నేను ప్రొస్టేట్‌ని | I am Prostate | Sakshi
Sakshi News home page

నేను ప్రొస్టేట్‌ని

Published Wed, Mar 16 2016 10:24 PM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM

నేను  ప్రొస్టేట్‌ని

నేను ప్రొస్టేట్‌ని

ఆనంద్ శరీరంలో నేనో కీలక భాగాన్ని. ఆక్రోటు (వాల్‌నట్) పరిమాణంలో ఉంటాన్నేను. నేను అతడి ప్రొస్టేట్‌ను (పౌరుష గ్రంథిని) ఒక్కోసారి ఆనంద్‌ను బాగా ఇబ్బంది పెట్టేస్తుంటాను. రాత్రివేళ మంచి నిద్రలో ఉండగా అతడికి మెలకువొచ్చేలా చేస్తాను. పాపం ఆనంద్... రాత్రివేళ నా కారణంగా పదేపదే బాత్‌రూమ్‌కు వెళ్లాల్సి వస్తుంది. పరిస్థితి వికటిస్తే, మూత్రం ద్వారా పోవలసిన కాలుష్యాలు రక్తంలో కలిసేలా చేయడం ద్వారా యురేమిక్ పాయిజనింగ్‌కు దారితీసి అతడి మరణానికి కూడా కారణమవుతాను. ఇందుకు నేనేమీ చేయలేను. ప్రకృతే నన్ను అలా తయారు చేసింది. వయసు మీరాక నాతో కొన్ని ఇబ్బందులు ఉన్నా, నాలో చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. ఆనంద్ శృంగార జీవితంలో ముఖ్య పాత్రనే పోషిస్తాను. ఇంకా నా ఘనతని చెప్పుకోకూడదు గానీ, మానవజాతి మనుగడే చాలావరకు నాపై ఆధారపడి ఉంది.

వెన్ను ఆదేశిస్తుంది... నేను పాటిస్తాను...
ఆనంద్ పొత్తికడుపులో అతడి మూత్రాశయానికి దిగువ ఉంటాన్నేను. ఆనంద్ యుక్తవయస్సులోకి వచ్చేంత వరకు కేవలం బాదంగింజ పరిమాణంలో ఉంటాను. అతడి మిగిలిన శరీరంతో పాటే నేను కూడా క్రమంగా ప్రస్తుత పరిమాణానికి పెరుగుతాను. ఆనంద్ బాల్యస్థితిని వీడి యువకుడిగా మారినప్పుడు అతడి శరీరంలో విడుదలయ్యే హార్మోన్ల ద్వారా నాకు సంకేతం అందుతుంది. అప్పటికి నేను పూర్తి ఆకారాన్ని సంతరించుకుని ఉంటాను. నాలోని కండరాలతో వేరుశనగ గింజల పరిమాణంలో నిర్మితమైన సంచుల్లో వీర్యద్రవం తయారవడం అప్పుడే మొదలైంది. ఆనంద్‌లో లైంగికోద్రేకాలు కలిగినప్పుడు నాలోని ద్రవాన్ని ఎలా ఖాళీ చేయాలో నాకు తెలీదు. అలాంటప్పుడు ఆనంద్ వెన్ను దిగువ నుంచి వచ్చే ఆదేశాలను తు.చ. తప్పక పాటిస్తాను. అలాంటి స్థితిలోనే నాలో చాలా సంక్లిష్టమైన చర్యలు మెరుపు వేగంలో జరిగిపోతాయి. నా బ్లాడర్ దిగువనున్న స్పింక్టర్ వాల్వ్  క్షణకాలం గట్టిగా నొక్కేసినట్లు మూసుకుపోతుంది. దాంతో ఆ సమయంలో మూత్రం వెలువడే ఆస్కారమే ఉండదు. ఆ వెంటనే కండర సంకోచ తరంగాలు నా వరకు వ్యాపిస్తాయి. వాటి వల్ల వీర్యద్రవాన్ని నిల్వ చేసుకున్న నా సంచులు కూడా ఒత్తుకుపోతాయి. వాటి నుంచి ఇరవై శాతం వీర్యద్రవం తయారైతే, నాలో నేరుగా ఎనభై శాతం వీర్యద్రవం తయారవుతుంది. ఒత్తిడికి గురైనప్పుడు ఈ ద్రవం ఒక్కసారిగా మూత్రనాళం ద్వారం ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఈ ద్రవం దాదాపు ఒక టీస్పూన్ పరిమాణంలో ఉంటుంది.
 
