ఇల్లాలి చేతిలో ప్రపంచం భవిష్యత్తు | house of the future in the World | Sakshi
Sakshi News home page

ఇల్లాలి చేతిలో ప్రపంచం భవిష్యత్తు

Published Mon, Mar 27 2017 11:57 PM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM

ఇల్లాలి చేతిలో ప్రపంచం భవిష్యత్తు

ఇల్లాలి చేతిలో ప్రపంచం భవిష్యత్తు

‘ఒక మనిషి ఐదు పైసలు లంచం తీసుకుంటే తప్పా?’ ‘పెద్ద తప్పు కాదన్నా...’ ‘ఐదు కోట్ల మంది ఐదు పైసలు లంచం తీసుకుంటే తప్పా... కాదా?’ ‘పెద్ద తప్పే అన్నా...’ ‘అపరిచితుడు’ సినిమాలో ఈ డైలాగు...ఇప్పుడు మనం చెప్పుకునే విషయానికి సరిగ్గా సరిపోతుంది. ‘ఆడవాళ్లు ఇంట్లో కూరునే పెట్రోల్, గ్యాస్, కరెంటు ధరలు ఎలా తగ్గించవచ్చు’... అన్నదే మన టాపిక్‌. మామూలుగా చూస్తే ఇది నమ్మసాధ్యం కాదు. కాని లెక్కలేసి చూస్తే ఆశ్చర్యం... తేలికే అనిపిస్తుంది. కోటి ఇళ్లలో రోజుకు ఒక్క బకెట్టు నీరు ఆదా చేయగలిగితే,
పెద్ద చెరువే నిండిపోతుంది. కోటి మంది రోజుకు ఒక్క యూనిట్‌ కరెంటు ఆదా చేస్తే, ఒక పవర్‌స్టేషన్‌ అవసరమే ఉండదు.

కోటి మంది నెలలో ఒక్క లీటరు చొప్పున పెట్రోల్‌ వాడకం తగ్గిస్తే, ఆ ఖర్చుతో ఒక పల్లెటూరికి పెద్ద రోడ్డే నిర్మించొచ్చు.ఇవన్నీ అసాధ్యాలు అంటారా? ఇందుకోసం ఉద్యమాలు అవసరమంటారా? మీరొక్కరు తలుచుకుంటే చాలదా? మీకు, దేశానికి, మన చుట్టూ ఉన్న పర్యావరణానికి ఇది మంచిది కాదా? మీ చేతిలోనే ఉంది   ‘ప్రపంచం’ భవిష్యత్తు. పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నం మీ ఇంటి నుంచే మొదలుపెట్టండి.


కొంతకాలంగా మన దేశంలో జీవన ప్రమాణాలు బాగా మెరుగవుతున్నాయి. ప్రతి ఇంటిలో విద్యుత్, గ్యాస్, పెట్రోల్‌ వాడకం ఎక్కువయింది. ఒకప్పుడు విలాసం, ఇప్పుడు నిత్యావసరం. మన దేశంలో కూడా జనాభా తక్కువా? ఇంతమంది జనం ఇన్నేసి సౌకర్యాలు ఉపయోగించుకుంటుంటే ధరలు మాత్రం పెరగవా? కరెంటు బిల్లు, గ్యాసు, పెట్రోల్‌ రేట్లు పెరిగిపోతున్నాయని లబోదిబోమనే బదులు మనమంతా తలో చెయ్యి వేస్తే కొంతలో కొంత వినియోగం తగ్గదూ? ధరల మీద దాని ప్రభావం ఉండదూ? ఇదంతా ఎలా సాధ్యం అనే సందేహం అవసరం లేదు. ఈ గణాంకాలు చూస్తే మీకే అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాలలో కోటి 5 లక్షలకు పైగా గృహాలలో వంట గ్యాస్‌ వినియోగిస్తున్నారు. అంటే,  నెలకు ఇంచుమించు కోటి సిలిండర్లు అవసరం. సగటున రోజుకు మూడున్నర లక్షల సిలిండర్లు వినియోగం అవుతున్నాయి. ప్రతి ఇంటిలో గ్యాస్‌ వాడకం ఒక్క రోజు ఆదా చేస్తే అన్ని లక్షల సిలిండర్లు మిగిలిపోతాయి. విద్యుత్‌ విషయమే తీసుకోండి. తెలుగు రాష్ట్రాలలో విద్యుత్‌ వినియోగిస్తున్న ఇళ్ల సంఖ్య కోటిన్నర పైమాటే.

