కుటుంబ సభ్యులతో మహేశ్వరం లత
ఆమె ఆ ఇంటికి పెద్ద దిక్కు. కూరగాయలు అమ్మి ఇంటిని నడిపించేది. భర్తకు క్యాన్సర్.పిల్లలు ఇంకా స్థిరపడలేదు. వారికీ శారీరక సమస్యలు.ఇప్పుడు కరోనా వచ్చింది. హైదరాబాద్ నుంచి ఊరికి తిప్పి పంపింది.పని లేదు. సంపాదన లేదు. ఆకలి. పని కావాలి. పని ఇస్తారా?
ఇంటి పెద్దగా కాయకష్టం చేసుకుంటూ కుటుంబానికి ఏ లోటు రాకుండా చూసుకున్నాడుఅతను. కట్టుకున్న భర్తకు చేదోడు వాదోడుగా ఆ ఇల్లాలు ఇంటి బాగోగులు చూసుకుంటూ ఉండేది. అక్షరజ్ఞానం లేకపోయినా అణకువగా జీవితాన్ని వెళ్లబుచ్చతున్నారు. ఇద్దరు కూతుళ్లు పుట్టారు. పుట్టుకతోనే ఇద్దరూ మూగవాళ్లని తెలియడంతో వారి పెంపకానికి ఏ దారి వేయాలో తెలియక గుండె చిక్కబట్టుకున్నారు. మూగ అయినా వారిని చదవించడానికే పూనుకున్నారు. జనగామ జిల్లా లింగాల ఘనపురానికి శ్రీనివాస్, లత తమ బిడ్డల భవిష్యత్తును భరోసాగా దిద్దడానికే సిద్ధమయ్యారు. పెద్దమ్మాయి ఉషా మాధవిని డిగ్రీ వరకు చదివించారు. నాలుగేళ్ల క్రితం మూగ అబ్బాయి రమేష్‌తో ఉషా మాధవికి వివాహం చేశారు. చిన్న కూతరు ప్రసన్న హైదరాబాద్‌లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఏదో ఇలా కాలం నెట్టుకొచ్చేద్దాం అనుకున్న సమయంలో క్యాన్సర్ ఆ కుటుంబంలో కల్లోలం రేపింది. ఇంటి పెద్ద శ్రీనివాస్‌కు క్యాన్సర్ అని తేలడంతో అతను ఇంటికే పరిమితమయ్యాడు. మందుల మీదనే బతుకుబండి లాగిస్తున్నాడు.
వలస వెళ్లిన విధం
ఉన్న ఊర్లో పని లేదు. ఉన్న ఇల్లు తప్ప భూమి ఆధారం లేదు. శ్రీనివాస్ వైద్యానికి, చిన్న కూతురు చదువు కోసం లత వారిని తీసుకొని పట్టణం బాట పట్టింది. లత సోదరులు ముంబయ్‌లో ఉండడంతో ఏ ఆధారం లేని తల్లినీ తన దగ్గరకే తెచ్చుకుంది. హైదరాబాద్ ఉప్పల్‌లోని చిలకమ్మనగర్ ప్రాంతంలో అద్దె ఇల్లు తీసుకొని కూరగాయల వ్యాపారాన్ని ప్రారంభించింది. చిన్నకూతురుకు వచ్చే దివ్యాంగపెన్షన్, అల్లుడు రమేష్ సహకారంతో కూరగాయలను అమ్మి తన భర్తకు వైద్యం చేయించడం, కుటుంబాన్ని పోషించే బాధ్యతను భుజానికి ఎత్తుకుంది. రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు సంపాదిస్తూ కుటుంబానికి పెద్దదిక్కుగా మారింది.
ఊరికి పయనం
ఇప్పుడు కరోనా ఉన్న ఉపాధిని మింగేసింది. మూడు నెలలుగా కూరగాయల వ్యాపారం మూత పడింది. అద్దెకట్టలేక, తినడానికి తిండి లేక కట్టుబట్టలతో మే నెల చివరి వారంలో కుటుంబం అంతా తమ సొంతూరుకు చేరారు. ఉన్న రేకుల షెడ్డులాంటి ఇల్లు తప్ప మరే ఆధారం లేని ఆ ఊళ్లో ఏదైనా వ్యవసాయ పనులు దొరికితే చేసుకు బతుకుదామనుకున్నారు. కానీ, స్థానికంగా ఎలాంటి ఉపాధి దొరక్కపోవడంతో ఇప్పుడు రోజులు లెక్కపెడుతున్నారు. వ్యవసాయ పనులకు వెళదామంటే పట్టణం నుంచి వచ్చినవారు తమ వద్దకు వస్తే కరోనా అంటుకుంటుందన్న భయంతో ఎవరూ పనికి పిలిచే అవకాశం లేదు.
ఎదురుచూపులు..
జీవనోపాధి కోల్పోవడంతో రోడ్డున పడ్డ ఆ కుటుంబం ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తుంది. లత పెద్ద కూతురు ఉషా మాధవి డిగ్రీ వరకు చదువుకున్నది. ఉషా మాధవికి పని కల్పించాలని లత గ్రీవెన్స్ సెల్‌లో దరఖాస్తు చేసుకుంది. పలుమార్లు తిరిగినప్పటికి ఎలాంటి ఉపాధి దొరకలేదు. కూతురు, అల్లుడు, మరో కూతురు మూగవాళ్లు కావడం, భర్త అనారోగ్యానికి గురి కావడం పనుల్లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో లత ప్రభుత్వ భరోసా కోసం కుటుంబం వేడుకుంటోంది. – ఇల్లందుల వెంకటేశ్వర్లు, సాక్షి, జనగామ
Comments
Please login to add a commentAdd a comment