అల్జైమర్స్‌కు ఆయుర్వేద పరిష్కారాలు..?
మా నాన్నగారి వయసు 68. గత ఆరునెలలుగా మతిమరపు ఎక్కువవుతోంది. డాక్టర్లు పరీక్ష చేసి అల్జైమర్స్ వ్యాధిగా అనుమానిస్తున్నారు. దీనికి ఆయుర్వేదంలో మంచి మందులు, ప్రక్రియలు సూచించ ప్రార్థన.
- నరసింహ, మెదక్
శిరస్సు ఎముకల సముదాయాన్ని పుర్రె అంటారు. దాని లోపలి పదార్థాన్ని మెదడు అంటారు. దీనినే ఆయుర్వేద పరిభాషలో కపాలం, మస్తిష్కం అనే పేర్లతో వ్యవహరిస్తారు. మెదడు క్రియలు లేదా కర్మలు అనేకం. అందులో మనోవ్యాపారాలు కూడా ఒకటి. మనసు నిర్వర్తించే ప్రధాన కర్మలు మూడు. అవి ‘ధీ, ధృతి, స్మృతి’. వాస్తవానికి మూడు శక్తులు. మేధాశక్తి, విషయ విజ్ఞానాలను పదిలపరచి భద్రంగా దాచుకునే శక్తి. దాగిన విషయాలను గుర్తుకు తెచ్చుకునే శక్తి. స్మృతి భ్రంశ లేదా స్మృతి నాశ అవస్థల్ని అల్జైమర్స్ వికారంగా సరిపోల్చుకోవచ్చు. మస్తిష్కంలోని కొన్ని కణాల క్రియా శైథిల్యమే ఈ వ్యాధికి సంప్రాప్తి. అనేక శారీరక, మానసిక వ్యాధులతోపాటు, వార్థక్యాన్ని కూడా దీనికి కారణం గా గమనించారు. రసాయనచికిత్సని ఆయుర్వేదం అభివర్ణించింది. రసాయన ద్రవ్యాలు అనేకరకాలు. ఇక్కడ వాడవలసినవి మస్తులుంగ పుష్టికర ఔషధాలు. వీటిన మేధ్య రసాయనాలంటారు. వీటిని వ్యాధిగ్రస్థులేగాక, ఆరోగ్యవంతులు, చిన్నపిల్లలు కూడా అనువైన మోతాదులో అనునిత్యం వాడుకోవచ్చు. దీనివల్ల మనస్సు తేజోవంతంగా, సునిశితంగా పనిచేస్తుంది. ఈ కింది సూచనల్ని, మందుల్ని ఆరునెలలపాటు క్రమం తప్పకండా వాడి ఫలితాన్ని సమీక్షించుకోండి.
ఆహారం: శాకాహారం, సాత్వికాహారం, ఆవుపాలు, ఆవునెయ్యి, ఉప్పు, కారం, మసాలాలు మానెయ్యాలి. బాదం, పిస్తా, ద్రాక్ష, దానిమ్మ మంచివి.
విహారం: తగినంత విశ్రాంతి, శ్రావ్య సంగీత వాయిద్యాలు, మధురమైన పాటలు ఉపయోగకరం. వీలును బట్టి ప్రాణాయామం మంచిది. మేధ్య రసాయన ద్రవ్యాలు: గోధుమ, ఆవుపాలు, ఆవువెన్న, ఆవునెయ్యి, ఓషధులలో బ్రాహ్మీ (సంబరేణు), మండూకపర్ణి (సరస్వతి), శంఖపుష్పి, అపరాజిత (దిరిశెన) ప్రశస్తమైనవి. మందులు: మహా పంచగవ్య ఘృతం: ఒక చెంచా మందుని నాలుగు చెంచాల ఆవుపాలలో కలిపి, రెండుపూటలా ఏదైనా తినటానికి ముందుగా తాగాలి స్మృతి సాగర రసమాత్రలు ఉదయం 1, రాత్రి 1 తిన్న తర్వాత వాడాలి. సారస్వతారిష్ట ద్రావకం-నాలుగు చెంచాల మందుకి సమానంగా నీళ్లు కలిపి రెండుపూటలా తాగాలి. స్వర్ణబ్రాహ్మి మాత్రలు రోజుకి-1.
గమనిక: మేధ్య రసాయన ఓషధులలో ఏవైనా ఒక దాని ఆకుల్ని శుభ్రం చేసి, దంచి, స్వరసం తీసి, మూడు చెంచాల మోతాదుని తేనెతో రెండుపూటలా సేవించాలి. దీనికి ఒక చెంచా ఆమలకీ (ఉసిరికాయ) స్వరసం కలిపితే ఇంకా మంచిది.
వసకొమ్ముని నీళ్లతో నూరి, ఆ ముద్దని రెండు చిటికెల (300 మి.గ్రా) తేనెతో వారానికి రెండుసార్లు నాకిస్తే మంచి మేధ్య రసాయనంగా పనిచేస్తుంది. (ఎక్కువైతే అది వాంతికరం)
ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో ‘ధారాచికిత్స’, మూత్రావస్తి అవసరాన్ని బట్టి అమలుపరిస్తే ఫలితం గణనీయంగా ఉంటుంది. ఇతర వ్యాధుల్ని గమనిస్తే, వాటికి కూడా సరియైన చికిత్స అవసరం.
డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్),
సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్