పెళ్లికి జాతకం మాత్రమే ముఖ్యం కాదు..!
ఆత్మీయం
వివాహానికి తల్లిదండ్రులు తమ పిల్లల జాతకాలను చూపించుకుని, వాటికి సరిపోయే జాతకం ఉండే వధువును లేదా వరుడిని వెతుక్కోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఆచారం ఒకప్పుడు కొన్ని వర్ణాలకు మాత్రమే ఉండేది. ఇప్పుడది అన్ని వర్ణాలవారిలోనూ విస్తరిస్తూ వస్తోంది. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎంత వయసు వచ్చినా, అవతలి వారి జాతకం బాగాలేదని వంకలు పెడుతూ వచ్చిన సంబంధాలన్నింటినీ తిరగ గొట్టడం, తీరా పెళ్లి వయసు దాటిపోతుండగా అప్పుడు ఏదో ఒక సంబంధాన్ని ఖాయం చేసుకోవడం... ఆ తర్వాత ఇద్దరికీ మనసులు కలవక ఇబ్బందులు పడటం... సర్వసాధారణమై పోతోంది.
పెళ్లికి జాతకాలు చూపించడంలో తప్పులేదు కాని ఇతర అంశాలు అంటే వధువు లేదా వరుని ప్రవర్తన, ఉద్యోగం, కుటుంబ సంప్రదాయం, శీలం, నడత, రంగు, రూపు, విద్యార్హతలు అన్నింటికీ మించి ఆ సంబంధం తమ పిల్లలకు ఇష్టమా, కాదా అనేది విచారించకపోవడం... వీటితోపాటు ఇతర అంశాలు ఏవి నప్పకపోయినా సరే, జాతకాలు బాగున్నాయి కాబట్టి అన్నీ అవే సర్దుకుంటాయిలే అనే గుడ్డినమ్మకంతో వారిద్దరికీ ముడిపెట్టెయ్యడం సబబు కాదు. అదేవిధంగా పైన చెప్పిన అన్ని అంశాలు బాగుండి, వధూవరురిద్దరికీ ఒకరి పట్ల మరొకరికి సదభిప్రాయం, ఇష్టం ఉన్నప్పటికి కూడా కేవలం జాతకాలు కుదరలేదని వంకపెట్టి పెళ్లి ఆపేయటం కూడా సమంజసం కాదు. ఈ వాస్తవాన్ని తల్లిదండ్రులందరూ తెలుసుకున్నప్పుడే పెళ్లిళ్లు సకాలంలో అవుతాయి. కాపురాలు చల్లగా సాగుతాయి.