడ విలువైన డాక్యుమెంట్లు దొరుకుతాయి. వాటి ఆధారంగా మెజీషియన్స్ హార్స్‌మెన్ గ్రూప్ ఆ తర్వాత ఎక్కడ నేరం చేయబోతున్నారనే ఆధారాలు లభిస్తాయి.
ఆ చివరి షోని పోలీసులు ముట్టడిస్తారు. షోలో భాగంగా జనంపై డాలర్ల వర్షం కురిపిస్తారు. నిజానికవి దొంగనోట్లు. అయినా ప్రదర్శనకి వచ్చినవాళ్లు వాటిని నిజం నోట్లే అని భ్రమించి, ఎగబడతారు. ఈ హడావుడిలో ముగ్గురు తప్పించుకుంటారు. అయినా అల్మా వెంట పడుతుంది.చివరికి తెలిసేది ఏమిటంటే... ఆ ముగ్గురిలో ఒకడయిన డైలాన్ తండ్రిని ఆ బ్యాంక్, ఇన్యూరెన్స్ కంపెనీలు మోసం చేస్తాయి. అందుకే ప్రతీకారంగా ఈ మ్యాజిక్ క్రైమ్‌లు చేసినట్లు చెబుతాడు. డెబ్భై అయిదు మిలియన్ల వ్యయంతో రూపొందిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. 352 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.
- తోట ప్రసాద్