ప్రతి ఇంటిలో ట్యూబులైట్లు బదులు ఎనర్జీ సేవింగ్‌ లైట్లు ఉపయోగిస్తే, గంటకు 25 వాట్ల కరెంటు ఆదా అవుతుంది. అంటే నెలకు సుమారు 6 యూనిట్ల మేరకు కరెంటు బిల్లు తగ్గుతుంది. రోజుకు ఒక్క యూనిట్‌ కరెంటు ఆదా చేస్తే, రెండు రాష్ట్రాలలో 30 కోట్ల యూనిట్ల కరెంటు ఆదా అవుతుంది. రూపాయల్లో లెక్క వేస్తే ఇది 150 కోట్లు ఉంటుంది. ఫలితంగా 30 లక్షల టన్నుల బొగ్గు బూడిదయిపోకుండా ఆపగలుగుతాం. పర్యావరణ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం దీని ఫలితంగా 30 లక్షల టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ మనం పీల్చే గాలిని కలుషితం చేయకుండా ఉంటుంది. ఈ లెక్కల సంగతి సరే. ఇందుకు మీ ఇంట్లో మీరేం చేయవచ్చో చూడండి.

పెట్రోల్‌ ధరలు కంట్రోల్‌ చేయండి
ఇంధన వినియోగం ఒకప్పుడు నాగరకతకు చిహ్నం. కాని ఇప్పుడు ఇంధనం మన ధనాన్నే కాదు, మన ఆరోగ్యాన్ని కూడా మింగేస్తోంది. వాతావరణంలో కాలుష్యం ఎంతగా పెరిగిపోయిందంటే, దాని నుంచి తప్పించుకోవడం కొన్ని తరాల వరకూ సాధ్యం కాకపోవచ్చు కూడా. ఈ తప్పు పెట్రోల్, డీజిల్‌ వంటి ఇంధనాలది కాదు. కచ్చితంగా వాటిని వాడే మనదే. పెట్రోల్, దానికి అనుబంధమైన పెట్రోలియం ఉత్పత్తులు లేకుండా మనం బతకలేని పరిస్థితి ఇప్పుడుంది. మనం వాడే ఆయింట్‌మెంట్లలో, ఫెయిర్‌నెస్‌ క్రీముల్లో, మెడిసిన్స్‌లో, టూత్‌ పేస్టుల్లో, షేవింగ్‌ క్రీముల్లో, ఆఖరికి ఆహారాన్ని పండించానికి ఉపయోగించే ఎరువుల (ఫెర్టిలయిజర్స్‌)లో  కూడా పెట్రోలియం ఉత్పత్తులు వాడనిదే పని గడవదు. పైగా అవన్నీ ఎక్కడో ఉత్పత్తి అయి మనమున్న చోటుకు రవాణా కావాలంటే, మళ్లీ పెట్రోల్, డీజిల్‌ ఉపయోగించే వాహనాలు వాడాల్సిందే.

అడుగు తీసి అడుగేస్తే పెట్రోల్‌ కావాలి. ఎనర్జీ ఎకనామిక్స్‌ ఒక పెద్ద శాస్త్రం. కాని దాని సారాంశం ఒక్కటే. మనం వాడినంత తేలికగా భూమిలో చమురు ఉత్పత్తి కాదు. ఒక చమురు నిక్షేపం ఏర్పడాలంటే పది వేల సంవత్సరాలకు పైగా పడుతుందన్నది వాస్తవం. ఇప్పటికున్న చమురు నిక్షేపాలు మన అవసరాలకు సరిపోవు గనుకనే పెట్రోల్‌ ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. చమురు ఛార్జీలు మన జేబులకు చిల్లులు పడకుండా ఉండాలన్నా, కాలుష్యాన్ని పెంచకుండా కాపాడాలన్నా వాటి మీద వీలనయింత తక్కువగా ఆధారపడటమే శ్రేయస్కరం. ఈ చిట్కాలు చూడండి.
⇒ఇంధన వాడకం తగ్గించి, శారీరకమైన ఎనర్జీని ఎక్కువ ఉపయోగించండి. మార్కెట్లకు స్కూటర్ల మీద వెళ్లడం కంటే, నడిచి వెళ్లడం అలవర్చుకోవచ్చు. ఒకరకంగా ఇంధనం ఆదా అవుతుంది, మీ శరీరానికి మంచి వ్యాయామం కూడా అవుతుంది.  పెట్రోలియం ఉత్పత్తులను సాధ్యమైనంత వరకూ తగ్గించి హెర్బల్‌ ఉత్పత్తుల వాడకాన్ని అలవర్చుకోండి.
∙ప్లాస్టిక్‌ బ్యాగ్స్‌ల వల్ల మీ పర్యావరణానికి ఎంతటి ముప్పు ఉందో గ్రహించండి. ప్లాస్టిక్‌ బ్యాగ్స్‌ (క్యారీ బ్యాగ్స్‌) వంటివి అస్సలు వాడకుండా జాగ్రత్తపడండి.
⇒సింథటిక్‌ డ్రస్సులు, డోర్‌ కర్టెన్ల బదులు కాటన్‌ ఉత్పత్తులను వాడగలరేమో చూడండి.
⇒తరచు షాపింగ్‌ చేయడం కంటే, వారానికో, నెలకో ఒక్కసారి సరుకులు తెచ్చుకునే అవకాశాలు పరిశీలించండి.
⇒సాధ్యమైనంత వరకూ సొంత వాహనాలు వాడకుండా కమ్యూనిటీ రవాణా మార్గాలను ఆశ్రయించండి.