వయసు మళ్లే కొద్దీ కష్టాలు
ఆనంద్‌కు వయసు మళ్లే కొద్దీ అతడి వృషణాల నుంచి తయారయ్యే హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో నా పరిమాణం అతడి చిన్నప్పటి పరిమాణానికి కుంచించుకుపోతానని హేతుబద్ధంగా ఊహించవచ్చు. అయితే, నిజానికి నాలోని పరిణామం ఇందుకు విరుద్ధంగా జరుగుతుంది. కుంచించుకుపోయే బదులు నా పరిమాణం పెరుగుతుంది. ఒక్కోసారి విపరీత పరిస్థితుల్లో ఏకంగా ఒక దబ్బకాయ పరిమాణానికి పెరిగిపోతాను. ఇప్పటికైతే ఆనంద్‌కు అలాంటి పరిస్థితేమీ లేదు గానీ, అతడికి యాభయ్యేళ్లు దాటితే నా పరిమాణం పెరిగే అవకాశాలు ఇరవై శాతం వరకు పెరుగుతాయి. ఎనభయ్యేళ్లు నిండితే ఆ అవకాశాలు ఎనభై శాతం వరకు పెరుగుతాయి. నా పరిమాణం కాస్తంత పెరిగితే ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు. అయితే, మూత్రాశయాన్ని నొక్కేసేంతగా పెరిగితేనే ఆందోళన చెందాలి. అలా పెరిగితే మూత్రం నెమ్మదిగా వెలువడటం, తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావడం, మూత్రనాళంలో ఇన్ఫెకన్లు ఏర్పడి మంటపుట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాంటప్పుడు వెంటనే వైద్యసహాయం తీసుకోవాలి. ఈ పరిస్థితి ఉన్నప్పుడు కాఫీ, టీ, ఆల్కహాల్ మానేయాలని వైద్యులు చెబుతారు. పరీక్షల ద్వారా తగిన కారణాన్ని కనుక్కుని మందుల ద్వారా ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నిస్తారు. తప్పనిసరి పరిస్థితులు తలెత్తితే ముందు మూత్రనాళంలోకి ట్యూబ్ పంపి మూత్రం బయటకు పోయే మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. ఇంకా అవసరమైతే శస్త్రచికిత్స చేసి నన్ను పూర్తిగా తొలగిస్తారు. లేకుంటే, పెన్సిల్ వంటి పరికరాన్ని మూత్రనాళం గుండా నా వరకు పంపి, మూత్రానికి అవరోధం కలిగిస్తున్న నాలోని కణజాలాన్ని విద్యుత్‌తరంగాలతో నాశనం చేస్తారు. ఇలాంటి చికిత్స పద్ధతులను తలచుకుంటేనే ఆనంద్‌కు భయంతో ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఇలాంటి ప్రక్రియలు తన పురుషత్వాన్ని తుదముట్టించేస్తాయనేదే అతడి ఆందోళన. అయితే, అది అపోహ మాత్రమే. ఇలాంటి చికిత్సల తర్వాత కూడా ఎనభైశాతం మంది పురుషులు సాధారణ లైంగిక జీవితాన్ని కొనసాగించగలుగుతారు.
 
