క్రెడిట్ కార్డు.. డెబిట్ కార్డు..
డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులకు మధ్య వ్యత్యాసం ఉంటుంది. డెబిట్ కార్డులు, ఏటీఎం కార్డులు మన బ్యాంకు ఖాతాలకు అనుసంధానమై ఉంటాయి. నగదు విత్‌డ్రాయల్ మొదలైన వాటికి ఏటీఎం కార్డులు ఉపయోగపడతాయి. డెబిట్ కార్డులు షాపింగ్‌కి కూడా ఉపయోగపడతాయి. ఇవి మన ఖాతాలతో ముడిపడి ఉంటాయి కాబట్టి.. అకౌంట్లో డబ్బు ఉంటేనే వీటిని వాడటానికి వీలుంటుంది.
ఇక క్రెడిట్ కార్డుల విషయానికొస్తే.. ఇవి మన పొదుపు ఖాతాలతో అనుసంధానమై ఉండవు. వీటితో చేసే కొనుగోళ్లు బ్యాంకు నుంచి అప్పు తీసుకుని కొన్నట్లే. మన ఆదాయం వంటి అంశాల ఆధారంగా బ్యాంకులు నిర్దిష్ట మొత్తానికి ఈ కార్డులను ఇస్తాయి. వీటితో చేసే కొనుగోళ్ల మొత్తాన్ని తిరిగి కట్టేందుకు ఒక గడువంటూ ఉంటుంది. ఆలోగా మొత్తం కట్టేస్తే ఎలాంటి వడ్డీలు, పెనాల్టీలు ఉండవు. మొత్తం కట్టలేని పక్షంలో మినిమం అమౌంట్ అని కొంతైనా కట్టుకునే వెసులుబాటు ఉంటుంది.
అయితే, గడువులోగా కట్టకపోతే పెనాల్టీ ఉంటుంది. కొంత కొంత చొప్పున కట్టుకుంటూ వెడితే వడ్డీ కూడా ఉంటుంది. ఇక, ఇదే కాకుండా క్రెడిట్ కార్డును ఉపయోగించి ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసుకుంటే.. ఆ రోజు నుంచే వడ్డీ లెక్కింపు మొదలైపోతుంది.