ఇల్లే స్వర్గం!
కష్టపడే వాళ్లు, వారాంతంలో ఒకసారి రిలాక్స్ అయితే చాలు, మరో వారానికి సరిపడ శక్తి వస్తుంది. అందుకే నేను వారంతాలలో రిలాక్స్ కావడానికి ప్రాధాన్యత ఇస్తాను. ముంబాయి మహానగరంలో రిలాక్స్ కావడం కష్టమే. ఎందుకంటే వారం రోజులూ, 24 గంటలు నగరం మేల్కొనే ఉంటుంది. అందుకే బయటికి వెళ్లడం కంటే ఇంట్లో గడపడానికి ఇష్టపడతాను. నేను రిలాక్స్ కావడానికి అవసరమైన సహకారాన్ని నా కుటుంబం అందిస్తుంది. వారాంతంలో కుటుంబసభ్యులందరితో కలిసి కబుర్లు చెప్పుకోవడంలో నాకెంతో రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది.
ఫైవ్‌స్టార్ హోటల్లో సేద తీరడం కంటే కుటుంబసభ్యులతో గడపడంలోనే సంతోషం లభిస్తుంది. దాని నుంచే రిలాక్స్ అవుతుంటాను. ముంబాయిలో రోజుకో కొత్త రెస్టారెంట్ ప్రారంభమవుతుంటుంది. విచిత్రమేమిటంటే ఇక్కడ చైనీస్, ఇటలియన్... మొదలైన ఫుడ్‌లన్నీ దొరుకుతాయి... ఒక్క ఇండియన్ ఫుడ్ తప్ప! అందుకే భోజనం విషయంలో ఇంటికి ప్రాధాన్యత ఇస్తాను. నచ్చిన భోజనం నుంచి ఇచ్చే తృప్తి నుంచి కూడా రిలాక్స్‌గా ఫీలవుతాను. జిమ్‌లో రిలాక్స్ కావడం అంటే కూడా నాకు చాలా ఇష్టం.
- అనిల్ కపూర్