ఇంకా చాలా చేయవచ్చు..
ఇంట్లో ఇల్లాలు మాత్రమే సంకల్పించి చేయగల పనులే ఇవన్నీ. అయితే, పర్యావరణం కోసం గృహిణులు ఇంకా చాలా పనులు చేయవచ్చు. ఇళ్లలో నీళ్లను పొదుపుగా వాడటం, బాత్‌రూములలో లీకేజీలను తగ్గించడం, సాధ్యమైనంతవరకూ ఎండ వేడమిని ఎనర్జీగా వాడుకోవడం, కాగితాల వాడకం తగ్గించి చెట్లకు, దరిమిలా అడవులకు మేలు చేయడం, పెన్సిళ్ళూ, పెన్నులు పడేయకుండా పూర్తిగా వాడుకునే అలవాటును పిల్లలకు నేర్పడం, ప్లాస్టిక్‌ వస్తువులను సాధ్యమైనంత వాడకపోవడం... లాంటి మరెన్నో పర్యావరణానికి మేలు చేసే పద్ధతుల్ని పాటించవచ్చు. మీ ద్వారా మీ చిన్నారులకు పర్యావరణం మీద స్పృహ కలిగించగలరు మీరు. తద్వారా భావితరాన్ని ప్రకృతి ప్రేమికులుగా మార్చగలరు మీరు. కాదంటారా?

గ్యాస్‌ రేట్లు తగ్గించండిలా...
⇒గ్యాస్‌ స్టవ్‌ ముందుగా వెలిగించి వంటకు కావలసిన పాత్రలు, కూరగాయలు సిద్ధం చేసుకోవడం కొందరి అలవాటు. అలా కాకుండా, అన్నీ రెడీగా ఉంచుకున్న తరువాతే గ్యాస్‌ స్టవ్‌ వెలిగిస్తే, చాలావరకు గ్యాస్‌ ఆదా అవుతుంది.
⇒కందిపప్పు వంటివి ఉడికించడానికి చాలా టైమ్‌ పడుతుంది. వాటిని అరగంట ముందు నీటిలో నానబెడితే పది నిమిషాల్లో ఉడికి పోతుంది.
⇒ఇంటాయన ఉదయం రెండుమూడుసార్లు కాఫీలూ, టీలు అని సతాయించొచ్చు. అన్నిసార్లు కాఫీలు, టీలు కాచే బదులు ఒక్కసారి రెడీ చేసి ఫ్లాస్కులో ఉంచితే గ్యాస్‌ మిగులుతుంది. మీకు శ్రమ తప్పుతుంది.
⇒అన్నం స్టవ్‌ మీద వార్చకుండా, రైస్‌ కుక్కర్‌ ట్రై చేయండి. అలాగే, పాత కుక్కర్లలో లీకేజీ లేకుండా జాగ్రత్త పడితే స్టీమ్‌ వేస్టు కాకుండా అన్నం త్వరగా ఉడుకుతుంది.
⇒వేపుళ్లకు ఆయిలు, గ్యాసూ రెండూ ఖర్చు. పైగా కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది కూడా. అందుకే వాటిని తగ్గించి, ఫ్రూట్స్, వెజిటబుల్‌ సలాడ్స్‌ కూడా మీ మెనూ లో చేర్చి చూడండి. మీ ఆరోగ్యానికి అవి కచ్చితంగా మేలే చేస్తాయి.
⇒డీప్‌ ఫ్రిజ్‌లో ఉంచిన పాలు, మాంసం వంటివి వెంటనే స్టవ్‌ మీద వేడిచేయకుండా, ముందు కొద్దిసేపు వాటిని మామూలు వాతావరణంలో ఉంచండి.

ఇలాంటి ఎన్నో చిట్కాలున్నాయి. అవి మీకు తెలిసే ఉంటాయి. అవన్నీ ప్రయోగించి చూడండి. కాని ఒక్కటే లక్ష్యంగా పెట్టుకోండి. వంట గ్యాస్‌ వినియోగం తగ్గించాలి. అందుకోసం ఏదైనా చేసి తీరాలి. తెలుగు రాష్ట్రాలలో ఆడవారంతా నెలలో ఒక్క రోజు గ్యాస్‌ వాడకాన్ని ఆదా చేయగలిగితే, సుమారు 15 కోట్ల రూపాయలు ఆదా అయినట్లే. ఆడవారు తలుచుకుంటే ఈ పొదుపును ఎంతయినా పెంచగలరు.

కరెంటు భారం తగ్గే కిటుకులు
⇒ముందు మీరు వాడే వస్తువులు ఎంతెంత కరెంటు ఖర్చు చేస్తున్నాయో లెక్క వేయండి. ఇంట్లో సాధ్యమైనంత వరకూ ఎనర్జీ సేవింగ్‌ లైట్లు వాడండి. ఈ లైట్ల ధర ఎక్కువే. కాని అవి వాడిన ఫలితం మీ నెలసరి కరెంటు బిల్లులో కచ్చితంగా కనిపిస్తుంది.
⇒అవసరం లేని చోట్ల లైట్లు, ఫ్యానులు స్విచాఫ్‌ చేయండి. గీజర్ల వాడకం తగ్గించండి.
⇒టీవీలు ఆన్‌ చేసి వేరే పనులు చూసుకోవడం, రాత్రి వేళల్లో టీవీలు చూస్తూ నిద్రపోవడం లాంటివి చేయకండి. అలాగే, టీవీలను బేబీసిట్టర్లుగా చేసి మీ పిల్లలకు ఎక్కువ అలవాటు చేయకండి. వినోదానికి కచ్చితమైన టైమ్‌ షెడ్యూల్‌ పాటించేంత క్రమశిక్షణ మీ ఇంట్లో అలవర్చ వచ్చేమో ట్రై చేయండి.
⇒ ఫ్రిడ్జ్‌ తలుపులు ఎక్కువ సేపు తెరిచి ఉంచితే ఎక్కువ కరెంటు కాలుతుంది. అందువల్ల ఫ్రిడ్జ్‌ తీసి ఆలోచించడం మాని పనవ్వగానే డోర్స్‌ క్లోజ్‌ చేయండి. మీ ఇంట్లో వాళ్లకి కూడా దానిని అలవర్చండి. ఫ్రిడ్జ్‌ థర్మోస్టాట్‌ సరిగ్గా పనిచేసేలా తరచు సర్వీసింగ్‌ చేయించండి. కరెంటు తగ్గించడానికి మీ ఇంట్లో ఎంత అవకాశముందో ఒకసారి కాగితం మీద రాసుకుని చూడండి. అవన్నీ మీరు ఆచరిస్తూ, ఇంట్లో అందరూ పాటించేలా చేయం డి. తెలుగు రాష్ట్రాలలో కోటి మందికి పైగా గృహ విద్యుత్‌ వినియోగదారులున్నారు.

అంతా కలిసి కోటి యూనిట్ల కరెంటు ఆదా చేయగలిగితే, ఆర్థికంగా రూ. 5 కోట్ల కరెంటు ఖర్చు ఆదా అయినట్లే. కరెంటు ఉత్పత్తి కోసం జలవనరులను, బొగ్గును ఉపయోగించాల్సి ఉంది.కరెంటు ఉత్పత్తి వల్ల లక్షల టన్నుల కార్బ న్‌ డయాక్సైడ్‌ గాలిలో కలుస్తుంది. కలుషితం చేస్తుంది. ప్రకృతి వనరుల్ని మనం ఉత్పత్తి చేయలేము. ఉన్నవాటిని  జాగ్రత్తగా వినియోగించుకోవడమే బాధ్యతగల పౌరులుగా మనం చేయగలిగింది. కొంత సామాజిక స్పృహ,ప్రకృతి మీద ప్రేమ కూడా మనకుండాలి.
– సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement