నోరు మంచిదైతే ‘ఊరు’ పేదదైతేనేం?
ప్రపంచ ప్రసిద్ధ చైనీస్ ఆర్టిస్ట్ హువాంగ్ జో విషయంలో అలాగే జరిగింది. హెమి ప్రావిన్స్‌లోని ఒక పేద పల్లెలో పుట్టాడు. నలుగురితో మంచిగా మాట్లాడడం మాత్రమే తెలిసిన ‘జో’ పెద్దల దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకునేవాడు. అందులో కళాసంస్కృతులకు సంబంధించిన విషయాలు చాలా ఎక్కువ. అందుకే ఆయనకు తన ఊరు ఎప్పుడూ పేదగా కనబడలేదు. సంస్కృతి, కళలతో అది సంపన్నంగా ఉన్నట్లు తోచేది.
ఆర్టిస్ట్ హన్ లెరన్ నుంచి సంప్రదాయ చైనీస్ చిత్రకళను నేర్చుకున్నాడు జో. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో పనిచేసిన ‘జో’ ఆ కాలం నాటి జీవితాలను రికార్డ్ చేశాడు. వెస్ట్రన్ స్కెచింగ్ స్కిల్స్‌ను సంప్రదాయ చైనీస్ చిత్రకళతో కలిపాడు. దానికి విపరీతమైన స్పందన వచ్చింది. చైనా సమాజంలోని సామాన్యుడి జీవితంలోని అనేకానేక ఘట్టాలను, ఆకర్షణీయ దృశ్యాలను ఈ పెయింటింగ్స్ అద్దం పడతాయి.
ప్రకృతికి, మనుషులకు మధ్య ఉండే అనుబంధాన్ని ఆ చిత్రాలు కవితాత్మకంగా వర్ణిస్తున్నట్లుగా ఉంటాయి.
చిత్రకళ అంటే ‘జో’కు ఎంత ఇష్టమంటే ఏ ఒక్కరోజూ ఆయన పెయింటింగ్ చేయకుండా ఉండలేదు. తీవ్ర అనారోగ్యంగా ఉన్న కాలంలో కూడా ఏదో ఒక బొమ్మ వేస్తూనే ఉండేవాడు. ప్రాక్టీస్ స్కెచ్‌లతో ఆయన దగ్గర ఉండే సంచి ఎప్పుడూ నిండిపోయి ఉండేది.
‘‘చరిత్ర మీద పట్టు ఉండడం కూడా ఆయన చిత్రాలు విజయవంతం కావడానికి ఒక కారణం’’ అంటాడు ‘సగం శిష్యుడు సగం స్నేహితుడు’ అనే పేరు ఉన్న జోంగ్సియాంగ్.
కేవలం చిత్రాలు వేయడమే కాకుండా ప్రాచీన కళాకృతులను సేకరించడంతోపాటు కళాసంఘాల నిర్మాణానికి కూడా తన వంతు ప్రయత్నం చేసిన ‘జో’ పాత చైనా, కొత్త చైనాలకు ఒక సాక్షిలా నిలిచాడు.
ప్రస్తుతం ‘జో’ గీసిన కొన్ని చిత్రాల వేలం బీజింగ్‌లో జరుగుతోంది.