సర్వైకల్ స్పాండిలోసిస్... సులభ వైద్యం
సర్వైకల్ స్పాండిలోసిస్ ఇటీవల చాలా ఎక్కువగా కనిపిస్తున్న సమస్య. ఇది ప్రధానంగా వృత్తిపరమైన రుగ్మత (ఆక్యుపేషనల్ హజార్డ్). ఇటీవల ఈ సమస్య తరచూ ద్విచక్రవాహనాలు నడిపేవారిలో, కదలకుండా కంప్యూటర్ ముందుగాని, డెస్క్‌లో గాని ఎక్కువగా కూర్చుని ఉండేవారిలో ఈ డిస్క్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆధునిక జీవనశైలిలో శారీరక శ్రమ పెద్దగా లేని వారిలో కూడా ఈ సమస్యలు చాలా తరచుగా గమనించవచ్చు. ఈ తరహా సమస్యలు అందరిలో కనిపిస్తున్నా స్త్రీలతో పోలిస్తే ఇవి పురుషుల్లోనే ఎక్కువ. వయసు పెరుగుతున్న కొద్దీ వెన్నుపూసలలో మార్పులు రావడం అన్నది చాలా సాధారణంగా జరిగే స్వాభావిక మార్పు. అయితే ఈ మార్పుల కారణంగా డిస్క్‌ల మధ్యన ఉండే నరాల మీద ఒత్తిడి పెరుగుగుతుంది. దాంతో ఒకవేళ ఇలాంటి మార్పులు మెడ దగ్గర ఉండే వెన్నెముకల మధ్య సంభవించినప్పుడు మెడ పట్టేసినట్లు ఉండటం, తలనొప్పి, కళ్లు తిరగడం, భజాలు, చేతుల నొప్పి, తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. నరాల మీద ఒత్తిడి వల్ల తలతిరగడం, నడకలో తేడా వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.
కారణాలు: ఎముకలు, ఎముకల చివరన ఉండే కార్టిలేజ్ అరిగిపోవడంతో ఎముకలు ఎగుడుదిగుడుగా మారతాయి. దాంతో వాటి మధ్యన ఉండే నరాలపై ఒత్తిడి పడటం, అవి నలగడం జరుగుతుంది. ఫలితంగా మెడ వెనకభాగంలో నొప్పి, మెడ తిప్పలేకపోవడం, చేతులు లాగినట్లుగా ఉండటం, మెడ నుంచి చేతుల చివరి భాగం వరకు నొప్పి, తిమ్మిర్లు పాకినట్లుగా రావడం, పైకి చూస్తే కళ్లు తిరగడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. తూలినట్లుగా నడవటం, కొన్ని సందర్భాల్లో మల, మూత్రాలపై నియంత్రణ కోల్పోవడం జరగవచ్చు.
చేయకూడని పనులు: పరుగెత్తడం, ఎక్కువసేపు టీవీ చూడటం, కంప్యూటర్‌పై అదేపనిగా పనిచేయడం, కుట్టుపని, ఎంబ్రాయిడరీ, నిటారుగా కూర్చోవడం, డ్రైవింగ్ వంటి పనులు చేయకూడదు.
నివారణ: మెడ కండరాలకు బలం చేకూర్చే వ్యాయామాలు చేయాలి. వృత్తిపరంగా డెస్క్ ముందు కూర్చునేవారు సరైన భంగిమల్లో కూర్చోవాలి. మానసికమైన ఒత్తిడులు తగ్గించుకోవాలి. కంప్యూటర్‌పై పనిచేస్తున్నప్పుడు ప్రతి పది నిమిషాలకు ఒకమారు లేచి నడవటం, కాస్త రిలాక్స్ కావడం మంచిది.
చికిత్స: హోమియోలో కాల్కేరియా గ్రూపు మందులైన కాల్కేరియా ఫాస్, కాల్కేరియా ఫ్లోర్, బ్రయోనియా, స్పైజిలియా, హైపరికం, జెల్సీమినియం, రుస్టాక్స్, యాసిడ్‌ఫాస్ వంటి మందులను వాడటంవల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అయితే మానసిక, శారీరక స్వభావాలను, లక్షణాలను బట్టి వీటిని నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి.,
హోమియోకేర్ ఇంటర్నేషనల్