
‘నేషనల్స్‌లో గోల్డ్ మెడల్ నా లక్ష్యం’ అన్నాడు ఈశ్వరాదిత్య. ‘ఒలింపిక్స్‌లో ఇండియాని రిప్రెజెంట్ చేయడమే నా కల’ అన్నాడు బిందుసాయి. ఈ హైదరాబాద్ అన్నదమ్ముల్లో... అన్న పిస్టల్‌తో టార్గెట్‌కి గురి పెడితే.. తమ్ముడు రైఫిల్ ఎక్కుపెడతాడు. ఈ పిల్లలు ప్రాక్టీస్ చేస్తుంటే... పేరెంట్స్ వాళ్లకోసం నోట్స్ ప్రిపేర్ చేస్తారు. ‘అంకిత భావం ఉంటే స్పోర్ట్స్ పర్సన్స్ తయారు కావడం కష్టమేమీ కాదు’ అంటున్నారు తల్లి శిల్ప.
‘‘బండ్లగూడలోని డాన్‌బాస్కో స్కూల్లో పెద్దబాబు నైన్త్, చిన్నవాడు సెవెన్త్ చదువు తున్నారు. పిల్లల్ని ఎప్పుడూ ఏదో ఒక యాక్టివిటీలో బిజీగా ఉంచాలనేది నా కోరిక. వాళ్లకు ఇష్టమైన ఆటల్లోనే ట్రైనింగ్ ఇప్పించాం. మొదట్లో ఇద్దరికీ కరాటే నేర్పించాం. బ్లాక్ బెల్ట్ లెవెల్‌కి చేరిన తర్వాత స్కేటింగ్, స్విమ్మింగ్, వాలీబాల్, షటిల్‌లో ట్రైనింగ్ ఇప్పించాం. చిన్నప్పుడు ఇద్దరూ ఎన్ని గన్‌లు కొనిపించుకున్నారో లెక్క చెప్పలేను కూడా. అయినా సరే... దానిని పిల్లల ఇంటరెస్ట్ గేమ్ అని అప్పుడు డిసైడ్ చేయలేం. కనీసం పదేళ్లు నిండిన తర్వాత వాళ్లు చూపించే ఆసక్తే అసలైనది. ఆ వయసులో షూటింగ్ మీద ఆసక్తి కనబరిచారు. గగన్‌నారంగ్ అకాడమీలో చేర్చాం. కానీ కొనసాగించడం కుదరలేదు. ఇంటికి వచ్చి నేర్పించడానికి ఒక కోచ్ ఉప్పల్ నుంచి వచ్చేవారు.
రెగ్యులర్‌గా మేముండే బండ్లగూడ వరకు రావడం అతడికి కష్టం కావడంతో కంటిన్యూ కాలేకపోయారాయన. దాంతో ఆయన నేర్పించిన మెళకువలతో ఇంట్లోనే ప్రాక్టీస్ చేయిస్తూ కొత్త కోచ్‌ల కోసం ప్రయత్నించాను. ఈ క్రమంలో షూటింగ్ మీదున్న పుస్తకాలు చదివాను, వీడియోలు చూశాను. నాకు సబ్జెక్టు మీద పట్టు వచ్చేసింది. మా పిల్లలు ఎక్కడ పొరపాటు చేస్తున్నారో గమనించి, వాళ్లకు వీడియోలో ఆ పార్ట్ వరకు బాగా అబ్జర్వ్ చేయమని చెప్పేదాన్ని. గచ్చిబౌలిలో ఎక్స్‌పర్ట్ కోచ్ దగ్గర చేర్చే వరకు పిల్లలకు నేను బ్రిడ్జి కోచ్‌నయ్యాను. పెద్దవాడు ఈశ్వరాదిత్య పిస్టల్ షూటింగ్‌ను కంటిన్యూ చేశాడు. చిన్నవాడు బిందు సాయి మాత్రం రైఫిల్ షూటింగ్‌కి మారతానన్నాడు. సాయికి రైఫిల్ షూటింగ్ కోసం ధరించే డ్రస్ మీదనే మోజెక్కువ’’ అన్నారు శిల్ప నవ్వుతూ.
‘‘పిల్లలిద్దరూ స్టేల్ లెవెల్ దాటి జాతీయ స్థాయికి అర్హత సాధించారు. ‘నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ గత ఏడాది త్రివేండ్రంలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలో ఈశ్వరాదిత్యకి 522 స్కోర్ వచ్చింది. రానున్న డిసెంబర్‌లో జరిగే పోటీలకు ప్రిపేరవుతున్నాడు. భోపాల్‌లో ఈ ఏడాది జరిగిన ‘స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ జాతీయ స్థాయి పోటీల్లో పెద్ద బాబు 359 స్కోర్, బిన్న బాబు 369 స్కోర్ చేశారు. స్పోర్ట్స్ ట్రైనింగ్‌లో ఉన్న పిల్లలు ప్రత్యేకమైన డైట్ చార్ట్ ఫాలో కావాలి. అలాగే కాంపిటీషన్‌లకు వెళ్లడానికి వారం ముందు నుంచి బయటి ఫుడ్‌ను ముట్టుకోకూడదు’’ అని చెప్పారు శిల్ప. కాంపిటీషన్‌ల కోసం ఒక్కోసారి వారం రోజుల పాటు స్కూల్ మిస్సవుతారు. అప్పుడు వేరే స్టూడెంట్స్ నోట్స్‌ని జిరాక్స్ చేయించేవారు శిల్ప. ఆమె చెప్పినట్లు క్రీడాకారులను తీర్చిదిద్దడం శ్రమతో కూడిన పనే కానీ అసాధ్యం కాదని, ప్రతి విజేతా నిరూపిస్తూనే ఉన్నారు.
– వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి
తల్లి త్యాగమే గొప్పది
పిల్లల ప్రాక్టీస్‌కి అవసరమైన డబ్బు సర్దుబాటు చేయడం వరకే నా బాధ్యత. పిల్లల కోసం శిల్ప కొన్నేళ్లపాటు వెకేషన్ లేకుండా తనను తాను త్యాగం చేసుకుంది. వేసవి సెలవుల్లో ఉదయం ఎనిమిది గంటలకే పిల్లలిద్దరినీ రెడీ చేసి, వంట చేసి, రోజు మొత్తానికి అవసరమైన ఫుడ్ సర్దుకుని తను రెడీ అయిపోయేది. ముగ్గురినీ హైదరాబాద్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ప్రాక్టీస్‌కి వదిలి నేను ఆఫీస్‌కి వెళ్లేవాడిని. సాయంత్రం నాలుగున్నర వరకు పిల్లలు ప్రాక్టీస్ చేసేవాళ్లు. అప్పుడు ఇంటికి వస్తే మళ్లీ ఇంటి పనులు. రాత్రి వరకు తనకు ఖాళీ ఉండేది కాదు. పైగా ఇది ఖర్చుతో కూడిన ప్రాక్టీస్. నాకు ఇబ్బందేమీ లేదని చెప్తున్నా సరే... ఇంటీరియర్ వర్క్‌ను కొద్దికాలం పోస్ట్‌పోన్ చేద్దాం. ఇప్పుడున్న వసతులు చాలనేది.
– యుగేంద్ర కుమార్ గుంటూరి
రోజూ ప్రాక్టీస్ చేయాల్సిందే
షూటింగ్ ప్రాక్టీస్ రోజూ చేయాల్సిందే. వెకేషన్‌కు వెళ్లినప్పుడు నాలుగు రోజులు గ్యాప్ వస్తే ఐదో రోజు పిస్టల్, రైఫిల్ పట్టుకున్నప్పుడు చేయి వణుకుతుంది. అందుకే కాంపిటీషన్‌లకు వెళ్లినప్పుడు కూడా హోటల్ రూమ్‌లో అయినా సరే గంట– రెండు గంటల పాటు హోల్డింగ్ ప్రాక్టీస్ చేయాలి. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండటానికి రోజూ సూర్యనమస్కారాలు, గుంజిళ్లు, మెడిటేషన్ చేయాలి. వెపన్ కంట్రోల్ కోసం డంబుల్స్‌తో ప్రాక్టీస్ చేయాలి. షూటింగ్ ప్రాక్టీస్‌లో పిల్లల్లో వచ్చే పరిణతిని నేను దగ్గరగా గమనించగలిగాను. లక్ష్యం మీద ఎక్కువ సమయం దృష్టి పెట్టినప్పుడు చూపు చెదురుతుంది. అలాంటప్పుడు ఆందోళన చెందకుండా పక్కన కూర్చుని మామూలైన తర్వాత మళ్లీ ఎక్కుపెట్టడం వంటివి అలవడ్డాయి. ఈ ఆటలో ఎవరికి వారే ప్రత్యర్థి. తమతో తామే పోటీ పడాలన్నమాట. ఇది గుడ్ షాట్, ఇది బ్యాడ్ షాట్ అనేది ఉండదు. ప్రతి షాట్ నుంచి నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఈ ఆటతో పిల్లల్లో స్థితప్రజ్ఞత వస్తుంది.
– శిల్ప
Comments
Please login to add a commentAdd a comment