సోయగాల బాల్కనీ...
అపార్ట్‌మెంట్ల సంస్కృతి వచ్చాక బాల్కనీ అనే పదం విపరీతంగా వాడుకలోకి వచ్చింది. కిచెన్, బెడ్‌రూమ్ లేదా హాల్‌కి ఒక్క బాల్కనీ కూడా లేకపోతే ఆ ఇల్లు ఎంత అద్భుతంగా ఉన్నా తీసికట్ట్టే. అయితే చాలామంది ఇళ్లలో గాలి, వెలుతురు కోసమే బాల్కనీ అన్నట్టుగా ఉంటుంది. ఇంకొంతమంది పాత వస్తువులు వేయడానికో, అడ్డుగా ఉన్నాయనుకున్న వస్తువులను చేర్చడానికో బాల్కనీని ఉపయోగిస్తుంటారు. ముఖానికి కళ్లు ఎంత అందమో, ఇంటికి బాల్కనీ అంత అందం. ఎడారిలా తలపించే ఇళ్ల మధ్య బాల్కనీని ఉన్నంతలో ఔట్‌డోర్ ఒయాసిస్‌గా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం...
కొన్ని బాల్కనీలను లైట్‌వెయిట్‌గా, మిగిలిపోయిన సామగ్రితో పనికానిచ్చేశాం అన్నట్టుగా ఇంటినిర్మాణంలో భాగంగా ముగించేస్తారు. అందుకే ముందుగా నిర్మాణరంగ నిపుణుడితో బాల్కనీ ఎంత పటిష్టమైనదో చెక్ చేయించుకోవాలి.
ఉన్న స్థలంలో ఎండ, వాన, చలి కాలాలకు అనువుగా ఉండేలా మలచుకోవాలి. రోజులో ఎంత సేపు బాల్కనీలో గడుపుతారో లెక్కించుకోవాలి. ఆ సమయాన్ని బట్టి సిట్టింగ్, లైటింగ్, మిడిల్ గ్రౌండ్, బ్యాక్‌గ్రౌండ్.. ఇవన్నీ పరిశీలించుకోవాలి.
అన్ని కాలాలకు తట్టుకునేలా మొక్కలు పెట్టుకోవడానికి అనువైన కుండీలను ఏర్పాటు చేసుకోవాలి. కుండలలోని మట్టి, నీరు బయటకు రాకుండా జాగ్రత్తపడాలి.
బాల్కనీ మొక్కలకు వర్షపు నీరు అందదు. నీటిపాత్రతో పోయడం వల్ల నీరు, మట్టి బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంతో బాల్కనీని మెయిన్‌టెయిన్ చేయడం కష్టం అవుతుంది. దీనికి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి చక్కని మార్గం.
బాల్కనీ డిజైన్‌కు సంబంధించిన పరికరణాలను నిల్వ ఉంచుకోవడం మరిచిపోవద్దు. మరీ గాడీగా కాకుండా బాల్కనీని ఉపయుక్తంగా మార్చుకుంటే చూపులకు ఆహ్లాదంగానూ ఉంటుంది.
టై గార్డెన్, ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్ నిపుణులతో మాట్లాడి బాల్కనీని అందంగా మార్చుకునే సలహాలను పొందవచ్చు.
ఎంత చిన్న బాల్కనీ అయినా మనసుకు ఆహ్లాదంగా, అవసరానికి ఉపయుక్తంగా మార్చుకుంటే కంటికి కాటుక ఇచ్చిన అంత అందం ఇంటి సొంతం అవుతుంది.