షాపింగ్.. మాయలో పడకండి!
పొదుపు
‘అబ్బా మూడ్ బాగోలేదు... అలా షాపింగ్‌కి వెళదామా’ అన్న మాట ఎవరో ఒకరిదగ్గర వినే ఉంటారు. పార్కులకెళ్లినంత తేలిగ్గా షాపింగ్ వెళుతున్న రోజుల్లో ఉన్నాం మనం. దీనివల్ల మనం ఎంత నష్టపోతున్నామో తెలుసుకోకపోతే పొదుపుని ఆచరణలో పెట్టడం చాలా కష్టం.
షాపింగ్ అనే పదం పలికే ముందు అవసరాలకు, విలాసాలకు తేడా తెలుసుకోకపోతే మీ పర్సుకి ఒక పక్క చిల్లు పడ్డట్లే.షాపింగ్‌కి వెళ్లేముందు మీకు అవసరమైన వస్తువుల లిస్టు చేతిలో పెట్టుకోండి. మాల్‌లో కనిపించే కొత్త వస్తువులకు ఆకర్షితులై వెంటనే కొనేయకుండా కాసేపు దాని అవసరం గురించి ఆలోచించండి.
క్రెడిడ్‌కార్డుతో షాపింగ్ చేసేటప్పుడు చాలామంది మహిళలు చేతిలో డబ్బులు పెట్టడం లేదు కదా! అనుకుంటారు. క్రెడిట్‌కార్డు డబ్బులు తిరిగి చెల్లించేటప్పుడు అయ్యో... ఇంత ఖర్చు అయిపోయిందా... అని వాపోతుంటారు. ఎంతో ముఖ్యమైన వస్తువులకే క్రెడిట్‌కార్డుని ఉపయోగించడం ఉత్తమం.
రోజుకో కొత్త వస్తువుని పరిచయం చేస్తున్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు ఆకర్షితులవుతున్న అమ్మాయిలు అంతే వేగంగా వస్తువుల్ని మార్చేస్తున్నారు. ఉదాహరణకు సెల్‌ఫోన్లు, ఐప్యాడ్‌లు...అప్‌డేట్ అవుతున్నప్పుడల్లా షాపింగ్ అంటున్నారు. స్నేహితులకు పోటీగా షాపింగ్ చేయడంవల్ల చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
చాలాసార్లు మాల్స్‌కి వెళ్లాక కనిపించిన కొత్తవస్తువులపైకి మనసుపోయి కొనాల్సిన వస్తువుల లిస్టుని మరచిపోతుంటారు. వాటి వల్ల ప్రయోజనం ఉంటుందా అంటే కొన్ని సందర్భాల్లో వాటి వాడకం కూడా ఉండదు. ముఖ్యంగా కిచెన్ వస్తువుల్ని కొనేస్తుంటారు. ఒకటి రెండుసార్లు వాడి పక్కన పెట్టేస్తారు. షాపింగ్‌లో సరిగ్గా పొదుపు చేయగలిగితే మీ సంపాదన రోజురోజుకీ పెరుగుతున్నట్టే లెక్క.
- సుజాత బుర్లా, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ అండ్ ఫండ్ మేనేజర్