గౌట్స్ వంశపారంపర్యమా?
హోమియో కౌన్సెలింగ్
నా వయసు 38. మా నాన్న గౌట్ వ్యాధితో బాధపడుతుండేవారు. ఇటీవల నేను రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకున్నాను. అప్పుడు నా రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయులు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దాంతో నాకు కూడా గౌట్ వ్యాధి వస్తుందేమోనని ఆందోళనగా ఉంది. ఇది వంశపారంపర్యమా? హోమియోతో నయమవుతుందా?– బి. నర్సింహారెడ్డి, నల్లగొండ
మన రక్తంలో ఉండే యూరిక్ యాసిడ్ అనే రసాయనం ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కీళ్లలోకి చేరి, అక్కడ స్ఫటికంగా రూపొందుతుంది. ఆ స్ఫటికాలు ఎక్కువగా పేరుకుపోయినప్పుడు కీళ్లు వాచిపోయి కదలికలు కష్టంగా మారతాయి. దీన్నే గౌట్ లేదా గౌటీ ఆర్థరైటిస్ అంటారు. సాధారణంగా ఈ స్ఫటికాలు కాలి బొటన వేలి ప్రాంతంలో ఎక్కువగా ఏర్పడతాయి. దానివల్ల తీవ్రమైన నొప్పి, సలపరం, మంట, వాపు వస్తాయి. చిన్నపాటి కదలిక కూడా భరించలేనంత నొప్పిగా ఉంటుంది. ఇది పదే పదే వస్తుంటుంది. ఈ వ్యాధి కొన్నిసార్లు వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
కారణాలు: అధిక బరువు, వయసు పెరగడం, వంశపారంపర్యం కూడా కొన్ని కారణాలు. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం కూడా ఈ వ్యాధి రావడానికి ఒక కారణంగా చెప్పవచ్చు.
లక్షణాలు: ∙చాలామందిలో ఇది కాలి బొటనవేలితో ప్రారంభమవుతుంది. క్రమేపీ మోకాళ్లు, మడమలు, మోచేతులు, మణికట్టు, వేళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. సరైన చికిత్స తీసుకోకపోతే కీళ్లను పూర్తిగా దెబ్బతీస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది.
జాగ్రత్తలు: గొర్రె, మేక, బీఫ్ వంటివి తీసుకోకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, బీన్స్, పుట్టగొడుగుల వంటివి తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానివేయాలి.
చికిత్స: హోమియోలోని అధునాతనమైన కాన్స్‌టిట్యూషన్ చికిత్స ద్వారా గౌట్ వ్యాధిని శాశ్వతంగా నయం చేయడం సాధ్యమవుతుంది.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్‌సీఎండ్‌డి
హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్