కేన్సర్ సోకితేనే కష్టం

నా పరిమాణం కాస్త పెరిగినంత మాత్రాన ఆందోళన అక్కర్లేదు. ఇన్ఫెక్షన్ల వంటి ఇతరేతర కారణాల వల్ల వాపు వచ్చి నా పరిమాణం పెరగవచ్చు. అలాంటి పరిస్థితిని సాధారణ చికిత్సలతోనే చక్కదిద్దవచ్చు. అయితే, కేన్సర్ వల్ల నాలో అసాధారణమైన పెరుగుదల ఏర్పడితేనే కష్టం. యాభై ఏళ్లు నిండిన వాళ్లలో దాదాపు ఐదు శాతం మందికి ప్రొస్టేట్ కేన్సర్ సోకే అవకాశాలు ఉంటాయి. డెబ్బయ్యేళ్లు నిండిన వారిలో ఈ అవకాశాలు యాభై శాతం వరకు ఉంటాయి. దురదృష్టం ఏమిటంటే, అలాంటి వారిలో దాదాపు 90 శాతం మంది వైద్యుల వద్దకు వచ్చే సరికే వారి వ్యాధి ముదిరిపోయి ఉంటుంది. అయితే, నాకు సోకే కేన్సర్లు మిగిలిన కేన్సర్లలాగ వారాలు, నెలల వ్యవధిలోనే అంత త్వరగా వ్యాపించేవి కావు. ఇవి చాలా నెమ్మదిగా పెరుగుతాయి. శస్త్రచికిత్సకు వీలు లేనంతగా ఈ కేన్సర్లు వ్యాపించినా, మందుల ద్వారా జీవితకాలాన్ని పొడిగించేందుకు అవకాశాలు ఉన్నాయి. నాలోని కేన్సర్లు పురుష హార్మోన్ల ద్వారా పెరుగుతూ ఉంటాయి. పురుష హార్మోన్లను ఉత్పత్తిచేసే వృషణాలను తొలగించడం ద్వారా లేదా స్త్రీ హార్మోన్లు ఇచ్చి చికిత్స చేయడం ద్వారా ఈ కేన్సర్లను నయం చేయవచ్చు. అవసరమైతే రేడియేషన్ చికిత్స, స్త్రీ హార్మోన్ల చికిత్స కలిపి కూడా చేసే అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి నాలో మొదలైన కేన్సర్ ప్రాణాంతకం కాకుండా ఉండాలంటే, వైద్యులు నన్ను పూర్తిగా తొలగించడం ద్వారా రోగులను కాపాడుతూ ఉంటారు.    
 
 
పునరుత్పత్తిలో నేనే కీలకం
పునరుత్పత్తి వ్యవస్థలో నేనే (ప్రొస్టేట్) కీలకం. ఆనంద్ శరీరంలో నేనే గనుక లేకుంటే, అతడికి సంతానం పొందే అవకాశాలే దాదాపు ఉండవు. అతడి వీర్యద్రవానికి స్టోరేజీ యూనిట్‌లా పనిచేస్తాను నేను. ప్రతి స్ఖలనంలోనూ ఆనంద్ వృషణాలు దాదాపు ఇరవై కోట్ల వీర్యకణాలను విడుదల చేస్తాయి. నాలో తయారయ్యే ప్రత్యేక ద్రవం వాటిని డైల్యూట్ చేసి, వీర్యకణాల సంఖ్య పదోవంతుకు తగ్గేలా చేస్తుంది. ప్రొటీన్లు, ఎంజైమ్‌లు, కొవ్వులు, చక్కెరలతో ఉండే నా ద్రవం వీర్యకణాలకు పోషణనిస్తుంది. నా ద్రవంలోని క్షారగుణం స్త్రీ శరీరంలోని ఆమ్లగుణాన్ని తట్టుకుని మరీ వీర్యకణాలను బతికిస్తుంది. నా ద్రవంలో క్షారగుణమే లేకుంటే వీర్యకణాలు సజీవంగా స్త్రీ శరీరంలోని అండాన్ని చేరుకోలేవు.
 
నాలో మూడు భాగాలు
చిన్నగానే ఉంటాను గానీ, నాలో మూడు భాగాలు ఉంటాయి. ఒకదాని పక్కన ఒకటిగా నాలో ఉంటాయి. ఆనంద్ మూత్రనాళం నాలోని మధ్యభాగం మీదుగా  వెళుతుంది. నాకు ఇన్ఫెక్షన్ సోకినా, వాపు వచ్చినా లేదా కేన్సర్ సోకినా నాలోని భాగాలు పరిమాణానికి మించి పెరుగుతాయి. ఫలితంగా మూత్ర విసర్జనకు అంతరాయం కలుగుతుంది. ఇక అక్కడి నుంచి నానా సమస్యలు మొదలవుతాయి. బయటకు రాలేని మూత్రం బ్లాడర్‌లోనే మడుగు కట్టేస్తుంది. అందులోకి బ్యాక్టీరియా చేరి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయి. బ్లాడర్‌లో నిండిన మూత్రం తిరిగి కిడ్నీలకు చేరి, అక్కడి నుంచి రక్తంలో కలిసిపోయి యురీమిక్ పాయిజనింగ్ కలిగిస్తుంది. యమయాతన కలిగించే ఈ పరిస్థితి క్రమంగా మరణానికి దారితీస్తుంది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement