పిల్లలు బాల్యాన్ని ఆస్వాదించాలి. బాల్యపు ఛాయలు వీడకముందే పెద్దయితే ఎలా? ఈ అవాంచిత మార్పుకు కారణాలు అనేకం. అర్లీ ప్యూబర్టీలో సౌందర్య సాధనాల పాత్ర చాలా పెద్దదని చెబుతోంది యూఎస్‌లోని అధ్యయన సంస్థ.
చిన్నప్పుడే పెద్దవుతున్నారు!
బాలికల్లో అర్లీ ప్యూబర్టీకి దారి తీస్తున్న కారణాల మీద యూఎస్‌లో ఒక అధ్యయనం జరిగింది. 1990ల కాలంతో పోలిస్తే ఇటీవల బాలికలు చాలా త్వరగా యుక్తవయసులోకి వస్తున్నారు. పునరుత్పత్తి వ్యవస్థ పరిణతి చెంది రుతుక్రమం మొదలవుతోంది. యూఎస్‌లో ప్రతి పదిమంది బాలికల్లో ఎనిమిది మంది చాలా చిన్న వయసు నుంచే మేకప్ వేసుకుంటున్నట్లు వెల్లడైంది.
అర్లీ ప్యూబర్టీకి అల్ట్రా ప్రాసెస్‌డ్ ఆహారం కూడా ఒక కారణమే అయినప్పటికీ బాలురతో పోలిస్తే బాలికల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపించడానికి కారణం సౌందర్య సాధనాలుగా గుర్తించారు. రోజువారీ డిటర్జెంట్‌లు, పెర్‌ఫ్యూమ్‌ల తోపాటు మేకప్ సాధనాల పాత్ర చాలా ఎక్కువగా ఉంటోందని అంచనా.
యూఎస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఇదే అంశం మీద నిర్వహించిన జీబ్రాఫిష్ పరిశోధన కూడా ఈ రసాయనాల ప్రభావాన్ని నిర్ధారించింది. అర్లీ ప్యూబర్టీ కారణంగా పదేళ్లలోపే రుతుక్రమం మొదలవడం ఒక సమస్య అయితే దీర్ఘకాలంలో స్థూలకాయం, గుండె సమస్యలు, బ్రెస్ట్ క్యాన్సర్ తోపాటు అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉందని ఎండోక్రైనాలజీ జర్నల్ ప్రచురించింది.
కేన్సర్ కూడా ముందుకొచ్చింది!
అల్ట్రా ప్రాసెస్‌డ్ ఫుడ్ కారణంగా పెరుగుతున్న క్యాన్సర్‌ల విషయానికి వస్తే... గతంలో క్యాన్సర్ బారిన పడడానికి సగటు వయసు 70 ఏళ్లుగా ఉండేది. ఇప్పుడు 35 ఏళ్ల లోపే క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్ పరిశోధనల్లోనూ సౌందర్యసాధనాల పాత్రను ప్రధానంగా గుర్తిస్తున్నారు నిపుణులు. అల్ట్రా ప్రాసెస్‌డ్ కాస్మటిక్స్ స్కిన్ క్యాన్సర్‌కు కారణమవుతున్నాయి. ముఖం, జుట్టు, చర్మం అందంగా కనిపించడానికి వాడే సౌందర్యసాధనాల్లో ఉపయోగించే రసాయనాల కారణంగా ఎగ్జిమా, వెయిట్ గెయిన్ సమస్యలు కూడా వస్తున్నాయని అర్థమైంది.
కొన్ని సందర్భాలో అర్లీ ప్యూబర్టీకి దారి తీసే పరిస్థితులు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే మొదలవుతాయి. గర్భిణిగా ఉన్నప్పుడు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయితే ఆ ప్రభావం పుట్టే బిడ్డ మీద ఉంటుందని కొన్ని అధ్యయనాలు తెలియచేశాయి. నెయిల్ పాలిష్‌లలో ఉండే ఫార్మాల్డిహైడ్ వంటి కొన్ని విషపూరిత రసాయనాలు కేన్సర్‌కు కారణమవుతున్నాయి. డిబ్యూటిల్‌ఫ్తాలేట్ పునరుత్పత్తి వ్యవస్థ మీద దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. మూత తీయగానే ఘాటు వాసన వచ్చే నెయిల్ పాలిష్‌లు, గ్లిట్టర్ పాలిష్‌లు మరింత హానికరమని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది.
మన దేశంలో బాలికల్లో కాస్మటిక్స్ వాడకం అమెరికాతో పోలిస్తే అంత తీవ్రంగా లేకపోయినప్పటికీ స్థూలకాయం, దేహ కదలికలు తగినంతగా లేని జీవనశైలి, చదువు ఒత్తిడి బాలికల్లో అర్లీ ప్యూబర్టీకి కారణమవుతున్నాయి. కాబట్టి తోటి పిల్లలతో కలిగి దేహానికి శ్రమ కలిగించే ఆటలను ప్రోత్సహించాలని, పిల్లలను పిక్‌నిక్‌లకు తీసుకువెళ్లడం ద్వారా వాళ్ల దృష్టిని అనేక ఇతర సామాజికాంశాల మీదకు మళ్లించాలని నిపుణులు సూచిస్తున్నారు. నాట్య ప్రదర్శనలు, ఇతర స్టేజ్ షోలలో పాల్గొనే పిల్లలకు మేకప్ తప్పని సరి అవుతుంది.
అలాంటప్పుడు నిపుణుల సూచన మేరకు హానికరం కాని సౌందర్య సాధనాలను మాత్రమే ఉపయోగించాలి. మన దైనందిన జీవితంలో డిటర్జెంట్‌ల వాడకం తప్పదు, పైగా వాటి ప్రమాణాలను సంస్థాగతంగా తప్ప వ్యక్తులుగా నిర్దేశించలేం. మరో ముఖ్యమైన విషయం... రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగే అలవాటుంటే ఇక ముఖం మీద ఏ సౌందర్యసాధనమూ అవసరం లేదని కూడా అధ్యయనాలు సూచిస్తున్నాయి.
మేకప్ అవసరం లేదు!
అర్లీ ప్యూబర్టీ ఆందోళన కలిగించే విషయమే. రసాయనాల ప్రభావానికి సంబంధించిన పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిజానికి దేహ ఆరోగ్యాన్ని కచ్చితంగా కాపాడుకుంటే సన్‌స్రీన్, మాయిశ్చరైజర్ తప్ప ఇతర సౌందర్యసాధనాల అవసరమే ఉండదు. బాల్యంలోనే వీటి మాయలో పడుతున్నారంటే ప్రకటనల ప్రభావం తోపాటు అవి అందుబాటులో ఉండడం కూడా కారణమే.
కొన్ని ప్రత్యేకమైన, అరుదైన సందర్భాల్లో మేకప్ తప్పనిసరి కావచ్చు. అలా ఉపయోగించేటప్పుడు కూడా ఆ బాలికలను డాక్టర్‌కు చూపించి వారి అభిప్రాయాన్ని తీసుకోవాలి. బాలిక చర్మతత్వాన్ని బట్టి సైడ్ ఎఫెక్ట్స్ లేని మేకప్ తదితర సౌందర్యసాధనాలను సూచించగలుగుతారు.
– డాక్టర్ స్వప్నప్రియ, డర్మటాలజిస్ట్
(చదవండి: డాటర్ ఆట చూసి అమ్మ అంపైరయింది)
Comments
Please login to add a commentAdd a comment